కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హసన్‌పల్లి గేటు వద్ద టాటా ఏస్ వాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పిట్లం మండలం చిల్లర్గికి చెందిన సౌదర్‌పల్లి మాణిక్యం గత గురువారం మృతి చెందారు. దశదినకర్మ అనంతరం ఆదివారం వారి కుటుంబ సభ్యులను టాటా ఏస్ వాహనంలో ఎల్లారెడ్డి పట్టణంలోని వారపుసంతకు వెళ్లారు. తిరిగి వస్తుండగా హసన్‌పల్లి వద్ద ఎదురుగా వస్తున్న లారీని టాటా ఏస్ ఢీకొట్టింది. ప్రమాదాన్ని పసిగట్టిన లారీ డ్రైవర్ లారీని రోడ్డు కిందికి తీసుకెళ్లినా ప్రయోజం లేకపోయింది. టాటా ఏస్ డ్రైవర్ అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రమాదంలో వాహనం నుజ్జునుజ్జు అయింది. డ్రైవర్ సాయిలు (25), లచ్చవ్వ (45) అక్కడిక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వారిని బాన్సువాడ, ఎల్లారెడ్డి ఆసుపత్రులకు తలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మరో ఐదుగురు, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఇద్దరూ మరణించారు. మొత్తంగా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల పరిహారం ప్రకటించారు.