దేశంలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉండడంతో.. తాజా పరిస్థితి, కోవిడ్ నియంత్రణ చర్యలపై చర్చించేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ప్రకారం, వర్చువల్ సమావేశం బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతుంది. ఈ సమావేశానికి ప్రధాని, ప్రధానమంత్రి కార్యాలయ సీనియర్ అధికారులతో పాటు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవ్య, ఆయా మంత్రిత్వ శాఖల అధికారులు హాజరయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ప్రస్తుత కోవిడ్ పరిస్థితి, వ్యాక్సినేషన్ పరిధి, బూస్టర్ డ్రైవ్, కొన్ని రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసుల గురించి ప్రజెంటేషన్ చేస్తారు. క్షేత్రస్థాయిలో కరోనా పరిస్థితిని అర్థం చేసుకునేందుకు గతంలో ప్రధాని మోదీ ముఖ్యమంత్రులతో పాటు జిల్లా మేజిస్ట్రేట్‌లతో కూడా పలుమార్లు సమావేశాలు నిర్వహించారు.
ఆదివారం నాటి ‘మన్ కీ బాత్’ రేడియో ప్రసారంలో ప్రధాని మోదీ పండుగ సీజన్‌లో COVID-19 పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు. కోవిడ్‌ను అరికట్టేందుకు ప్రజలు మాస్క్‌లు ధరించాలని, నిర్ణీత వ్యవధిలో చేతులు కడుక్కోవాలని ఆయన సూచించారు. కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఒక ట్వీట్‌లో వయోజన జనాభాలో 86 శాతం మందికి పైగా పూర్తిగా టీకాలు వేయబడ్డారని తెలిపారు.