More

  మొన్న అయోధ్య,.. నిన్న కాశీ,.. నేడు ఉజ్జయినీ.. ‘మహాకాళ్’ ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన..

  మొన్న కాశీ,.. నిన్న కేదార్ ధామ్,.. అంతకుముందు అయోధ్య,.. నేడు ఉజ్జయినీ. భారతావని పునర్వైభవం సంతరించుకుంటోంది. సనాతన హైందవ ధర్మానికి ప్రతీకలైన.. చారిత్రక కట్టడాలు ఒక్కొక్కటిగా పునరుజ్జీవం పొందుతున్నాయి. భారతీయుల ఆకాంక్ష.. మోదీ సంకల్ప బలం.. సమర్థనీయ చర్యలు.. వెరసి భారతీయత వెల్లివిరుస్తోంది. ఈ క్రమంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. ద్వాదశ జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రం నూతన సొబగులు దిద్దుకుంది. మధ్యప్రదేశ్ ఉజ్జయినీ పుణ్యక్షేత్రం పునరుద్ధరణలో భాగంగా.. ప్రధాని మోదీ.. మహాకాళ్ లోక్ కారిడార్‌ ప్రాజెక్టు – తొలిదశను ప్రారంభించారు. 856 కోట్ల రూపాయలతో చేపట్టిన మహాకాళేశ్వర ఆలయ కారిడార్ అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం జరిగింది. ‘మహాకాళ్ లోక్ కారిడార్’ తొలి దశను 316 కోట్లతో అభివృద్ధి చేశారు. తొలుత ఆలయానికి చేరుకున్న ప్రధాని మోదీ నందీశ్వరునికి ప్రణమిల్లి ప్రార్థనలు జరిపారు. అనంతరం మహా కాళేశ్వరుని గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు ఇచ్చారు. ప్రధాని మోదీ వెంట సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తదితర ప్రముఖులు వున్నారు.

  తొలుత ప్రధాని మోదీ ఆలయానికి చేరుకున్నప్పుడు.. అర్చక స్వాములు.. వేద మంత్రాలు పఠిస్తూ.. పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. పండిత శ్రేష్ఠులు, సాధుపుంగవులు ఆశీర్వచనాలు అందజేశారు. దాదాపు 600 మంది కళాకారులు తమ కళా ప్రదర్శనతో ప్రధానికి స్వాగతం పలికారు. కారిడార్, ప్రధాన ద్వారం వద్ద, దారంతో ఏర్పాటు చేసిన సుమారు 20 అడుగుల శివలింగాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. అక్కడి నుంచి శ్రీ మహాకాళ్ లోక్‌ కారిడార్‌కు చేరుకుని..వైభవోపేతంగా ఈ ఆవిష్కరణ చేశారు.

  భారత దేశ నడిబొడ్డున వున్న మధ్యప్రదేశ్ లోని పరమ పవిత్ర శైవ క్షేత్రం ఉజ్జయినీ. అష్టాదశపీఠాల్లోని మహత్తర క్షేత్రంగా, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంగా ఉజ్జయినీ ప్రసిద్ధి చెందంది. ఎన్నో విశిష్టతలు సంతరించుకున్న ఉజ్జయినీ క్షేత్రం దక్షిణాభిముఖంగా వున్న ఏకైక జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రం. దేశంలోని జ్యోతిర్లింగ క్షేత్రాలన్ని తూర్పుముఖంగానే ఉంటాయి. వారణాసి విశ్వనాథ దేవాలయం, ఉత్తరాఖండ్ కేదార్ నాథ్ దేవాలయాల అనంతరం ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రంగా ఉజ్జయిని మహాకాళ్ దేవాలయం భాసిల్లుతోంది. గత ఏడాది చివరలో ప్రధాని మోదీ ప్రారంభించిన కాశీ విశ్వనాథ్ కారిడార్ కంటే నాలుగు రెట్లు ఎక్కువగా మహాకాళ్ కారిడార్ దాదాపు 856 కోట్ల వ్యయంతో తీర్చిదిద్దుతున్నారు.

  సర్వేశ్వరుని స్వరూపంగా కీర్తింపడే ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు దేశంలోని వివిధ ప్రదేశాల్లో నెలకొని వున్నాయి. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహాకాళ్, ఓంకారేశ్వర క్షేత్రాలతో పాటు, గుజరాత్ సోమనాథ్, నాగేశ్వర్ క్షేత్రాలు 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటిగా వున్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి ఆలయం, ఉత్తరాఖండ్ కేదార్ నాథ్ ఆలయం మహారాష్ట్ర భీమ శంకర్, త్రయంబకేశ్వర్, ఘృష్ణేశ్వర్ ఆలయాలు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్ర దేవాలయాలే. వారణాసి విశ్వేశ్వర ఆలయం, బైద్యనాథ్ ఆలయం, తమిళనాడు రామేశ్వర్ ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలకు చెందినవే.

