More

    ‘నటరాజ సమేత నరేంద్ర మోదీ’..! ఆకాశమార్గాన ఆదిభిక్షువు ఆగమనం..!!

    భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన అర్థవంతంగా ముగిసింది. దౌత్య చర్చలు సఫలమయ్యాయా? 3 బిలియన్ డాలర్ల విలువ చేసే ‘predator drones’ వస్తాయా? ఉగ్రవాద అణచివేత చర్యలు సమర్థవంతంగా లక్ష్యాలను ఛేదిస్తాయా? క్వాడ్ కూటమి విజయవంతంగా ముందుకు వెళుతుందా?

    ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాల్సింది కాలమే! కాబట్టి, మోదీ అమెరికా పర్యటనను వీటి సాఫల్య, వైఫల్యాల ప్రాతిపదికన చూడకూడదని నేషనలిస్ట్ హబ్ అభిప్రాయం. ఆ పర్యటనలో అంతకు మించిన ప్రయోజనం సాధించారు మోదీ. ఏనాడో ఖండాంతరాలు దాటిపోయిన సాంస్కృతిక సంపదను… పట్టుబట్టి మరీ…తిరిగి ఈ నేలపై ప్రతిష్ఠించారు.

    భారత దేశంలో ఫరిడవిల్లిన నాగరికత, సంస్కృతులు చాలా విశిష్టమైనవి. ఆయా జన పథాల జీవన రీతిని విశేషంగా ప్రభావితం చేసిన బౌద్ధం, జైనం, వీరశైవ, వైష్ణవ సాహిత్యాలకు దేశంలో ఎంత ప్రాచీన చరిత్ర ఉన్నదో శిల్పకళకు అంతే చరిత్ర ఉన్నది. శతాబ్దాల తరబడి సామాన్యునికి చేరువైన కళలు రెండు: ఒకటి శిల్పకళ,  రెండవది శబ్దరూపమైన పాట.       

    రాతిపరుపుల కింద రమ్యమైన శిల్పాలు.. గుహల్లో రూపుదిద్దుకున్న మహళ్లు.. భారతీయ సంస్కృతికి ఆనవాళ్లు.. వారసత్వ సంపదకు నిలయాలు….అంత ఘనమైన శిల్పకళా సంపదను దొంగలు దేశాలు దాటించారు. సహ్యాద్రి, ఆరావళి, వింధ్యా పర్వతసానువుల్లో కొలువుదీరిన ఆలయాల్లోని ధార్మిక సంపద స్మగ్లర్ల చేతివాటం కారణంగా బయటిదేశాలకు వెళ్లిపోయింది.  ప్రాచీన భారత ధార్మిక, సాంస్కృతిక శిల్పాకళా సంపద ఎలా తస్కరించబడింది? ఏ ఏ దేశాల్లో ఉంది? ఎవరు తరలించారు?

    సుభాష్ కపూర్ ఎవరు? గత ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోలేదు? 1976 తర్వాత ప్రాచీన సంపద మన దేశం చేరడం మోదీ హాయాంలోనేనా? Idoltry expert ఎస్. విజయ్ కుమార్ రాసిన ‘’IDOL THIEF” పుస్తకంలో ఆలయ సంపద దొంగలపాలయిన దాఖలాల గురించి ఏమన్నారు? ఇలాంటి చారిత్రక అంశాల తాలూకు లోతైన అంశాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను.

    ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక సాంస్కృతిక చిహ్నాల స్వాధీన ప్రక్రియను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా అమెరికా నుంచి 12వ శతాబ్దానికి చెందిన కంచు నటరాజ ప్రతిమ, సూర్యుడి చిన్న కొడుకు రేవంతుడి సైకత శిల్పం, చోళుల కాలం నాటి శివపార్వతులు, విష్ణువు సహా చంద్రకేతుగఢ్ కు చెందిన 56 టెర్రాకోట కళాఖండాలు, జైన, బౌద్ధ, శైవ సంప్రదాయాలకు సంబంధించిన శిల్పకళా సంపదనూ…మహెంజొదారో నాగరికత ఆనవాళ్లను తన భుజస్కంధాలపై మోసుకుని భరతమాత ముందు మోకరిల్లారు మోదీ.

