National

విమానంలో కూడా ఫైల్స్ చదువుతూ.. వరుస భేటీలతో ప్రధాని మోదీ బిజీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే..! భారత్ నుండి అమెరికాకు వెళ్ళడానికి తక్కువలో తక్కువ 15 గంటలు సమయం ఉండగా.. ఆ సమయంలో కూడా ప్రధాని మోదీ రెస్ట్ తీసుకోకుండా ఫైల్స్ ను విమానంలో తిరగేశారు. ప్రధాని అయ్యాక ఒక్క రోజు కూడా సెలవు తీసుకోని ప్రధాని మోదీ విమానంలో కూడా ఫైల్స్ ను పరిశీలించడం చాలా మందికి ఆశ్చర్యానికి గురి చేసింది. బోయింగ్ విమానంలో పలు ఫైల్స్ ను ఆయన చెక్ చేసుకుంటున్న ఫోటోను పోస్టు చేశారు. ‘లాంగ్ జర్నీ అంటే పనికి సంబంధించిన పత్రాలు పరిశీలించే అవకాశం ఉంది కదా’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. ఈ ఫోటోపై పలువురు మంత్రులు, నేతలు మాట్లాడుతూ ‘నిరంతరం దేశ సేవలోనే’ అంటూ కామెంట్ చేశారు. బీజేపీ నేత కపిల్ మిశ్రా మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కూడా ఇలాగే విమానంలో పనికి సంబంధించిన పత్రాలు పరిశీలిస్తున్న ఫొటోను షేర్ చేశారు. ఇద్దరూ ఇలా విమానాల్లో కూడా బిజీగా ఉన్నారని అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో తొలిసారి శ్వేతసౌధంలో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ గెలవడం చారిత్రాత్మకమని.. ప్రపంచానికి ఆమె ఒక స్ఫూర్తి అని మోదీ ప్రశంసించారు. భారత్-అమెరికా సహజ భాగస్వాములన్నారు. రెండు దేశాలు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలని, రెండూ ఒకేరకమైన విలువలు, భౌగోళికమైన రాజకీయ ప్రయోజనాలు కలిగి ఉన్నాయని అన్నారు. భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలో సహకరించినందుకు అమెరికాకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. అధ్యక్షుడు బైడెన్, కమల నేతృత్వంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నత స్థానానికి చేరుకుంటాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమలా హారిస్‌ను మోదీ భారత్ పర్యటనకు ఆహ్వానించారు. కమలా హారిస్ మాట్లాడుతూ.. అమెరికాకు భారత్ ప్రత్యేక భాగస్వామి అన్నారు. కరోనా ప్రారంభంలో టీకాలకు భారత్ వనరుగా ఉందని అన్నారు. టీకా ఎగుమతుల పునరుద్ధరణపై భారత్ చేసిన ప్రకటనను కమల స్వాగతించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత మన దేశాలపైనే ఉందని కమల అన్నారు.

అమెరికా పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోదీ వరుస భేటీలతో బిజీగా ఉన్నారు. డిజిటల్ ఇండియా సాకారం దిశగా ఆయన కీలక వ్యక్తులతో భేటీ అయ్యారు. వాషింగ్టన్ లోని ద విల్డార్డ్ ఇంటర్ కాంటినెంటల్ హోటల్ లో అడోబ్ సీఈవో శంతను నారాయణ్, క్వాల్ కామ్ సీఈవో క్రిస్టియానో ఇ అమోన్, వివేక్ లాల్ (జనరల్ అటామిక్స్), మార్క్ విడ్మార్ (ఫస్ట్ సోలార్), స్టీఫెన్ ఏ ష్వార్జ్ మాన్ (బ్లాక్ స్టోన్)లతో సమావేశాలు నిర్వహించారు.

Related Articles

Back to top button