More

  గ్లోబల్ లీడర్‎గా మళ్లీ మోదీ..! దరిదాపుల్లో లేని బైడెన్..!!

  ప్రధాని మోదీ అంతర్జాతీయంగా మరోసారి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఈ సారి 77 శాతం అప్రూవల్ తో ప్రపంచ నాయకులందరినీ వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచారు. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో అగ్రదేశాల నాయకులు బైడెన్, పుతిన్.. మోదీ దరిదాపుల్లోనూ లేరు. ఈ విషయం తాజాగా ‘మార్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటలిజెన్స్ సర్వే సంస్థ ఇచ్చిన రిపోర్టులో తెలిపింది. ఈ సర్వేలో ప్రపంచ నాయకులందరిలో ప్రధాని మోదీకి 77 శాతం అప్రూవల్ రేటింగ్ మొదటి స్థానంలో ఉండగా,.. 69 శాతంతో ఆండ్రిస్ మాన్యువల్ లోపేజ్ ఓబ్రాడర్ రెండో స్థానంలో ఉన్నారు. ఇక, 56 శాతంతో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని అల్బేనిస్ మూడోస్థానంలో ఉన్నారు. అగ్రరాజ్యం అంటూ విర్రవీగే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ రేసులో కేవలం 41 శాతంతో తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకోగా.. ఇటీవలే బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన ప్రవాస భారతీయుడు రిషి సునాక్ పదో స్థానంలో నిలిచాడు.

  ఇక ఈ జాబితాను బీజేపీ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది. మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ నాయకుడిగా గుర్తింపు పొందారని, ప్రపంచ నాయకులందరిలో ప్రధాని అగ్రస్థానంలో ఉన్నారని తెలిపింది. ఈ సర్వే నిర్వహించే మార్నింగ్ కన్సల్ట్ సంస్థ ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బ్రెజిల్, జర్మనీ, మెక్సికో, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, భారత్, స్పెయిన్, స్వీడన్, అమెరికాలలోని ప్రభుత్వ నేతల అప్రూవల్ రేటింగ్స్‌ను ట్రాక్ చేస్తూ ఉంటుంది. అంతర్జాతీయంగా రోజుకు సుమారు 20 వేల ఇంటర్వ్యూలు చేస్తుంది. ఈ ఇంటర్యూల్లో దేశంలోని పరిస్థితులపై పలు ప్రశ్నలు వేస్తుంది. ప్రజాసమస్యలపై నాయకులు స్పందించే తీరును ప్రతిసారీ అంచనా వేస్తుంది. అంతేకాదు, దేశంలో తీసుకొచ్చే సంస్కరణలు, తీసుకునే నిర్ణయాలపై ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తుంది. ఈ సర్వేను కేవలం కొద్దిసార్లు కాకుండా ప్రతిసారీ రియల్ టైం డేటాతో అందుబాటులోకి ఉంచుతుంది. ఈ ఇంటర్యూలను కూడా ఒక్కసారి మాత్రమే కాకుండా ఒకే వ్యక్తిని ఏడురోజులపాటు ఇంటర్యూలు చేసి యావరేజ్ డేటాను ఆధారంగా అప్రూవల్ రేటింగ్ ను తీసుకుంటారు. ఈ శాంపిళ్ళ సంఖ్యను దేశంలోని జనాభాను ఆధారంగా చేసుకుని నిర్వహిస్తారు. అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో ఎక్కువ శాంపిళ్ళను సేకరిస్తే తక్కువ జనాభా ఉన్న దేశాల్లో తక్కువ శాంపిళ్ళను తీసుకుంటారు.

  మార్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం అమెరికా లాంటి దేశాల్లో దాదాపు 45 వేల మందిని శాంపిల్ సైజుగా తీసుకుంటారని తెలుస్తోంది. ఈ విధంగా తీసుకున్న డేటా ఆధారంగా ప్రజలు ఎక్కువగా ఎవరిని తమ నాయకుడిగా భావిస్తున్నారు, ఏ నాయకుడిపై సంతృప్తితో ఉన్నారనే విషయాలపై సర్వేను విడుదల చేస్తుంది. అయితే ఈ సర్వేలు నిర్వహించే క్రమంలో ఇంటర్యూలు తీసుకునే వారి తడబాటువల్లనో లేక కొన్నిసార్లు నాయకులపై అభిమానం ఉండటం వల్లనో దేశంలోని సమస్యలను సరిగ్గా ప్రస్తావించకపోవడం వల్ల సర్వే పూర్తి ఖచ్చితత్వంతో రాదు. అందుకే ఈ సర్వే సంస్థలు కూడా ఈ అప్రూవల్ శాతానికి ఒకటి నుంచి నాలుగు శాతం ఎక్కువ తక్కువ అయ్యే అవకాశాలుంటాయని ఈ సర్వే సంస్థ తెలిపింది.

  ఇలాంటి సర్వేల్లో ప్రధాని మోదీ మొదటి స్థానంలో నిలవడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ చాలా సార్లు గ్లోబల్ లీడర్లలో మొదటి స్థానం సంపాదించారు. 2020 లో నిర్వహించిన సర్వేలో మోదీకి గరిష్టంగా 84 శాతం అప్రూవల్ రేటింగ్ దక్కింది. కొవిడ్ లాక్‎డౌన్ సమయంలో మోదీ ప్రజల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలు, మహమ్మారి కట్టడి కోసం చేపట్టిన చర్యలపై ప్రజలు సంతృప్తితో ఉండటం వల్లే అప్పట్లో ఈ రేటింగ్ లభించిందని భావిస్తున్నారు. అయితే ఈ సంవత్సరంలో కాస్తంత రేటింగ్ తగ్గినా కూడా మోదీ తన మొదటి స్థానాన్ని పదిలంగా ఉంచుకున్నారు. అంతేకాదు, మొదటి, రెండు స్థానాలకు కూడా అప్రూవల్ రేటింగ్‎లో భారీ తేడా ఉంది. రెండవ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ప్రధానికి మోదీకి దాదాపు 21 శాతం తేడా ఉంది. దీంతో ప్రపంచ నేతల్లో మోదీ స్థానానికి తిరుగులేదని మరోసారి నిరూపితమైంది.

  Trending Stories

  Related Stories