    వీటిలో ఎక్కువగా 11 నుంచి 14 వ శతాబ్దాలకు చెందినవే అధికం. క్రీస్తు పూర్వం 2 వేల సంవత్సరాల నాటివి, క్రీస్తుశకం రెండో శతాబ్దం నాటి టెర్రకోట శిల్పాలు, కూడా ఉన్నాయి. కంచు ప్రతిమల్లో లక్ష్మీ నారాయణ, బుద్ధ, విష్ణు, శివ, పార్వతి 24 జైన తీర్ధాంకరుల ప్రతిమలు ఉన్నాయి.

    1976 నుంచి 2013 వరకు వివిధ దేశాల నుంచి 13 కళా ఖండాలు మాత్రమే స్వదేశానికి చేరుకోగా, మోదీ అధికారం లోకి వచ్చిన తరువాత 2014 నుంచి 2021 మద్యకాలంలో 200 ప్రాచీన కళాఖండాలు స్వదేశానికి తిరిగి వచ్చాయి. ఇందులో 71 సాంస్కృతిక కళాఖండాలు కాగా, మిగతా సగం హిందూధర్మానికి సంబంధించిన కుడ్యాలు 60, బౌద్ధ ధర్మానికి చెందిన 16, జైన మతానికి చెందినవి 9 ఉన్నాయి.

    ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి విదేశీ పర్యటనకూ ఒక విశేషముంటుంది. ఏ దేశానికేగినా అక్కడి సాంస్కృతిక అంశాలను తెలుసుకుంటారు. మన సాంస్కృతిక మూలాలతో సరిపోల్చుతారు. దేశాల మధ్య సంబంధ బాంధవ్యాల్లో సాంస్కృతిక అంశాల ప్రాముఖ్యతను గుర్తించిన అతికొద్ది మంది పాలకుల్లో మోదీ ఒకరు.

    విదేశాంగ విధానానికి, దౌత్యానికీ, రాజనీతికి….సూక్ష్మమైన ధార్మిక విలువల్ని అంటుకట్టిన ప్రత్యేకత మోదీ సొంతం. మోదీ ప్రయత్నంతో 157 ప్రతిమలు భారత్ కు చేరాయి. ఏటా వెయ్యి ప్రాచీన కళాఖండాలు దొంగలబండిపై ఎల్లలుదాటి వెళ్లిపోతున్నాయి. సుభాష్ కపూర్ అనబడే ప్రాచీనతను వ్యాపారం చేసుకునే దొంగ… దశాబ్దాలుగా భారతీయ ప్రాచీన శిల్పకళను ఆలయాల నుంచి దేశాలు దాటిస్తున్నాడు. ఏళ్ల క్రితమే భారత ప్రభుత్వం దీన్ని గుర్తించినా పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో నరేంద్ర మోదీ తీసుకున్న చర్యలకు శ్వేతసౌధం స్పందించింది.

    “On 7 June 2016, US Attorney began the process of returning more than 200 stolen cultural objects back to India” అంటూ పార్లమెంట్ వేదికగా ప్రకటించింది ప్రభుత్వం. ఇందులో మొఘల్ పాలన కాలంనాటి కుడ్యాలు కూడా ఉన్నాయి.

    The Indian Treasure Trove Act 1878-ITTA,  The Antiquities and Art Treasures Act, 1972-AATA చట్టాల ఆధారంగా అంతర్జాతీయంగానే కాదు, దేశీయంగా వివిధ రాష్ట్రాల్లో అక్రమంగా ఉన్న అనేక ప్రాచీన సాంస్కృతిక సంపదను సేకరించి ఒకచోట ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే తాజాగా అమెరికా నుంచి 157 ప్రాచీన, ధార్మిక కళాఖండాలను స్వదేశానికి తరలించింది.