  ఉజ్జయినీ పుణ్యక్షేత్ర ఆలయ చరిత్ర ను పరిశీలిస్తే.. ఎన్నో భక్తపూర్వక విషయాలు అవగమవుతాయి. ఆలయ చరిత్ర ప్రకారం.. పూర్వం ఉజ్జయినీ రాజ్యాన్ని చంద్రసేనుడు అనే చక్రవర్తి పరిపాలించేవాడు. ఆ రాజు పరమ శివభక్తుడు. పరమ దయాహృదయుడు. ప్రజలందరిని కన్నబిడ్డల్లా చూసుకుని సుపరిపాలన అందించాడు. ఆ రాజ్యంలోని అందరూ శివభక్తులే. శివనామ స్మరణతో మార్మోగే ఆ పవిత్ర ప్రదేశాన్ని చూసి బోళా శంకరుడు ఎంతో సంతోషిస్తాడు. మహదేవుడు.. మహారాజుకు కలలో మహాకాళ రూపంలో దర్శనమిచ్చి.. ఈ క్షేత్రాన్ని పవిత్ర శైవక్షేత్రంగా తీర్చిదిద్దమని చెబుతాడు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటిగా, ప్రముఖ పుణ్య క్షేత్రంగా ఉజ్జయినీ కాళేశ్వర క్షేత్రం విరాజిల్లుతుందని శివదేవుడు రాజుకు స్వప్నంలో వివరిస్తాడు. అనంతరం ఆ రాజు, ఆ క్షేత్రాన్ని అతి పవిత్రంగా తీర్చిదిద్దే చర్యలు చేబడ్తాడు.

  పలు హిందూ పురాణ గ్రంథాలలో మహాకాళ్ దేవాలయప్రస్తావన ప్రముఖంగా కన్పిస్తుంది. మహాకవి కాళిదాసు మహాకాళ దేవాలయం గురించి తమ అపూర్వ గ్రంథ రచనల్లో లిఖించినట్టు పురాణాలు వెల్లడిస్తున్నాయి. రాతి పునాదితో, చెక్క స్తంభాలపై ఈ దేవళం తొలుత నిర్మితమైనట్టు స్థల పురాణం చెబుతోంది. స్వర్ణయుగంగా పేరొందిన గుప్తరాజుల కాలానికి ముందు దేవాలయంపై శిఖరాలు, గోపురాలు వుండేవి కావని ఆలయ చరిత్ర తెలియజేస్తోంది.

  చారిత్రకంగాను ఉజ్జయినీ నగరానికి ఎంతో పేరు వుంది. ఆరు, ఏడు శతాబ్దాలలో అవంతిక అని ఈ నగరానికి పేరున్నట్టు చరిత్ర చెబుతోంది. బాలలు హిందూ గ్రంథాలను అభ్యసించే ప్రాంతాల్లో ఒకటిగా దీనికి పేరుంది. బ్రహ్మగుప్తుడు, భాస్కరాచార్య తదితర ఖగోళ శాస్త్రవేత్తలు, గణిత శాస్త్రవేత్తలు ఉజ్జయినీ నగరంలో నివసించినట్టు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. ఇక్కడి ప్రధాన శివాలయం కాలానికి అధిపతి అయిన మహాకాళేశ్వర ఆలయంగా కీర్తింపబడుతోంది. 18వ శతాబ్దంలో, మహారాజా జై సింగ్ ఇక్కడ నిర్మించిన వేదశాలకు జంతర్ మంతర్ అని పేరుంది. ఇందులో ఖగోళ విషయాలకు సంబంధించిన ఎన్నో నిర్మాణ సాధనాలు ఉన్నట్టు చరిత్ర తెలియజేస్తోంది.

