తెలంగాణలో ట్రయాంగిల్ ఎన్నికలు.. మోదీ కామెంట్స్ తో మారిన రాజకీయ సమీకరణాలు..!

0
171

తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధాని మోడీ తెలంగాణ టూర్ లో బీఆర్ఎస్ మీద ఎదురు దాడితో అందరి దృష్టిలోనూ పడుతోంది. వంశపారంపర్య పాలనను, ఏక కుటుంబ పాలన అంతాన్నే ఈసారి ఎన్నికల ఎజెండాగా ప్రకటించిన మోడీ ఇందూరు సభలో కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఓ రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ ఇక జాతీయ పార్టీ అని ప్రకటించుకున్న కేసీఆర్ పరువు గంగలో కలిపేశారు. కేసీఆర్ కు సంబంధించిన అనేక సీక్రెట్స్ ఈ బహిరంగ సభలో బయటపెట్టారు. మూడు రోజుల వ్యవధిలో రెండు సార్లు తెలంగాణాలో పర్యటించిన అయన పాలమూరు సభతో పోలిస్తే…నిజామాబాద్ లో తెలంగాణాలోని అధికార బిఆర్ఎస్ పై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.

నిజామాబాద్ సభా వేదికగా తెలంగాణ సీఎం కేసిఆర్ పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజల నుండి దోచుకున్న సొమ్మును కేసిఆర్ .. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కు అందించారని సంచలన ఆరోపణలు చేశారు. ఎన్డీఏలో చేరతానని సీఎం కేసిఆర్ వెంటపడ్డారనీ కానీ ఆ ప్రతిపాదనను తాను ఒప్పుకోలేదని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసిఆర్ ఢిల్లీకి వచ్చి కలిశారనీ, తెలంగాణ పాలన పగ్గాలు మంత్రి కేటిఆర్ కు ఇస్తానని చెప్పి కేటిఆర్ ను ఆశీర్వదించాలని కోరారన్నారు. ఇది రాజరికం కాదు, ప్రజాస్వామ్యమని కేసిఆర్ తో అన్నాననీ, ప్రజలు ఆశీర్వదిస్తేనే పాలకులు అవుతారని చెప్పానని అన్నారు.

బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోబోమని కేసిఆర్ కు తెల్చి చెప్పాననీ, అప్పటి నుండి తన కళ్లలోకి చూడ్డానికి కూడా సీఎం కేసిఆర్ భయపడుతున్నారని అన్నారు. కేసిఆర్ గతంలో అప్యాయంగా ఉన్నారనీ, హైదరాబాద్ వచ్చినప్పుడు ఆర్భాటంగా స్వాగతం పలికాడనీ, ఇప్పుడేమైందని ప్రశ్నించారు. తమ అవసరం తీరాక ఆయన ప్రవర్తన మారిందని విమర్శించారు. తమ కార్యకర్తలను ఎన్ని రకాలుగా వేధించినా భయపడేది లేదన్నారు. తెలంగాణ ఎంతో మంది బలిదానాలతోనే సాకారమైందన్నారు. ఇప్పుడు తెలంగాణ ను ఓ కుటుంబం దోచుకుంటోందని విమర్శించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక కుటుంబమే బాగుపడిందని అన్నారు. కేసిఆర్ పాలనలో అవినీతి పెరిగిందని అన్నారు. కేసిఆర్, ఆయన కుమారుడు, ఆయన కుమార్తె, అల్లుడు మాత్రమే ధనికులు అయ్యారని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా బీఆర్ఎస్ దోచుకుంటోందన్నారు.

కుటుంబ పాలనకు ప్రజలు మరో అవకాశం ఇవ్వొద్దన్నారు. నమ్మకం ఉంచి టీ బీజేపీకి అవకాశం ఇస్తే బీఆర్ఎస్ చోదుకున్నదంతా కక్కిస్తామని మోడీ స్పష్టం చేశారు. ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తిని తెలంగాణకే వినియోగిస్తున్నామన్నారు. రైల్వే, ఆరోగ్య పథకాలు తెలంగాణ ప్రజలకు అంకితం చేశామన్నారు. నిజామాబాద్ మహిళలు, రైతులు ఇచ్చిన అపురూప స్వాగతానికి ధన్యుడినని పేర్కొంటూ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికల్లో నారీ శక్తి చూపించాలన్నారు. మొన్న మహబూబ్ నగర్ లో రూ.13,500 కోట్ల అబివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ.. నిజామాబాద్ లో రూ.8వేల కోట్ల కుపైగా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

అయితే ఈ సభలో మోడీ ప్రసంగం ఆసక్తిని కలిగించింది. ప్రధాని మోడీ నిజామాబాద్ సభలో తన స్పీచ్ ను తెలుగులో ప్రారంభించారు. ‘నా కుటుం సభ్యులారా’ అంటూ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఇలా పొలిటికల్, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ స్పీచ్ కలిసి మొత్తం 19 సార్లు ఈ పదాన్ని వినియోగించారు. పొలిటికల్ స్పీచ్ లో 12 సార్లు.. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ స్పీచ్ లో ఏడుసార్లు ‘నా కుటుం సభ్యులారా’ అంటూ ప్రస్తావించారు. గతంలో ఎన్నడూ ప్రధాని తన స్పీచ్ లో ఈ తరహా విధానాన్ని అనుసరించలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బీఆర్ఎస్, కాంగ్రెస్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే పదే పదే ‘నా కుటుంబ సభ్యులారా’ అనే పదాన్ని వినియోగిస్తూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశారు.

