మోదీ నోట ‘ఖాకీ’ ఖబర్..! ‘వన్ యూనిఫామ్’ రాబోతోందా..?

0
765

ఇటీవలికాలంలో దేశంలో ‘వన్ నేషన్’ నినాదం మారుమోగుతోంది. దేశంలో అన్నింటా ఒకే విధానం, ఒకే నినాదం ఉండాలని ప్రధాని మోదీ సంకల్పించారు. తద్వారా దేశానికి ఆర్థికభారాన్ని తగ్గించి.. ప్రగతికి బాటలు వేయాలన్నది ఆయన ఉద్దేశం. ఆ దిశగా ప్రధాని వేగంగా అడుగులు వేస్తున్నారు. వన్ నేషన్, వన్ పెన్షన్ ను అమల్లోకి తెచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటికే వన్ నేషన్, వన్ ఎలక్షన్ ను అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తాజాగా పోలీస్ శాఖలో కూడా ఈ వినూత్న నిర్ణయాన్ని అమలు చేసేందుకు మోదీ ప్రభుత్వం రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసులకు ఒకే విధమైన యూనిఫామ్ తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇటీవల ప్రధాని నోటి వెంట ‘ఒకే దేశం, ఒకే యూనిఫామ్’ అనే మాట రావడం ఇందుకు బలం చేకూర్చుతోంది.

నిజానికి, దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో తప్పితే.. దాదాపు అన్ని రాష్ట్రాల్లో పోలీస్ డ్రెస్ ఖాకీ రంగులోనే వుంటుంది. కోల్‎కతా పోలీసుల డ్రెస్ తెలుపురంగులో ఉంటే.. ఢిల్లీ పోలీసులు నీలం రంగు యూనిఫామ్ లో దర్శనమిస్తారు. మిగతా రాష్ట్రాల్లో పోలీస్ యూనిఫామ్ చాలావరకు ఖాకీ రంగులోనే కనిపించినా.. కొన్ని చోట్ల ముదురు రంగులో, మరికొన్ని చోట్ల లేత రంగులో ఉంటుంది. అయితే, బ్యాచ్‎లు, బెల్టులు, హోదా చిహ్నాలు, క్యాప్‎లు, హ్యాట్‎ల విషయంలో మాత్రం చాలా తేడాలుంటాయి. ఉదాహరణకు, పుదుచ్చేరి పోలీసులు ఖాకీ యూనిఫామ్ పై ఎరుపు రంగు హ్యాట్లు ధరిస్తారు.

పోలీసుల యూనిఫామ్ విషయం‎లో ఒక దేశంలోనే ఇన్ని తేడాలు ఎందుకు..? అన్ని రాష్ట్రాల పోలీస్ సిబ్బందికి ఒకేరకమైన యూనిఫామ్ ఉంటే సరిపోతుంది కదా..! పైగా ఇండియన్ పోలీస్ అంటే ఇలా ఉంటాడని ప్రపంచ దేశాల్లో మనవాళ్లకు గుర్తింపు కూడా లభిస్తుంది. అంతేకాదు, దేశవ్యాప్తంగా ఒకే యూనిఫామ్ అమలు చేస్తే.. ఆర్థిక భారం కూడా తగ్గుతుంది. అందుకే, అన్ని రాష్ట్రాల పోలీసులకు ఒకే రకమైన యూనిఫామ్ ను అమలు చేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దేశవ్యాప్తంగా ఒకే విధానాలను ప్రవేశపెట్టేందుకు, ప్రధాని చేస్తున్న విస్తృత ప్రయత్నాల్లో.. ‘వన్ యూనిఫామ్ టు పోలీస్’ అనేది కూడా ఒకటి. ఇటీవల రాష్ట్ర హోం మంత్రులు, పోలీసు శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ తన మదిలోని మాటను పంచుకున్నారు.