  ప్రధాని మోదీ ప్రారంభించిన శ్రీ మహాకాళ్ లోక్ ప్రాజెక్ట్ ఎన్నో విధాలుగా ప్రత్యేకమైనది. యాత్రికులకు ప్రపంచ స్థాయి ఆధునిక సౌకర్యాలను అందించడం తొలిదశలో కనిపిస్తుంది. వారసత్వ నిర్మాణాల పరిరక్షణ, పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టిపెట్టడం ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం. ప్రాజెక్ట్ కింద ఆలయ సముదాయాన్ని దాదాపు ఏడు రెట్లు విస్తరించనున్నారు. 856 కోట్ల రూపాయలు మొత్తం ప్రాజెక్టు వ్యయం కాగా, ఆలయానికి వచ్చే యాత్రికుల సంఖ్య ఏడాదికి దాదాపు కోటీ 50 లక్షలకు చేరనుంది. ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి రెండు దశల్లో జరుగనుంది.

  ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతను పరిశీలిస్తే.. మహాకాళ్ మార్గంలో 108 స్తంభాలు ఉన్నాయి. ఇవి శివుని ఆనంద తాండవ స్వరూపాన్ని సూచిస్తాయి. నటరాజు నృత్య రూపాన్ని దర్శింపచేస్తాయి. మహాకాళ్ మార్గంలో శివుడిని వర్ణించే అనేక విగ్రహాలను ఏర్పాటు చేశారు. దారి పొడవునా మ్యూరల్ వాల్ పెయింటింగ్‌లు శివ పురాణంలోని కథల ఆధారంగా రూపొందించబడ్డాయి. వాటిలో సృష్టి , గణేశుడి జననం, సతి, దక్ష కథలు మొదలైనవి ఉన్నాయి. రెండున్నర హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ప్లాజా ప్రాంతం చుట్టూ తామర చెరువు ఎంతో అందంగా ఉంటుంది. ఒక ఫౌంటెన్‌తో పాటు శివుడి విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నిఘా కెమెరాల సహాయంతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ మొత్తం కాంప్లెక్స్‌ను 24 గంటలూ పర్యవేక్షిస్తుంది.

  ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఎన్నో ప్రాధాన్య విషయాలను వెల్లడించారు. శ్రీ మహాకాళ్ లోక్ ప్రాజెక్టు ప్రధానమంత్రి దూరదృష్టికి నిదర్శనమని అన్నారు. కేదార్ ధామ్, కాశీ తో పాటు ఇప్పుడు మహాకాల్ లోక్ సైతం దేశంలోని ప్రధాన అథ్యాత్మిక నగరంగా తిరిగి ప్రాణం పోసుకుందన్నారు. 2004లో ఉజ్జయినీలో జరిగిన కార్యక్రమంలో నరేంద్ర మోదీ మహాకాళ్ కాంప్లెక్స్ అభివృద్ధి గురించి మాట్లాడారని గుర్తుచేశారు.

  2011లో గుజరాత్‌ ముఖ్యమంత్రి హోదాలో నరేంద్ర మోదీ మహకాళ్ ను సందర్శించేందుకు వచ్చినప్పుడు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు ఇక్కడి ఆలయ అధికారులు, అర్చకస్వాములు తెలిపారు. భగవాన్ మహాకాళ్ ఆశీస్సులు మోదీపై పుష్కలంగా వున్నందునే.. ప్రధానమంత్రి అయ్యారని అన్నారు. 2024 ఎన్నికల్లోనూ విజయం సాధించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రార్థిస్తే.. మహాకాళ్ తప్పకుండా ఆయన కోరికలను నెరవేరుస్తారని అర్చకస్వామి తెలిపారు.

  ఇక, మహాకాళ్ లోక్ రెండో దశ అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. మిడ్ వే జోన్, కార్లు, బస్సుల కోసం బహుళ అంతస్థుల పార్కింగ్, సోలార్ లైటింగ్, పార్క్, యాత్రికుల సౌకర్య కేంద్రం, వాటర్ పైప్ లైన్ మొదలైన పనులెన్నో జరుగుతున్నాయి. రుద్రసాగర్ సరస్సును పునరుద్ధరిస్తున్నారు. భక్త జన సందోహంతో, పర్యాటకుల పరవశంతో.. మహాకాళ్ లోక్ మహత్తర రీతిలో మారనుందని ఇక్కడి అధికారగణం చెబుతోంది. ధరణిలో అత్యంత పవిత్ర ప్రదేశాల్లో ఒకటిగా ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయానికి పేరుంది. ఏదేమైనా, దేశంలోని పుణ్యక్షేత్రాలన్నీ పునర్వైభవం సంతరించుకుంటూ వుండటం ప్రతి భారతీయడికి గర్వకారణం. ఇందుకు ప్రధాని మోదీ ప్రధాన కారణమని చెప్పకతప్పదు. జై మహాకాళ్..!

  Trending Stories

  Related Stories