ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల చివరి దశకు ముందు బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ మెగా రోడ్‌షో నిర్వహించారు. ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీకి బ్రహ్మరథం పట్టారు. ఆయన కాన్వాయ్ పై పూల వర్షం కురిపించారు. ప్రధాని లోక్‌సభ నియోజకవర్గంలో భాగమైన పవిత్ర వారణాసి నగరంలో మూడు కిలోమీటర్లకు రోడ్ షోను మోదీ నిర్వహించారు. మోదీ ఓపెన్ రూఫ్ వాహనంలో నిలబడి ప్రయాణించగా.. వెనుక ఇద్దరు భద్రతా సిబ్బంది నిలబడ్డారు. ప్రజలు “జై శ్రీ రామ్”, “హర్ హర్ మహాదేవ్” అని నినాదాలు చేశారు. మోదీ వారికి అభివాదం చేస్తూ కనిపించారు. ప్రధాని టోపీ, గమ్చా (టవల్) ధరించారు. రోడ్‌షో అంతటా జనాలు మోదీని అనుసరించారు. చాలా మంది బాల్కనీలలోనూ, పైకప్పులపై నిలబడి ఉండగా ఆయన వారి వైపు చూస్తూ అభివాదం చేశారు.
మార్చి 7న పోలింగ్‌కు ముందు రెండు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన ఆయన మీర్జాపూర్ ర్యాలీలో ప్రసంగించిన తర్వాత మోదీ వారణాసి లోక్‌సభ నియోజకవర్గానికి వచ్చారు. ఇతర రాజకీయ ప్రముఖులు కూడా శుక్రవారం వారణాసికి వెళ్లారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ జిల్లాలో ర్యాలీలు నిర్వహించారు.
మాల్దాహియా క్రాసింగ్ వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి మోదీ ప్రదర్శన ప్రారంభించారు. ప్రధానమంత్రి కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించే ముందు కాన్వాయ్ మూడు కిలోమీటర్లు ప్రయాణించింది. అనంతరం లంకా చౌక్‌కు చేరుకొని మదన్ మోహన్ మాలవ్య విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ముగించారు. డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ (డీఎల్‌డబ్ల్యూ) గెస్ట్‌హౌస్‌లో మోదీ రాత్రి బస చేశారు. కంటోన్మెంట్, వారణాసి నార్త్, వారణాసి సౌత్‌లోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లను మోదీ రోడ్‌షో కవర్ చేసింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రచారానికి చివరి రోజైన శనివారం ప్రధానమంత్రి తన వారణాసి పర్యటనను ముగించనున్నారు.
నగరంలోని స్థానిక టీ స్టాల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ‘కుల్హాద్ చాయ్’ని ఆస్వాదించారు. వార్తా సంస్థ ANI షేర్ చేసిన వీడియోలో,ఆయన స్థానిక టీ స్టాల్‌లో కూర్చుని ప్రజలతో సంభాషించడం, టీని ఆస్వాదించడం చూడవచ్చు. చాలా మంది వ్యక్తులు మోదీ పాదాలను తాకడం వీడియోలో కనిపిస్తుంది.