పారా అథ్లెట్లను కలిసిన ప్రధాని మోదీ

టోక్యో 2020 పారాలింపిక్స్ లో భారత్ అద్భుతమైన ప్రదర్శన కనబరచిన సంగతి తెలిసిందే..! పారాలింపిక్స్ లో పతకాలను సాధించిన భారత అథ్లెట్లను భారత ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు. ఈ సారి భారత్ ఎన్నడూ లేనంతగా 19 మెడల్స్ సాధించిన విషయం తెలిసిందే. దాంట్లో ఐదు స్వర్ణాలు, ఎనిమిది రజతాలు, ఆరు కాంస్యాలు ఉన్నాయి. 17 మంది పతకాలు సాధించారు. షూటర్లు అవని, సింగ్‌రాజ్ రెండేసి పతకాలు చేజిక్కించుకున్నారు. ప్రధాన మంత్రి మోదీ లోక్ కళ్యాణ్ మార్గ్ లోని తన అధికారిక నివాసంలో పారా అథ్లెట్లకు ఆతిథ్యమిచ్చారు. గత నెలలో భారత ఒలింపిక్ అథ్లెట్లకు కూడా మోదీ ఇక్కడే ఆతిథ్యాన్ని ఇచ్చారు. చిరస్మరణీయమైన ఈవెంట్ యొక్క చిత్రాలు ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక వెబ్సైట్లోనూ, సోషల్ మీడియాలోనూ షేర్ చేయబడ్డాయి. పలువురు అథ్లెట్లతో మోదీ ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉండడాన్ని గమనించవచ్చు.

“మెడల్ పే చర్చా విత్ కృష్ణా నగర్” పేరుతో మరో చిత్రం కూడా అప్లోడ్ చేశారు. టోక్యో పారాలింపిక్స్ 2020 లో పురుషుల సింగిల్స్ SH6 బ్యాడ్మింటన్‌లో స్వర్ణం గెలిచిన కృష్ణా నగర్‌తో సహా పారాలింపిక్ లో పాల్గొన్న బృందంతో మోదీ సంభాషించడం చూడొచ్చు. పలువురు అథ్లెట్లు.. తమ జీవితంలో జరిగిన సంఘటనలను మోదీకి వివరించగా.. ఆయన వింటూ ఉండడాన్ని గమనించవచ్చు. పలువురు కేంద్ర మంత్రులు కూడా ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. క్రీడల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ విజన్ గురించి అథ్లెట్లు ధన్యవాదాలు తెలిపారు.

అండగా నిలిచిన మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు:
టోక్యో పారాలింపిక్స్ 2020 లో అద్భుతమైన ప్రదర్శనను ఇచ్చారు అథ్లెట్లు..! భారత పారా అథ్లెట్లు తమకు లభించిన మద్దతుకు మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. టోక్యో గేమ్స్‌లో హై జంప్ T63 ఈవెంట్లో కాంస్య పతకం సాధించిన శరద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పారా అథ్లెట్లకు మద్దతు అందించడానికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఇతర దేశాల అథ్లెట్లు కూడా అభినందించారని వెల్లడించారు. ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు, కృషి క్రీడాకారులకు ఎంతో తోడ్పాటును ఇచ్చిందని శరద్ కుమార్ తెలిపింది. అథ్లెట్లకు మెరుగైన సదుపాయాలను అందించడం కోసం భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను శరద్ ప్రశంసించారు. ప్రభుత్వం అథ్లెట్లకు సౌకర్యాలు, కావాల్సిన పరికరాల పరంగా ఏమి అవసరమో గమనించి అందిస్తోంది ప్రభుత్వం. ప్రభుత్వం నుండి వచ్చిన ప్రేరణ అథ్లెట్లకు వృత్తిపరంగా విషయాలను చూడటానికి సహాయపడుతోంది. ఇది భారత పారా-స్పోర్ట్స్‌లో చాలా అవసరమైన మార్పును తీసుకువస్తోంది.

పతకాల సంఖ్య:
టోక్యో పారాలింపిక్స్‌లో భారతదేశం 19 పతకాలను గెలుచుకుంది. ఇది ఒకే ఎడిషన్‌లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన. భారత్ ఐదు స్వర్ణాలు, ఎనిమిది రజతాలు మరియు ఆరు కాంస్య పతకాలు సాధించింది. మెడల్స్ ట్యాలీలో 24 వ స్థానంలో నిలిచింది. ఈసారి, భారతదేశం 54 మందితో కూడిన పారా అథ్లెట్ల బృందాన్ని పంపింది. వారు అంచనాలకు మించి రాణించి ఎన్నడూ లేని విధంగా పతకాలు సాధించారు.