    కోహినూర్ వజ్రం, టిప్పూ ఖడ్గం, షాజహాన్ అంత:పురంలోని షట్పదీ శింజానం మాయమైపోయిన వైనం గురించి పలవరింత భారతీయ చరిత్రలో, సాహిత్య సృజనలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. దొంగచాటుగా ఇతర దేశాలకు తరలిపోయిన భారత ప్రాచీన ఆలయాల్లోని శిల్పకళా సంపద గురించి, నాట్యశాస్త్రానికి ప్రాణప్రతిష్ఠ చేసిన నటరాజు విగ్రహం దొంగలపాలైన దాఖలా గురించిన ప్రస్తావన మనకు ఎక్కడా కనిపించదు.వినిపించదు.

    మన చరిత్ర రచన తాలూకు స్వభావమిది. సంపదను గణించినంతగా సులువుగా మన ధార్మిక గతాన్ని మదింపు వేయడం మనకు తెలియదు. గతం విలువ తెలిసిన వాళ్లు కాలగతిలో కలిసిపోయారు. వలసవాదులు మన మస్తిష్కాన్ని మాత్రమే వలసీకరించలేదు. మన ధార్మిక సంపదకు ప్రతిరూపమైన శిల్పకళను కూడా మనకు కనిపించకుండా చేశారు.

    చోరకళను ఔపోసిన పట్టిన వారు అందుకు సాయం అందించారు. ప్రతినిత్యం దర్శనమిచ్చే దేవతా విగ్రహాలు తిరిగి నిర్వలసీకరణకు మార్గం వేస్తాయేమో భయం కాబోలు…అందుకే అచ్చెరువొందే శిల్పకళా సంపద సాంతం లోహవిహంగాల మీదుగా విదేశాలకు తరలిపోయింది.

    వేల ఏళ్ల క్రితం స్తపతుల కలలో పురుడు పోసుకున్న శిల్పాలు, వారి తపస్సు ఫలితంగా రూపుదాల్చిన మూర్తులూ అన్నీ విదేశాలకు తరలిపోతుంటే…కళ్లప్పగించి చూసినవారే తప్ప కాపాడదామని అనుకున్న పాలకులు లేకపోవడమే విషాదం.

    మొఘల్ పాలకుల చిహ్నాలకు చరిత్ర లేదని ఎవరూ అనడం లేదు. టిప్పూ ఖడ్గం మూలంగా రక్తశ్రువులు ఒలికిన గతానికీ…పంజాబ్ రాజుల విలాసానికి గుర్తుగా మిగిలిన కోహినూర్ వజ్రానికీ ఇతిహాసంలో ప్రాధాన్యత ఉంది. ఉంటుంది.

    అయితే ఈ నేల నమ్మిన విశ్వాసాలను ప్రతిబింబించే ప్రాచీన ధార్మిక ప్రతిమల గురించి కూడా సోయి ఉండాలన్నదే ఫిర్యాదు. దైనందిన జీవితంలో ధార్మిక విలువలను ప్రేరేపించే దేవతా విగ్రహాలు విదేశీ గడ్డపై అలంకరణ సామాగ్రిగా మారడం మన చారిత్రక స్పృహకు తార్కాణం.

    ‘‘The Idol Thief: The True Story of the Looting of India’s Temples’’ పేరుతో శిల్పకళా నిపుణులు ఎస్. విజయ్ కుమార్ ఆసక్తికరమైన పుస్తకం రాశారు. ఆశ్చర్యపోయే నిజాలు బయటపెట్టారు. ధార్మిక పరంపరకు సంబంధించిన చిహ్నాలను మన పూర్వీకులు ఎలా కాపాడారో వివరించారు. డబ్బును ఎరగా వేసినా, బెదిరింపులకు దిగినా దేవతామూర్తుల విగ్రహాలను ఇవ్వడానికి నిరాకరించిన దాఖలాలను ఊదహరించారు ఎస్.విజయ్ కుమార్.

    సుమారు 2వందల ఏళ్ల క్రితం 1817లో ఓ బాప్టిస్ట్ మిషనరీకి చెందినవారు కొంతమంది ‘లక్ష్మీదేవి’ విగ్రహం గురించి దక్షిణ భారతదేశంలోని  ఓ ఆలయంలో పూజారిని వాకబు చేశారట. కావాల్సినంత డబ్బు ఇస్తాం..లక్ష్మీదేవి విగ్రహం ఇస్తావా అంటూ బేరాసారాలకు దిగారట. కోట్లరూపాయలు ఇచ్చినా ఇవ్వనూ అంటూ కరాఖండిగా చెప్పాడట పూజారి. ఆ తర్వాత సదరు లక్ష్మీదేవీ మూర్తి చోరీకి గురైంది. డబ్బుకు లొంగనిది, చోరకళకు లొంగింది.

