More

    శ్రద్ధాంజలి ఘటిస్తూ కన్నీళ్లు పెట్టుకున్న మోదీ

    కరోనా మహమ్మారి నుండి దేశాన్ని కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు రాష్ట్రాలతో సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలపై ఆయన ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచనలు ఇస్తూనే ఉన్నారు. అయినా కూడా కరోనా మహమ్మారి భారతీయులపై విరుచుకుపడింది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. భారతదేశంలో కరోనా ప్రాణాలు కోల్పోయిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగానికి గురయ్యారు. పెద్ద ఎత్తున ప్రజలు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు.

    దేశంలో కరోనా పరిస్థితులపై శుక్రవారం ప్రధాని మోదీ ఆరోగ్య కార్యకర్తలతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ క్రమంలో వైరస్‌తో ప్రజలు మృతి చెందుతుండడాన్ని గుర్తు చేసుకుని ఆవేదన చెందారు. తన సొంత లోక్‌సభ నియోజకవర్గం వారణాసికి చెందిన వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. వైరస్‌ ఎంతోమంది ప్రియమైన వారిని మన నుంచి తీసుకెళ్లిందని.. వారందరికీ అంజలి ఘటిస్తున్నట్లు చెప్పారు. కరోనాతో మృతి చెందిన కుటుంబసభ్యులకు వినమ్రపూర్వక శ్రద్ధాంజలి అర్పిస్తున్నట్లు రెండు చేతులు జోడించి తెలిపారు. పరిశుభ్రత పాటించాలని, కాశీని శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కాశీకి, అక్కడి ప్రజలందరికీ కృతజ్ఞతలు అని పేర్కొన్నారు.

    మోదీ ప్రస్తుత పరిస్థితుల గురించి మాట్లాడడమే కాకుండా భవిష్యత్తుకు సంబంధించిన సూచనలను కూడా చేశారు.

    తక్కువ సమయంలోనే వారణాసి లోని పండిట్ రాజన్ మిశ్రా కోవిడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం నిజంగా ప్రశంసనీయమని అన్నారు. వారణాసి నగరంలో ఆక్సిజన్ బెడ్లు, ఐసీయూ బెడ్లు పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చాయని.. అందుకు పండిట్ రాజన్ మిశ్రా కోవిడ్ ఆసుపత్రి కారణమని అన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి కష్ట పడుతున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. సుదీర్ఘకాలం పోరాడాల్సి ఉంటుందని.. సిద్ధంగా ఉండడం ఎంతో ముఖ్యమని అన్నారు. గ్రామాలలో కరోనా మహమ్మారి ప్రబలకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎం వర్కర్లు చేస్తున్న కృషిని మోదీ కొనియాడారు. ప్రజలందరూ టీకాలు వేయించుకోవాలని కోరారు. టీకాల విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని ఆయన అన్నారు. బ్లాక్ ఫంగస్ పై కూడా మనం పోరాటం చేస్తూ ఉన్నామని.. అధికారులు అప్రమత్తమై ఉన్నారని మోదీ తెలిపారు.

    Related Stories