దేశవ్యాప్తంగా పోలీసుల గుర్తింపు ఒకేలా వుండాలనేది తన అభిప్రాయమని, అయితే ఇది ఒక ఆలోచన మాత్రమే అని అన్నారు. ఎవరి మీద దీనిని రుద్దే ప్రయత్నాలు చేయడం లేదని తెలిపారు. ఒక్కసారి దీనిపై దృష్టి సారిస్తే.. ఇందులో వుండే బహుళ ప్రయోజనాలు కనిపిస్తాయని అన్నారు. పోలీసులకు, ఒకే దేశం, ఒకే యూనిఫామ్ అనే విషయంపై అందరూ కూలంకషంగా ఆలోచనలు సాగించాలని ఆయన కోరారు. సాధ్యమైనంత త్వరగా ఈ చర్య అమలు చేసేందుకు ప్రయత్నించడం ఉత్తమని మోదీ చెప్పారు.

మెజారిటీ పోలీసులు ఖాకీ రంగు దుస్తులను ధరించినప్పటికీ.. కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీస్ యూనిఫారాల్లో అసమానతలు ఉన్నాయి. ఈవిధంగా వేర్వేరుగా కాకుండా దేశంలోని పోలీసులంతా ఒకే యూనిఫాం ధరిస్తే బాగుంటుందనే తన అభిప్రాయాన్ని మోదీ వ్యక్తపరిచారు. వన్‌ నేషన్, వన్ యూనిమ్ పోలీసులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించడంతో పాటు చట్టం అమలుకు కామన్ ఐడెంటిటీ సైతం అందిస్తుందని చెప్పారు.

నిజానికి, దేశంలో ఇప్పటికే కొన్ని శాఖల్లో ‘వన్ నేషన్’ విధానం అమలవుతోంది. దేశవ్యాప్తంగా ఒకే తరహా విధానాల్లో భాగంగా గత ఆగస్ట్ లో కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ మంత్రిత్వ శాఖ ఒకే దేశం, ఒకే ఎరువుల పథకాన్ని అమలు చేసింది. 2019 ఆగస్ట్ నెలలో – ఒక దేశం ఒక రేషన్ కార్డ్ – పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ఇక ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ కాంక్షను ప్రధాని మోదీ పలుమార్లు వెల్లడించారు. అన్ని ఎన్నికలకు ఒకే ఓటరు జాబితా వుండాలని సైతం సూచించారు. ఒక దేశం-ఒక రేషన్ కార్డ్, ఒక దేశం- ఒక మొబిలిటీ కార్డ్, ఒక దేశం- ఒక గ్రిడ్, ఒక దేశం – ఒక సంకేత భాష.. ఇలా దేశానికి సంబంధించి ఎన్నో ఏకరీతి విధానాలు ఎంతో ప్రయోజనకరంగా వుంటాయి. ఈ చర్యల వల్ల సొమ్ము, సమయం..ఇలా ఎన్నో ఆదాలకు నోచుకుంటాయి. ఇది కాదనలేని సత్యం.

అయితే, లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా స్టేట్ సబ్జక్ట్ కావడంతో.. పోలీసుల కామన్ డ్రెస్ కోడ్ విషయంలో చాలా కసరత్తు చేయాల్సివుంటుంది. భారత రాజ్యాంగం పోలీసు బలగాలను రాష్ట్ర ప్రభుత్వాల అధికార పరిధిలో ఉంచింది. దేశంలోని రాష్ట్రాలన్నీ తమ స్వంత పోలీసు బలగాలను కలిగి ఉన్నాయి. పబ్లిక్ ఆర్డర్, పోలీస్.. ఈ రెండూ రాజ్యాంగం ఏడో షెడ్యూల్‌ జాబితా II,స్టేట్ లిస్ట్ లో ఉంచబడ్డాయి. ప్రధాని సూచనపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర దృష్టి సారిస్తే.. చాలా ప్రయత్నమే చేయాల్సి వుంటుంది.