అయితే ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్ సభలో చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఒక ఫైటర్.. చీటర్‌తో కలవరని మోడీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అంటే బిగ్గెస్ట్ జుమ్లా పార్టీ ఇన్ ఇండియా అని విమర్శించారు. ఎన్డీఏలో కలవాలని ఎవరూ అనుకునే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికే ఎన్నో పార్టీలు ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేశాయన్నారు. ఎన్డీఏలో చేరేందుకు తామేం పిచ్చి కుక్కలం కాదని, తమకు పిచ్చి కుక్కలు ఏం కరవలేదని అన్నారు కేటీఆర్. తాను సీఎం కావడానికి మోడీ అనుమతి అవసరం లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ఇటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా మోదీ వ్యాఖ్యలపై స్పందించారు.. ఆ రోజు తాను చెప్పిందే.. ఈరోజు మోదీ చెప్పారన్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి రాహుల్ కొత్త పేరు పెట్టారు. BRS అంటే బీజేపీ రిస్తేదార్ సమితి అన్నారు. రెండు పార్టీల దోస్తీ తెలంగాణను నాశనం చేసిందంటూ మండిపడ్డారు. ప్రజలకు వీరి బంధం గురించి తెలిసిపోయిందన్నారు. ఈసారి బీఆర్ఎస్ – బీజేపీలను ప్రజలు తిరస్కరిస్తారని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీస్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు ఓటు వేస్తారని రాహుల్ అన్నారు.

మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణికం ఠాగూర్ ప్రధాని మోదీ వ్యాఖ్యలపై స్పందించారు. కేసీఆర్ ఎన్డీయేలో చేరాలనుకున్న సంగతి మోదీ వ్యాఖ్యలతో బట్టబయలైందని తెలిపారు. కేసీఆర్ ఎన్డీయేలో చేరాలనుకున్నది నిజమని తేలిందని అన్నారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని కేసీఆర్ కోరుకున్నది నిజం అని మాణికం ఠాగూర్ స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి రెండేళ్లుగా ఇదే విషయం చెబుతున్నారని వెల్లడించారు. మొత్తానికి ప్రధానికి ఆల్టర్ నేటివ్ ని తానేనని చెప్పుకునే కేసీఆర్ ను సొంత గడ్డపైనే మోడీ గాలి తీసేశారు.

ఇకపోతే ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ.. రాష్ట్ర ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యకాలంలో ఎంఐఎం నేతలు ప్రతీ కార్యక్రమంలోనూ సీఎం కేసీఆర్‌ను ఆకాశానికి ఎత్తుతున్నారు. కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని ప్రస్తావిస్తూ మరోసారి బీఆర్‌ఎస్‌ పార్టీను గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రాన్ని ఇంతగా అభివృద్ధి చేసిన బీఆర్‌ఎస్‌కు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అంతే కాకుండా రాష్ట్రంలో ఒక బ్లాక్‌ మెయిలర్‌ ఉన్నాడని, మరొకరు మతవిద్వేషాలను రెచ్చగొడుతున్నారని, వారికి అవకాశం ఇస్తే రాష్ట్ర ప్రశాంతతకు భంగం కలుగుతుందని అసదుద్దీన్‌ ధ్వజమెత్తారు. ప్రజల కష్టాలు తీరుస్తున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మళ్లీ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని చెప్పారు.

అయితే ప్రధాని స్థాయి వ్యక్తి ఇలాంటి మాటలు ఊరికే చెప్పరని, కచ్చితంగా కేసీఆర్ ఈ మాటలు అనే ఉంటారని రాజకీయ పరిశీలకులు ఇప్పుడు ఎనాలిసిస్ చేస్తున్నారు. అసలు డైనాస్టీ పాలిటిక్స్ అన్న ట్రిగర్ పాయింట్ బీజేపీకి అప్పుడే తట్టిందని అప్పటి నుంచే ఇటు కాంగ్రెస్ ను, అటు బీఆర్ఎస్ ను ఒకే దెబ్బతో ఎదుర్కొనాలనే ఉద్దేశంతోనే బీజేపీ ఈ నినాదాలను ఎత్తుకుందని ఇప్పుడు విశ్లేషణలు బయటకొస్తున్నాయి. ఇప్పటి వరకూ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అమీ తుమీ అనుకుంటున్న ఎన్నికలను మోడీ వచ్చి ట్రయాంగిల్ ఎన్నికలుగా మార్చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రానికి రావడం, ఎన్నికల ఏర్పాట్ల కసరత్తు కోసమే కాబట్టి తెలంగాణలో యుద్ధం షురూ అయినట్లే.. మోడీ కామెంట్స్ తో ఇప్పుడది పతాక స్థాయికి చేరింది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

1 + sixteen =