దేశవ్యాప్తంగా పోలీసులందరికీ ఒకే రంగు యూనిఫామ్ రాబోతోందా..?

0
843

దేశవ్యాప్తంగా పోలీసులందరికీ ఒకటే యూనిఫాం ఉండాలని ప్రధాని మోదీ ప్రతిపాదించారు. ఇది సలహా మాత్రమేనని రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం రుద్దబోవడం కూడా తెలిపారు. హరియాణాలోని సూరజ్‌కుండ్‌లో హోం మంత్రుల ‘చింతన్‌ శిబిర్‌’నుద్దేశించి శుక్రవారం ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. పోలీసు బలగాలకు ఒకే విధమైన గుర్తింపు ఉండాలన్న ఉద్దేశంతోనే.. ‘ఒకే దేశం.. ఒకటే యూనిఫాం’ను ప్రతిపాదిస్తున్నానని అన్నారు. అయితే ఇది ఐదేళ్లకో, 50 ఏళ్లకో, వందేళ్లకో జరగొచ్చని అన్నారు. కానీ ఒకసారి ఆలోచనైతే చేయండి. ఒకే యూనిఫాం ఉంటే దేశంలో ఎక్కడైనా పోలీసులను ప్రజలు ఇట్టే గుర్తు పట్టేస్తారని అన్నారు. రాష్ట్రాలు వాటిపై తమ తమ చిహ్నాలను, నంబర్లను కొనసాగించుకోవచ్చని సూచించారు. ఇక పోలీసు బలగాలను ఆధునీకరించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు పాత చట్టాలను సమీక్షించి ప్రస్తుత కాలానికి తగినట్లుగా సవరించాలని మోదీ కోరారు. రక్షణ, శాంతిభద్రతల సవాళ్లను ఎదుర్కోవడానికి రాష్ట్రాలన్నీ సమన్వయంతో కార్యాచరణ చేపట్టాలన్నారు. శాంతిభద్రతల నిర్వహణకు స్మార్ట్‌ టెక్నాలజీని ఉపయోగించాలని సూచించారు. ప్రధాని మోదీ సూచనలను రాష్ట్ర ప్రభుత్వాలు పాటిస్తాయో లేదో చూడాలి.