ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో గల జేవార్‌లో ఆసియాలోనే అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోదీ గురువారం శంకుస్థాపన చేశారు. ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో రెండవ అంతర్జాతీయ ఏరోడ్రోమ్ అయిన ఈ విమానాశ్రయం సెప్టెంబరు 2024 నాటికి ప్రారంభ సామర్థ్యంతో ఏడాదికి 1.2 కోట్ల మంది ప్రయాణికులను హ్యాండిల్ చేయగలదని భావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింగ్‌తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. 1330 ఎకరాల విస్తీర్ణంలో ఎయిర్‌పోర్టు నిర్మాణం జరుగుతోంది. ఈ ఎయిర్‌పోర్టు పూర్తి అయిన తర్వాత ప్రపంచంలోనే నాల్గవ అతి పెద్ద ఎయిర్‌పోర్టు అవుతుంది. ఇక దేశంలోనే 70 కిలోమీటర్ల పరిధిలో మూడు ఎయిర్‌పోర్టులను కలిగిన ఉన్న నగరంగా ఢిల్లీ అవతరించనుంది.
ప్రధాని మోడీ మాట్లాడుతూ ఈ ఎయిర్‌పోర్టు కేవలం నోయిడా, గ్రేటర్ నోయిడాకు మాత్రమే కాకుండా, మీరట్, మథుర, ఆగ్రా, మొరాదాబాద్, ముజఫర్‌నగర్, బిజ్నోర్ మరియు మరెన్నో సమీప ప్రాంతాలకు కూడా ఎగుమతులకు కేంద్రంగా మారుతుంది. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి భూమిపూజ చేసినందుకు ఉత్తరప్రదేశ్ ప్రజలకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఇది నోయిడా, పశ్చిమ యూపీని ప్రపంచ పటంలో ఉంచుతుందన్నారు. ఈ విమానాశ్రయం ఉత్తర భారతదేశానికి లాజిస్టిక్స్ గేట్‌వే అవుతుందని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు.
“నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ మల్టీ మోడల్ కనెక్టివిటీ హబ్‌గా ఉంటుంది. ఇది లక్ష మందికి పైగా ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. త్వరలో రాష్ట్రంలోని అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయంతో సహా 17 విమానాశ్రయాలను చూస్తాము” అని జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు. ఈ విమానాశ్రయాన్ని యమునా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (YIAPL) అభివృద్ధి చేస్తోంది.