అనంతపురం రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

0
872

ఆదివారం నాడు అనంతపురం జిల్లాలోని ఉరవకొండ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇన్నోవా వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. వివాహ వేడుకకు ఇన్నోవా వాహనంలో బళ్లారి నుంచి నింబగల్లుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆదివారం సాయంత్రం అనంతపురం-బళ్లారి జాతీయ రహదారి విడపనకల్‌ మండలం కొటాలపల్లి సమీపంలో ఇన్నోవా కారు వస్తున్న సమయంలో ఓ లారీ వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 9 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు మహిళలు, ఒక బాలుడు, ఇద్దరు పురుషులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు బొమ్మనహళ్‌కు చెందిన వారు కాగా ఉరవకొండ మండలం లక్కవరం గ్రామానికి చెందిన ముగ్గురు ఉన్నారు. మృతుల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోకా వెంకటప్ప కూడా ఉన్నారు. ఆయన కుమార్తె వివాహానికి బళ్లారి వెళ్లి తిరిగి వస్తుండగానే ఈ దుర్ఘటన జరిగింది. కోకా వెంకటప్ప 25 సంవత్సరాలుగా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పనిచేస్తున్నారు.

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు, గాయాలైన వారికి ఎక్స్‌ గ్రేషియా ప్రకటించారు. ‘ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం చాలా బాధ కలిగించింది. మృతుల బంధువులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పిఎంఎన్‌ఆర్‌ఎఫ్) నుంచి ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు అందజేస్తామని ‘ ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది.