More

  గుర్రపు దొడ్ల నుంచి సెంట్రల్ విస్టాకు..
  రక్షణశాఖ కష్టాలు తీర్చిన మోదీ ప్రభుత్వం..!

  అమెరికాకు పెంటగాన్ వుంది. ఫ్రాన్స్‎కు హెగ్జగాన్ వుంది. యూకేకు మాల్బరో లైన్స్ వుంది. మరి భారత్‎కు ఏముంది..? ఇండియన్ డిఫెన్స్ హెడ్‎క్వార్టర్స్ పేరేంటి..? అంటే లేదు అన్నదే ఈ ప్రశ్నకు సమాధానం. మనకు ఇన్నాళ్లూ ఓ ఏకీకృత డిఫెన్స్ హెడ్‎క్వార్టర్ అంటూ ఏమీ లేదు. కానీ, సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా.. ఆ కల ఇప్పుడు సాకారమైంది. భారత్‎కు డిఫెన్స్ హెడ్‎క్వార్టర్ లేదన్న లోటు తీరిపోయింది. అమెరికా పెంటగాన్‎ను తలదన్నేలా మనకు రక్షణశాఖ భవన సముదాయాన్ని నిర్మించింది మోదీ ప్రభుత్వం.

  2021 సెప్టెంబర్ 16న ప్రధాని నరేంద్ర మోదీ సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా.. ఓ కొత్త ఆఫీస్ కాంప్లెక్స్‎ను ప్రారంభించారు. ఏడు వేల మంది రక్షణ శాఖ అధికారులు, సిబ్బంది.. త్వరలోనే ఈ నూతన భవన సముదాయంలోకి షిఫ్ట్ కానున్నారు. ఇందులో విశేషమేముంది..? ఆర్మీ ఆఫీసర్లకు ఓ కొత్త సముదాయాన్ని నిర్మించారు.. అంతేకదా..! అని కొట్టిపారేసే విషయం కాదిది. భారతీయ సైనిక చరిత్రలో ఇదో చరిత్రాత్మక ముందడుగు. ఆ విశేషాల్లోకి వెళ్లేమందు,.. ప్రస్తుతం రక్షణ శాఖ కార్యాలయాల గురించి ఓసారి తెలుసుకుందాం. వాటిని కార్యాలయాలు అనేకంటే, గుడిసెలు అంటే సరిపోతుందేమో.

  నార్త్, బ్లాక్ పరిసరాల్లోని గుడిసెల్లాంటి నిర్మాణాల్లో.. అత్తెసరు మౌలిక వసతులతో.. దశాబ్దాల తరబడి మన సైనికాధికారులు, సిబ్బంది కాలం వెల్లదీస్తున్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి.. ఈ పాత భవనాల్లో ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే.. 75 ఏళ్ల క్రితం ఇవే భవనాలను బ్రిటిషర్లు గుర్రాల దొడ్లుగా ఉపయోగించారు. అంటే, దేశానికి రక్షణ కల్పించే మన సైనిక అధికారులు ఇన్నాళ్లూ గుర్రపు దొడ్లలో కాలం గడిపుతున్నారన్నమాట. అంతేకాదు, నేవీ స్టేషన్ ఐఎన్ఎస్ ఇండియా, సాయుధ దళాల క్లినిక్, సాయుధ దళాల వైద్య విభాగం, నేవీ స్టేషన్‌తో సహా రక్షణశాఖలోని 27 విభాగాలు ఈ గుర్రపు దొడ్ల నుంచే పాలన సాగిస్తున్నాయంటే ఇంతకంటే అవమానం ఏమైనా వుంటుందా..? ఇదీ గత ప్రభుత్వాల ఘనమైన పాలనకు నిదర్శనం.

  నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. మన్మోహన్ సింగ్ టైమ్‎లో రూపొందించిన ప్రాజెక్టు ఫైల్‎ను దుమ్ముదులిపి పట్టాలెక్కారు. పార్లమెంట్ భవనంతో పాటు.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని నివాసాలు, ఆర్మీ హెడ్‎క్వార్టర్స్ అన్నీ ఒకేచోట ఉండేలా సెంట్రల్ విస్టా ప్రాజెక్టు శరవేగంగా నిర్మితమవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పూర్తయిన సైనిక కార్యాలయ భవన సముదాయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సముదాయంలో అమెరికా పెంటగాన్‎ను తలదన్నే రీతిలో.. సైనికాధికారులకు, సిబ్బందికి ప్రపంచ స్థాయి సౌకర్యాలున్నాయి.

  ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని మోదీ.. ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌‌‌లపై దృష్టి పెట్టినపుడు, ఆధునిక మౌలిక సదుపాయాలు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయన్నారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో జరుగుతున్నది ఇదేనన్నారు. ఈ డిఫెన్స్ ఆఫీసెస్ కాంప్లెక్స్‌లో అన్ని రకాల ఆధునిక సదుపాయాలు ఉన్నాయని, ఆధునిక సదుపాయాలు కలిగిన పని పరిస్థితుల్లో మరింత మెరుగ్గా పని చేయడానికి త్రివిధ దళాలకు అవకాశం కలుగుతుందని చెప్పారు. ఈ డిఫెన్స్ ఆఫీసెస్ కాంప్లెక్స్‌ల నిర్మాణం 12 నెలల్లో పూర్తయిందన్నారు. కోవిడ్-19 మహమ్మారి తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో ఈ కార్యకలాపాలు జరిగాయని, దీనివల్ల మహమ్మారి సమయంలో వందలాది మంది కూలీలకు ఉపాధి దొరికిందని చెప్పారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కొత్త పార్లమెంటు భవనం నిర్మాణం కూడా నిర్ణీత సమయంలోనే పూర్తవుతుందని చెప్పారు.

  ఆఫ్రికా ఎవెన్యూలో 5 లక్షల 8 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు బ్లాకులు.. అలాగే, కేజీ మార్గ్ లో 4 లక్షల 52 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మరో మూడు బ్లాకులను నిర్మించారు. రెండు కాంప్లెక్స్ లలో మొత్తం 1500 కార్లు పార్క్ చేసుకునే విధంగా పార్కింగ్ స్లాట్ నిర్మించారు. ఈ కొత్త భవన సముదాయంలో అత్యాధునిక మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఒక్క చెట్టును కూడా నరికివేయకుండా ఈ భవన సమూహాన్ని నిర్మించడం విశేషం. పూర్తి సెంట్రల్ విస్టా ప్రాజెక్టు కూడా బ్రిటీష్ కాలం నాటి వలస పాలనకు అద్దంపట్టే నిర్మాణాలకు దీటుగా.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు మేళవించి అత్యాధునిక సౌకర్యాలతో నిర్మితమవుతోంది.

  భారత రక్షణశాఖ కార్యాలయ సముదాయాన్ని 775 కోట్లతో నిర్మించింది భారత ప్రభుత్వం. మరి కొద్ది నెల్లలో ఈ నూతన సముదాయంలోకి సైనిక విభాగాల తరలింపు పూర్తికానుంది. త్వరలో ప్రధాన మంత్రి కార్యాలయం కూడా సెంట్రల్ విస్టాకు మారనుంది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పూర్తయితే కేంద్ర ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖలన్నీ ఒకే చోటినుంచి పాలన సాగించనున్నాయి. అయితే, దేశానికే తలమానికమైన ఈ ప్రాజెక్టును ప్రతిపక్ష పార్టీలు మొదటి నుంచీ వ్యతిరేకిస్తూనేవున్నాయి. గత మేలలో విపక్షాలు ప్రభుత్వానికి ఓ లేఖ రాశాయి. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు 35 వేల కోట్లు కేటాయించడాన్ని తప్పుబట్టాయి. ఆ డబ్బుతో వ్యాక్సిన్లు కొనుగోలు చేయవచ్చని.. ఆక్సిన్‎ను సమకూర్చుకోవచ్చని ఎన్నో సలహాలిచ్చాయి.

  విపక్షాలే కాదు, 60 మంది రిటైర్డ్ బ్యూరోకాట్లు కూడా ప్రధాని మోదీతో పాటు.. పట్టణాభివృద్ధి శాఖామంత్రి హర్దీప్ సింగ్ పూరీకి ఓపెనల్ లెటర్ రాశారు. మూఢ నమ్మకాల కోసం డబ్బు తగలేస్తున్నారని తప్పుడు కథనాన్ని సృష్టించారు. దేశ ప్రతిష్టను ఇనుమడింప జేసే ప్రాజెక్టుపై.. ఇలా ఓవైపు విపక్షాలు, మరోవైపు కమ్యూనిస్టులకు వింతపాడే కొందరు రిటైర్డ్ బ్యూరోక్రాట్లు విమర్శలు గుప్పించారు. అయితే, ఇదే సమయంలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు అని, దీనిని కొనసాగించాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పుతో ఈ విమర్శకుల నోళ్లకు మూతలు పడ్డాయి. అంతకుముందు సుప్రీం కోర్టు సైతం ఇదే తీర్పు చెప్పింది.

  ఇక, హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాత ప్రెస్ మీట్ లో మాట్లాడిన హర్దీప్ సింగ్ పూరీ.. విపక్షాల తీరును ఎండగట్టారు. దేశానికి సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ ఎంత అసవరమో వివరించారు. దేశ ఆత్మగౌరవంతో ముడిపడిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ‘మూఢ నమ్మకాన్ని అంటగట్టిన విపక్షాలు, బ్యూరోక్రాట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత భవనం తమకు అచ్చిరాదని.. అందుకే, సెంట్రల్ విస్టా ప్రాజెక్టును నిర్మిస్తున్నారన్న వాదనను కొట్టిపారేశారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై విమర్శలు చేసేవారు చదువుకున్న మూర్ఖులే కాదు.. వారు దేశానికే అవమానమని వ్యాఖ్యానించారు.

  Trending Stories

  Related Stories