పాలకుడు ఏం చేసినా ప్రజా ప్రయోజనం కోసమే చేయాలి. ఏ పని తలపెట్టినా ప్రజా సంక్షేమమే కనపడాలి. కార్మికులైనా, కర్షకులైనా, నిరుపేదలైనా, నిర్భాగ్యులైనా,.. బాలబాలికలైనా, ఆడపడచులైనా, బడుగులైనా, దివ్యాంగులైనా.. అందరి శ్రేయస్సే.. పాలకుడికి కర్తవ్యం కావాలి. స్వాతంత్ర్యం వచ్చి 75 పూర్తయినా.. ఇప్పటివరకు ఇలా ఆలోచించిన నాయకులు మనకు చాలా అరుదుగానే కనిపిస్తారు. అలాంటి అరుదైన నాయకుల్లో ప్రధాని మోదీ కూడా ఒకరంటే అతిశయోక్తి కాదేమో..! ప్రధాని మోదీ తాజాగా ఒక నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. రైతుల సంక్షేమం కోసం ‘వన్ నేషన్, వన్ ఫెర్టిలైజర్’ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 600 ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలను జాతికి అంకితం చేశారు. ఈ కేంద్రాలు రైతులకు బహుళ సేవలు అందించనున్నాయి. ఈ కార్యక్రమంలో ఎరువులపై ‘ఇండియన్ ఎడ్జ్’ అనే ఈ-మ్యాగజైన్‌ను సైతం ప్రధాని ఆవిష్కరించారు.
భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం. అధికశాతం దేశ ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. దేశానికి వెన్నెముక గ్రామమైతే, ఆ గ్రామానికి వెన్నుదన్ను రైతన్న. అన్నదాత క్షేమమే అందరికీ సంక్షేమం. రైతన్న కన్నీరుపెడితే అది దేశానికి మంచిది కాదు. అందుకే, రైతుల సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్నారు ప్రధాని మోదీ. ఎన్నో వినూత్న ప్రణాళికలకు రూపకల్పన చేసి శభాష్ అనిపించుకున్నారు. తాజాగా ‘వన్ నేషన్, వన్ ఫెర్టిలైజర్’ పథకం ద్వారా కల్తీ పురుగు మందులు, నకిలీ ఎరువులతో నానా యాతనలు అనుభవిస్తున్న రైతన్నలకు ప్రధాని మోదీ తీపి కబురు అందించారు.
న్యూఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ 2022 ను ప్రధాని మోదీ తొలుత ప్రారంభించి అనంతరం ఒక దేశం ఒక ఎరువులు పథకాన్ని ప్రారంభించారు. ‘పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్-2022’లో గతం కంటే అధికంగా రైతులు పాల్గొన్నారు. దాదాపు 13 వేల 500 మంది రైతులను, సుమారు 1500 అగ్రి స్టార్టప్‌లను ఈ సమ్మేళన్ ఒకచోట చేర్చింది.
‘వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్’ పథకాన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ తన సందేశాన్ని అందించారు. ‘వన్ నేషన్ వన్ ఫర్టిలైజర్’తో రైతలు మెరుగైన ఎరువులు అందుకోనున్నారని చెప్పారు. రైతులకు అన్ని రకాల గందరగోళాలు తొలగిపోతాయన్నారు. ఇప్పుడు, ఒకే పేరుతో, ఒకే బ్రాండ్‌తో దేశంలో నాణ్యమైన యూరియా విక్రయించబడుతుందన్నారు. ‘వన్ నేషన్, వన్ ఫర్టిలైజర్’ రూపంలో రైతులకు స్వల్ప ధరకు, నాణ్యమైన ఎరువులను అందించే పథకం ప్రారంభించబడిందన్నారు. భారత్ బ్రాండ్‌తో ఈ ఎరువులు రైతన్నలకు అందనున్నాయని చెప్పారు.
జల సంరక్షణకు, పుడమి తల్లిని కాపాడుకోవడానికి ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ & స్ప్రింక్లర్ల వినియోగానికి ప్రాధాన్యం ఇస్తోందని మోదీ తెలిపారు. సహజ వ్యవసాయానికి సంపూర్ణ ప్రాధాన్యం ఇచ్చామని అన్నారు. ఇది వ్యవసాయ ఉత్పత్తులను పెంచడానికి ఉపయోగపడుతుందన్నారు.
ఎరువుల ఉత్పత్తి సాంకేతికత, నాణ్యతలో పెను మార్పు వచ్చిందని ప్రధాని తెలిపారు. ఈ పథకం వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పత్తిని పెంచుతుందని, అన్ని పంటలకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తుందని చెప్పారు. సమర్థవంతమైన వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పత్తి కేంద్రంగా భారత దేశం త్వరలో ఆవిర్భవిస్తుందని మోదీ తెలిపారు.
రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని 600 ప్రధాన్ మంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలను ప్రధాని మోదీ ప్రారంభించి, వాటి విశిష్టత వివరించారు. ఈ పథకం కింద దేశంలోని ఎరువుల రిటైల్ దుకాణాలు దశలవారీగా PMKSKగా మార్చబడతాయన్నారు. రైతుల అవసరాలెన్నింటినో PMKSK తీరుస్తుందన్నారు. రైతులకు వ్యవసాయ-ఇన్‌పుట్‌లను అందిస్తుందన్నారు. ఎరువులు, విత్తనాలు, పనిముట్లు అందించి, నేల, విత్తనాలు, ఎరువుల కోసం పరీక్షా సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. 3 లక్షల 30 వేలకు పైగా రిటైల్ ఎరువుల దుకాణాలను PMKSKగా మార్చడానికి ప్రణాళిక రూపొందించబడిందని చెప్పారు. ఒక దేశం, ఒకే ఎరువుల స్కీంతో ఫెర్టిలైజర్ల ధరలు తగ్గడం, లభ్యత పెరడం జరుగుతుందన్నారు ప్రధాని. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా రూ. 16 వేల కోట్ల విలువైన PM-KISAN నిధులను సైతం ప్రధాని విడుదల చేశారు.
ప్రధాన్ మంత్రి భారతీయ జన్ ఉర్వరక్ పరియోజన్, ఒక దేశం, ఒకే ఎరువులు పథకం గురించి కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పలు విషయాలు వెల్లడించారు. ఈ పథకం కింద, అన్ని రకాల ఎరువులు, అది D.A.P,.. N.P.K. అయినా, యూరియా అయినా ‘భారత్’ బ్రాండ్ పేరుతో విక్రయించబడుతుందని చెప్పారు. ఫెర్టిలైజర్స్ తయారు చేసే కంపెనీతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఎరువుల బ్రాండ్‌లను ప్రామాణికం చేస్తుందన్నారు. భారత్ యూరియా, భారత్ D.A.P, భారత్ M.A.P,.. భారత్ N.P.K,.. తదితర పేర్లతో దేశవ్యాప్తంగా ఎరువుల సంచులు సైతం ఏకరీతిన రూపకల్పన జరుగుతుందని చెప్పారు.
ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘వన్ నేషన్, వన్ ఫెర్టిలైజర్’ పథకంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా రైతులు ఈ పథకాన్ని స్వాగతిస్తున్నారు.