    15 శతాబ్దానికి చెందిన సీతారామలక్ష్మణుల పంచలోహ విగ్రహాలను 1978లో విదేశాలకు తరలించారు. British Antique Dealers’ Association వెబ్ సైట్ లో ఈ విగ్రహాలను ఎస్. విజయ్ కుమార్ గుర్తించారు. అలా ‘‘The Idol Thief’’ పుస్తక రచనకు బీజాలు పడ్డాయంటారు రచయిత.

    సంగం యుగంలో తమిళ ప్రాంతాన్ని ఏలిన ప్రాచీన చోళ, చేర, పాండ్య రాజులు ఆలయ నిర్మాణాన్ని మహత్తరంగా భావించారు. గుప్త యుగంలో తమిళ ప్రాంతాన్ని పల్లవులు పరిపాలించారు. రాజపుత్ర యుగంలో తమిళ ప్రాంతంలో నవీన చోళులు కీలకపాత్ర పోషించారు. క్రీ.శ.9వ శతాబ్దంలో విజయాలయుడు నవీన చోళ సామ్రాజ్యంలో ఆలయ నిర్మాణం మరింత ముందుకు సాగింది. ఈ ఆలయాల్లోని శిల్పకళా సంపద ఆ తర్వాత బ్రిటీష్ పాలకుల వశమైంది. విదేశాలకు తరలిపోయింది. స్మగ్లర్లకు కోట్లు కుమ్మరించాయి ఈ శిల్పాలు.

    శిల్పకళా సంపదను స్మగ్లింగ్ చేసిన తీరును కళ్లకు కట్టారు విజయ్ కుమర్. ఆర్ట్ డీలర్లు, మ్యూజియం క్యూరేటర్లు, విశ్వవిద్యాలయాల్లో పనిచేసే శిల్పకళా పరిశోధకుల మధ్య నడిచిన విగ్రహాల స్మగ్లింగ్ మొత్తం భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సుభాష్ కపూర్ అనబడే ఆర్ట్ డీలర్ రెండు దశాబ్దాలుగా ప్రాచీన విగ్రహాలను దేశాలు దాటించిన తీరును అనుభవ పూర్వకంగా వివరిస్తారు విజయ్ కుమార్.

    న్యూయార్క్ లోని సుభాష్ కపూర్ గ్యాలరీలోని చోళుల కాలంనాటి నటరాజ విగ్రహం, శివకామి మూర్తులను 8.5 మిలియన్ డాలర్లకు అమ్మకానికి పెట్టాడట సుభాష్ కపూర్. ఈ విగ్రహాలు 2006లో తమిళనాడులోని సుత్తమలి ఆలయంలో చోరీకి గురయ్యాయి.

    అమెరికన్ జర్నలిస్ట్, ఆస్ట్రేలియాకు చెందిన ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్, ఒక భారతీయ పరిశోధకుడు, షిప్పింగ్ ప్రొఫెషనల్ అయిన విజయ్ కుమార్ లు చేసిన పకడ్బందీ కృషి మూలంగా సుభాష్ కపూర్ చెన్నైలోని ఫుజాల్ కారాగారంలో ఊచలు లెక్కిస్తున్నాడు. ఈ నలుగురి సాహసాన్ని పరిగణలోకి తీసుకున్న కేంద్రం విగ్రహాల తరలింపు ప్రక్రియను వేగవంతం చేసింది. సాంస్కృతిక వైభవానికీ, ధార్మిక ప్రతిష్ఠకూ మూలమైన ఆలయాలు, వాటిలోని శిల్పసంపదను రక్షించడం అంతిమంగా జాతి ఆత్మను మేల్కొల్పడమే! ఈ కృషి నిరంతరం కొనసాగాలని ఆశిద్దాం..

    Trending Stories

    Related Stories