శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇంటి లోపలికి ఆందోళనకారులు చొరబడిన సంగతి తెలిసిందే..! అయితే రాజపక్ష అక్కడి నుండి వేరే ప్రాంతానికి వెళ్లిపోయాడని తెలుస్తోంది. శ్రీలంక ప్రజలకు భారత్ మద్దతు ప్రకటించింది. సంక్షేమం, అభివృద్ధి దిశగా ప్రజాస్వామ్య విలువలతో, రాజ్యాంగ వ్యవస్థల అండతో తమ ఆశలను సాకారం చేసుకునేందుకు ఉద్యమిస్తున్న శ్రీలంక ప్రజలకు సంఘీభావం ప్రకటిస్తున్నాం అంటూ భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. శ్రీలంకకు ఇప్పటిదాకా 3.8 బిలియన్ డాలర్ల మేర ఆర్థికసాయం అందించినట్టు తెలిపింది. శ్రీలంకలో తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది.
ఇలాంటి సమయంలో ప్రధాని మోదీపై టీఎంసీ ఎమ్మెల్యే ఇద్రిస్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు పట్టిన గతే మోదీకి కూడా పడుతుందని అన్నారు. ఆయన మాదిరే మోదీ కూడా దేశం వదిలి పారిపోతారని అన్నారు. మోదీ ప్రభుత్వం అన్ని విధాలా ఘోరంగా విఫలమయిందని.. బీజేపీ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని చెప్పారు. పాలనలో మోదీ పూర్తిగా ఫెయిల్ అయ్యారని.. ప్రస్తుత పరిస్థితులు మరింత దిగజారుతాయని అప్పుడు మోదీ కూడా రాజీనామా చేసి, దేశం వదిలి పారిపోతారని చెప్పారు.