వాళ్లు రూపాయిలో 85 పైసలు నొక్కేశారు

0
893

యువత కలలు కనే వేగవంతమైన అభివృద్ధికి రాజకీయ స్థిరత్వం అత్యావశ్యకమని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జర్మనీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ థియేటర్ యామ్ పోస్ట్‌డామర్ ప్లాట్‌లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. దాదాపు గంట సేపు సాగిన ప్రధాని మోదీ ప్రసంగానికి ప్రవాస భారతీయులు ఆనంద పరవశులయ్యారు. ‘భారత్ మాతా కీ జై’, ‘మోదీ హై తో ముమ్కిన్ హై’ , ‘2024, మోడీ వన్స్ మోర్’ నినాదాలతో ఆ ప్రాంగణం హోరెత్తిపోయింది.

అంతర్జాతీయ స్థాయిలో భారతప్రగతికి ప్రవాస భారతీయులు సహకరించాలని భారత ప్రధాని నరేంద్ర మోది కోరారు. భారత్ లో కాంగ్రెస్ పార్టీ మూడు దశాబ్దాల అస్థిరతకు ఒక్క బటన్ నొక్కడం ద్వారా చెక్ పడిందని అన్నారు. ఎన్నికల్లో ప్రజా తీర్పును ఉద్ధేశించి ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. డిజిట‌ల్ పేమెంట్ మెకానిజ‌మ్ సాధించిన విజ‌యాన్ని ప్ర‌ధాన మంత్రి మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. డిజిటల్ చెల్లింపు విధానం విజయవంతంగా కొనసాగుతోందని ఆయన తెలిపారు. రియల్ టైమ్ డిజిటల్ పేమెంట్స్ ప్రపంచంలో భారత్ వాటా 40 శాతానికి పైగా ఉందన్నారు.

డిజిటల్ పేమెంట్ సిస్టమ్‌ ద్వారా రైతులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు వేస్తున్నామన్నారు. లబ్దిదారుడికి రూపాయి పంపిస్తే కేవలం 15 పైసలే చేరుతుందని ఇకపై ఏ ప్రధానమంత్రీ విచారించాల్సిన అవసరం లేదని మోదీ అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమార్క పర్వాలపై ప్రధాని మోదీ ఘాటు విమర్శలు చేశారు. ఇచ్చిన చేతితోనే 85 పైసలను నాటి కాంగ్రెస్ పాలకులు తీసేసుకున్నారని ఆయన అన్నారు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ మోడీ ఈ విమర్శలు చేశారు. గత ఎనిమిదేళ్లలో తమ ప్రభుత్వం 22 లక్షల కోట్ల రూపాయలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి బదిలీ చేసిందని ప్రధాని మోదీ చెప్పారు.

నవీన భారత దేశం అంకితభావంతో ముందుకు సాగాలని నిశ్చయించుకుందని ప్రధాని మోదీ తెలిపారు. దేశానికి అతి కీలకమైన 21వ శతాబ్దంలో, సరైన లక్ష్యంతో, సమగ్రమైన ప్రణాళికతో ముందుకు సాగాలని భారత్ కృత నిశ్చయంతో వుందని ఆయన చెప్పారు. లక్ష్య సాధన సవ్యదిశలో సాగి ఉత్తమ ఫలితాలు అందుకోవాలని అన్నారు. భవిష్యత్ భద్రత గురించి కాక సవాళ్లను ఎదుర్కోవడానికి సంసిద్ధంగా వుండాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఎన్నో ఆవిష్కరణలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. 2014లో కేవలం 200 నుంచి 400 వరకు స్టార్టప్‌లు మాత్రమే ఉన్నాయని, అయితే, ప్రస్తుతం భారతదేశంలో స్టార్టప్‌ల సంఖ్య 68 వేలకు పైగా ఉందని చెప్పారు. డజనుకు పైగా యునికార్న్‌లు ఉన్నాయని ఆయన తెలిపారు. యూనికార్న్ ల నిలయంలో ఇప్పటికే 10 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌తో డెకా-కార్న్స్‌గా మారారని ప్రధాని వ్యాఖ్యానించారు.

భారతదేశం ఇప్పుడు అన్ని రంగాలలో వేగవంతమైన పురోగతి సాధిస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. జీవన సౌలభ్యం, జీవన నాణ్యత, ఉపాధి సౌలభ్యం, విద్య నాణ్యత, వ్యాపార సౌలభ్యం, ప్రయాణ నాణ్యత, ఉత్పత్తుల నాణ్యత – ఇలా అన్ని రంగాలలో భారత్ విజయపంధాలో సాగుతోందని మోదీ తెలిపారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

eighteen − six =