భారత ప్రధాని నరేంద్ర మోదీ ‘కశ్మీర్ ఫైల్స్’ అనే సినిమాను ఆకాశానికి ఎత్తేశారు. కశ్మీర్ ఫైల్స్ సినిమా లాగే స్వాతంత్య్రానంతరం ప్రముఖులు, ప్రధాన సంఘటనలపై సినిమాలు తీయాలని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అన్నారు. వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన సినిమా “ది కాశ్మీర్ ఫైల్స్”, 1990లో కశ్మీరీ పండిట్లపై జరిగిన మారణహోమానికి సంబంధించిన సినిమా. ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. నిజాలను సమాధి చేయడంలో కొన్ని శక్తులు నిమగ్నమై ఉన్నాయని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ సభ్యులు సంవత్సరాలుగా అణచివేయబడ్డ నిజాలు, వాస్తవాలను బయటకు తీసుకువచ్చే వారికి అండగా నిలబడాలని కోరారు.
ది కాశ్మీర్ ఫైల్స్‌పై జరిగిన గందరగోళాన్ని ప్రస్తావిస్తూ, పార్లమెంటరీ పార్టీ సమావేశంలో బీజేపీ పార్లమెంటు సభ్యులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగం చేశారు. చరిత్ర, చారిత్రక వ్యక్తులను సరైన కోణంలో ప్రదర్శించడంలో ఇన్నాళ్లూ చాలా జాప్యానికి దారితీసిందని అన్నారు. ఇలాంటి సినిమాల ద్వారా ప్రజలు నిజానిజాలను తెలుసుకుంటారు. గతంలో జరిగిన ఏదైనా సంఘటనలకు ఎవరు బాధ్యులో అర్థం చేసుకుంటారు. ఎవరు దోపిడీ చేసారు, ఎవరు సరైన పని చేసారు, ఇలాంటి సినిమాలు తీసుకురావడానికి ప్రయత్నించండని అన్నారు. మహాత్మాగాంధీ ఆలోచనలు, ఆశయాలను వివరిస్తూ మరిన్ని మంచి సినిమాలు తీయాలని, ప్రపంచం ఆయన గురించి మరింత ఎక్కువగా తెలుసుకోవాలని ఆయన అన్నారు.
కశ్మీర్ ఫైల్స్ విడుదలకు వ్యతిరేకంగా ఉన్న వారిపై మోదీ విరుచుకుపడ్డారు. “కొంతమంది భావ ప్రకటనా స్వేచ్ఛ గురించి మాట్లాడతారు, కానీ ఎమర్జెన్సీపై ఎటువంటి సినిమా తీయలేదు, ఎందుకంటే సత్యాన్ని పాతిపెట్టడానికి నిరంతర ప్రయత్నం జరిగింది” అని ప్రధాని అన్నారు. “ఆగస్టు 24న (విభజన రోజు) మేము దానిని భయానక దినంగా గుర్తించాలని నిర్ణయించుకున్నాము, కొంతమందికి దానితో సమస్యలు ఉన్నాయి… కానీ ఆ రోజును దేశం ఎలా మరచిపోతుంది? ”అని మోదీ అన్నారు. భారతదేశ విభజన నేపథ్యంలో సినిమా ఏదీ లేదని కూడా పీఎం ఎత్తిచూపారు. “విభజనపై సినిమా తీశారా? కశ్మీర్ ఫైల్స్ గురించి, భావ ప్రకటనా స్వేచ్ఛ అనే జెండాను పట్టుకుని తిరుగుతున్న వారి గురించి ఇటీవలి కాలంలో మీరు తప్పక విని ఉంటారు, ”అని ఆయన అన్నారు.
సినిమాను అప్రతిష్టపాలు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను మోదీ ప్రశ్నించారు. “వాస్తవాలు, సత్యాల ఆధారంగా సినిమాను అంచనా వేయడానికి బదులుగా, దానిని అప్రతిష్టపాలు చేసే ప్రచారం జరుగుతోంది. నిజాన్ని చూపించడానికి ప్రయత్నించేవారిని మొత్తం వ్యవస్థ వ్యతిరేకిస్తోంది ”అని మోదీ అన్నారు. “వారు ఏదైతే నిజమని నమ్ముతారో దాన్నే చూడాలనుకునే వాటిని మాత్రమే వారు ప్రదర్శించడానికి ప్రయత్నిస్తారు. నిజానిజాలు ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు గత కొద్ది రోజులుగా కుట్ర జరుగుతోంది. సమస్య సినిమా గురించి కాదు, దేశం ముందు సత్యాన్ని సరైన రూపంలో తీసుకురావడమే” అన్నారాయన.