సోమవారం (ఆగస్టు 2), ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజలు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ-రూపీ ( e-RUPI ) డిజిటల్ చెల్లింపు వ్యవస్థను ప్రారంభించారు. డిజిటల్ ఇండియా చొరవలో భాగంగా మోదీ ప్రభుత్వం ప్రారంభించిన అనేక కార్యక్రమాలలో ఇది ఒకటి.
డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించేందుకు ఎలక్ట్రానిక్ వోచర్ ఈ-రూపీ ని మోదీ ఆవిష్కరించారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఈరూపీ వోచర్‌ను రిలీజ్ చేశారు. డిజిటల్ లావాదేవీలు, నేరుగా నగదు బదిలీ విషయంలో దేశంలో ఈరూపీ కీలకపాత్ర పోషించనున్నట్లు మోదీ తెలిపారు. చాలా పారదర్శకంగా ఎటువంటి లీకేజీ లేకుండా నగదును డెలివరీ చేయవచ్చని మోదీ వెల్లడించారు. అత్యాధునిక టెక్నాలజీ సాయంతో 21వ శతాబ్ధంలో భారత్ ముందుకు వెళ్తున్న తీరుకు ఈ-రూపీని ఉదాహరణగా భావించవచ్చని ఆయన అన్నారు. ‘సాంకేతికత’ కేవలం ధనవంతులకు మాత్రమే పరిమితమనే అభిప్రాయానికి ఇది విరుద్ధమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు. ఈ రోజు మనం టెక్నాలజీని పేదలకు సహాయం చేసే సాధనంగా, వారి పురోగతికి ఒక సాధనంగా చూస్తున్నామని అన్నారు. ఆవిష్కరణ, టెక్నాలజీ వినియోగం, సేవలో భారతదేశం తన సామర్థ్యాలను ప్రపంచానికి తెలియజేస్తోందని ఆయన అన్నారు.
కరోనావైరస్ మహమ్మారి సమయంలో ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను ఆయన వివరించారు. పేద ప్రజలకు 2300 కోట్లు పంపిణీ చేయబడిందని ఆయన అన్నారు. ఈ-రూపీ డిజిటల్ లావాదేవీలను, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డిబిటి) ని ప్రోత్సహిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. గత 6-7 సంవత్సరాలలో డిజిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి చేసిన పునాది పని కారణంగా ఫిన్‌టెక్ రంగంలో భారతదేశం ఎదగడం ప్రపంచాన్ని ఆకట్టుకుందని ఆయన అన్నారు. “ఈ రోజు, భారతదేశంలో 66 కోట్ల రూపే కార్డుదారులు ఉన్నారు. వేల కోట్ల విలువైన లావాదేవీలు జరుగుతున్నాయి,” అని చెప్పుకొచ్చారు. భూటాన్ మరియు సింగపూర్లలో రూపే కార్డులు ఇప్పుడు ఆమోదించబడుతున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. ఫ్యూచరిస్టిక్ డిజిటల్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ ఈ-రూపీని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. వైద్య ప్రయోజనాల కోసం, విద్య కోసం మరియు నగదు లావాదేవీలకు ప్రత్యామ్నాయంగా ఈ-రూపీని ఉపయోగించవచ్చని భారత ప్రధాని తేల్చారు. ఆమోదించబడిన కేంద్రాలలో కోవిడ్ -19 చికిత్స మరియు టీకాల కోసం ఈ-వోచర్లను రీడీమ్ చేయవచ్చని కూడా ఆయన తెలిపారు.
ఈ-రూపీ ఎలా పనిచేస్తుందంటే:
క్యూ ఆర్ కోడ్ లేదా ఎస్ఎంఎస్ రూపంలో ఈ వోచర్‌ను పంపిస్తారు. లబ్ధిదారుల మొబైల్‌కు ఆ వోచర్‌ను డెలివరీ చేస్తారు. దాని ద్వారా అమౌంట్‌ను వాడుకోవచ్చు. ఒక క్యూర్ కోడ్ లేదా ఎస్ఎంఎస్ స్ట్రింగ్ వోచర్లను లబ్ధిదారుడి మొబైల్ ఫోన్‌కి పంపిస్తారు. వీటినే ఈ-రూపీగా భావించవచ్చు. నిర్దేశిత డబ్బును ముందే లోడ్ చేసి పెడతారు. ఈ వోచర్ లేదా క్యూఆర్ కోడ్‌ను లబ్ధిదారుడు తనకు అవసరమైన చోట, సంబంధిత సేవలు అందేచోట వినియోగించుకోవచ్చు. దీనికి బ్యాంకు, యాప్, ఆన్లైన్ బ్యాంకింగ్ వంటి మధ్యవర్తిత్వ వేదికలేవీ అవసరం లేదు. వోచర్లు కావాల్సిన వారు బ్యాంకులను సంప్రదించాలి. ఫోన్ నంబరుతో సహా లబ్ధిదారుల వివరాలను, వోచర్ విలువ ఎంతో కూడా తెలియజేసి మొత్తం సొమ్మును చెల్లించాలి. అలాగే ఆ చెల్లింపులు ఎందుకోసం చేస్తున్నారో కూడా చెప్పాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ఆ వోచర్లు అవి ఇస్తున్న వారి పేరు మీదుగా నేరుగా లబ్ధిదారుడికి చేరిపోతాయి. బ్యాంకు ఖాతా, డిజిటల్ పేమెంట్ యాప్, స్మార్ట్ ఫోన్ లేకున్నా ఈ వోచర్లను ఉపయోగించుకోవచ్చు.