ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. శుక్రవారం అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్‌కు వెళుతుండగా అంబులెన్స్‌కు దారి ఇచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్ కొద్దిసేపు ఆగింది. ప్రధాని కాన్వాయ్‌లో భాగమైన రెండు SUVలు అంబులెన్స్‌కు దారినిచ్చేందుకు అహ్మదాబాద్-గాంధీనగర్ రహదారిపై నెమ్మదిగా ఎడమవైపుకు వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అహ్మదాబాద్‌లోని దూరదర్శన్ సెంటర్ దగ్గర తన బహిరంగ ర్యాలీని ముగించుకుని గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌కు ప్రధాని మోదీ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రధాని వెళుతున్న మార్గంలో ఆయన కాన్వాయ్ వెనుక ఓ అంబులెన్స్ వస్తుండగా, దానిని గమనించి కాన్వాయ్‌ను రోడ్డుపైనే నిలిపివేయించి అంబులెన్స్‌కు దారి ఇచ్చారు. అంబులెన్స్ తన కాన్వాయ్‌ను దాటిన తర్వాత మోదీ తన కాన్వాయ్‌ను ముందుకు కదిలించారు. తన గుజరాత్ పర్యటనలో రెండవ రోజు, ప్రధాని మోదీ గాంధీనగర్-ముంబై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. అహ్మదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశను కూడా ప్రారంభించారు.