108 అడుగుల ఎత్తయిన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

0
928

హనుమాన్ జన్మ దినోత్సవం సందర్భంగా గుజరాత్ లోని మోర్బి జిల్లాలో ఏర్పాటు చేసిన 108 అడుగుల ఎత్తయిన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించారు. వీడియో కాన్ఫరెన్స్ లో ఈ కార్యక్రమానికి ప్రధాని హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడాన్ని గౌరవంగా భావిస్తున్నట్టు అంతకుముందు ప్రధాని చెప్పారు. ఉదయం ప్రధాని ట్విట్టర్ ద్వారా “ఈ రోజు హనుమాన్ జయంతి ప్రత్యేక సందర్భంలో.. మోర్బీలో ఉదయం 11 గంటలకు 108 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నాము. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో భాగమయ్యే అవకాశం లభించినందుకు గౌరవంగా భావిస్తున్నాను’ అని దేవతా విగ్రహం చిత్రాలతో పాటు ట్వీట్ చేశారు.

హనుమాన్ జీ చార్ ధామ్ ప్రాజెక్టు కింద దేశవ్యాప్తంగా నాలుగు ఎత్తయిన హనుమాన్ విగ్రహాలను ఏర్పాటు చేస్తుండగా.. అందులో ఇది రెండోది. ‘హనుమాన్‌జీ చార్‌ ధామ్‌’ ప్రాజెక్టులో భాగంగా దేశవ్యాప్తంగా నాలుగు దిక్కుల్లో నిర్మిస్తున్న నాలుగు విగ్రహాల్లో ఈ విగ్రహం రెండోదని ప్రధానమంత్రి కార్యాలయం శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. మోర్బీలోని బాపు కేశ్వానంద్ జీ ఆశ్రమంలో ఈ విగ్రహాన్ని పశ్చిమాన ఏర్పాటు చేసినట్లు పీఎంవో తెలిపింది. మొదటి విగ్రహాన్ని 2010లో ఉత్తరాన హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో ఏర్పాటు చేయగా, దక్షిణాదిన రామేశ్వరంలో మూడో విగ్రహం పని ప్రారంభించినట్లు PMO తెలిపింది.

హనుమాన్ జయంతి సందర్భంగా ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. “బలం, ధైర్యం మరియు సంయమనానికి ప్రతీక అయిన హనుమంతుని జన్మదినోత్సవం సందర్భంగా దేశప్రజలందరికీ శుభాకాంక్షలు. ‘పవన్‌పుత్ర’ దయతో ప్రతి ఒక్కరి జీవితాలు ఎల్లప్పుడూ శక్తి, తెలివి, జ్ఞానంతో నిండి ఉండాలి” అని ప్రధాని మోదీ హిందీలో ట్వీట్ చేశారు.