గాంధీకి నివాళులు అర్పించిన ప్రధాని మోదీ

0
808

భారతప్రధాని నరేంద్ర మోదీ జాతిపిత మహాత్మా గాంధీకి నివాళి అర్పించారు. ఆదివారం గాంధీ 153వ జయంతి కావడంతో రాజ్ ఘాట్ లోని గాంధీ సమాధి వద్దకు వెళ్లారు మోదీ. సమాధి వద్ద పుష్పగుచ్చాన్ని ఉంచి నివాళులు తెలిపారు. ‘‘మహాత్మా గాంధీకి నివాళులు. నేటి గాంధీ జయంతి మరింత ప్రత్యేకం. ఎందుకంటే భారత్ ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని జరుపుకుంటోంది. బాపూ సిద్ధాంతాలకు అనుగుణంగా మనం నడుచుకోవాలి. ప్రజలు ఖాదీ, చేతి ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా గాంధీకి నివాళి అర్పించాలి’’అని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు.

ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రధాన కార్యాలయంలో మహాత్మా గాంధీ సందేశం వినిపించారు. గాంధీ ప్రసంగించారనే భావన కలిగేలా భారత్ యూఎన్‌ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేసింది. ప్రొజెక్టర్‌ సాయంతో గాంధీ హోలోగ్రామ్‌ను తెరపై ప్రదర్శించి, ఆయన ఆడియో సందేశాన్ని వినిపించింది. గాంధీ హోలోగ్రామ్‌ను యూఎన్‌లో ప్రదర్శించడం ఇదే తొలిసారి. అక్టోబర్‌ 2న గాంధీ జయంతిని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా నిర్వహించుకోవాలని ఐక్యరాజ్య సమితి 2007లో తీర్మానం చేసింది.