దేశంలోని పోలీసు సిబ్బంది డ్రెస్ కోడ్ చాలావరకు ఖాకీ కలర్ లోనే వుంటుంది. వివిధ ప్రాంతాల్లో, వివిధ స్థాయిల్లో.. ఈ యూనిఫామ్‎లు విభిన్నంగా కన్పిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలేకాక, వ్యక్తిగత దళాలు సైతం.. వారి సిబ్బంది ధరించే యూనిఫామ్‎ల రూపురేఖలను, వర్ణాలను నిర్ణయించవచ్చు. ఇందుకే, వారి అధికారిక దుస్తుల్లో కొన్నిసార్లు వైరుధ్యాలు దర్శనమిస్తాయి. ఇందుకే కోల్ కతా పోలీసులు తెల్ల యూనిఫామ్ ధరిస్తే, పుదుచ్చేరి పోలీసులు ఖాకీ యూనిఫాం, డిఫరెంట్ కలర్ లో వున్న ఎర్రటోపి ధరిస్తారు. ఢిల్లీ పోలీసులు రెండు రకాలా యూనిఫారాల్లో కన్పించడం విశేషం. తెలుపు, నీలం రంగు యూనిఫారాలు వీరి ప్రత్యేకత.

వివిధ రాష్ట్రాల పోలీసు విభాగాలు తమ సిబ్బంది యూనిఫామ్ ల సంస్కరణలకు పలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. దీర్ఘకాలంగా ఈ ప్రక్రియ సాగుతోంది. మహరాష్ట్రలో 2018 ఫిబ్రవరిలో పోలీసు సిబ్బంది యూనిఫామ్ లో రంగు వైవిధ్యాన్ని నిరోధించే ప్రయత్నం చేసింది. తమ సిబ్బందికి డోప్-డైడ్ ఖాకీ ఫ్యాబ్రిక్‌ను అందించాలని నిర్ణయించింది. ట్యూనిక్ యూనిఫామ్ పద్దతికి చెక్ పెడుతూ మహరాష్ట్ర డీజీపీ సర్క్యులర్ జారీ చేశారు. ట్యూనిక్ యూనిఫామ్ అనేది బ్రిటీష్ కాలం నాటి ఓవర్ కోట్ అని, దీనిని పోలీసు బలగాలు సంప్రదాయ యూనిఫామ్ మీద ధరించేవారని పేర్కొంది. ఇది వేడి వాతావరణంలో అసౌకర్యంగా ఉంటుందని సిబ్బంది చెప్పారు. ఏడాదికి రెండు మూడు సార్లు ఉత్సవ కవాతులకే దీన్ని పరిమితం చేయడం వల్ల అనవసరమైన ఖర్చు అవుతోందని సిబ్బంది చెప్పారు. దీంతో ఆ యూనిఫామ్ ను మానేశారు.

ఇక, కర్నాటక పోలీస్ శాఖ.. 2018 అక్టోబర్ లో మహిళా సిబ్బంది డ్రెస్ కోడ్ లో మార్పు చేస్తున్నట్టు ప్రకటించింది. విధుల్లో వున్నప్పుడు ఖాకీ చొక్కా, ఫ్యాంటు ధరిస్తే, వుమెన్ పోలీస్ లకు పని సులభతరం అవుతుందని భావించింది. నేరాలను ఎదుర్కోవడంలో వారి సామర్థ్యం మెరుగుపడుతుందని అభిప్రాయపడింది. ఈ ఏడాది మార్చిలో ఢిల్లీ పోలీసుశాఖ తమ సిబ్బందికి మరింత సౌకర్యవంతంగా వుండే వస్తువులపై దృష్టి సారించింది. తాజా యూనిఫారామ్ లను రూపొందించాలని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీని కోరినట్టు తెలిసింది. ఈ ప్రాజెక్ట్ కోసం 50 లక్షల రూపాయల నిధులకు ఆమోదం లభించినట్టు వెల్లడైంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

seventeen − nine =