వందే భారత్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఈ రైలు స్పెషాలిటీ ఏమిటంటే..?

0
937

వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. గుజరాత్ లోని గాంధీనగర్ లో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. వందే భారత్ రైలులోనే గాంధీ నగర్ నుంచి అహ్మదాబాద్ లోని కలుపూర్ రైల్వే స్టేషన్ వరకు ప్రధాని ప్రయాణించారు. ఈ రైలులో 16 కోచ్ లు ఉంటాయి. 1,128 మంది ప్రయాణికులు కూర్చొని ప్రయాణం చేయవచ్చు. ఈ రైళ్లు విమానాల్లో మాదిరి అత్యాధునిక సౌకర్యాలతో ఉంటాయి. రెండు రైళ్లు ఢీకొనకుండా నిరోధించే కవచ్ టెక్నాలజీని ఇందులో అమర్చారు. 180 డిగ్రీల కోణంలో తిరిగే సీట్లను అమర్చారు. కోచ్ వెలుపలి భాగంలో ప్లాట్ ఫామ్ సైడ్ కెమెరాలు, వెనుక భాగంలో కెమెరాలు అమర్చారు. దీంతో పైలట్లు కోచ్ పక్కన, వెనుక భాగంలోనూ ఏం జరుగుతుందో వీటి సాయంతో తెలుసుకోవచ్చు. సంప్రదాయ రైళ్లతో పోలిస్తే 30 శాతం తక్కువ విద్యుత్ ను వినియోగించుకుంటాయి.

ఎగ్జిక్యూటివ్ చైర్ కార్‌లో ముంబై నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లే ప్రయాణికులకు రూ. 2,505 కాగా.. చైర్‌కార్‌కు రూ. 1,385 చార్జీ ఉంటుంది. గాంధీనగర్-ముంబై వందే భారత్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 1 నుండి దాని కమర్షియల్ రన్ ప్రారంభమవుతుంది. ఇది ఆదివారాలు మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుంది. రైలు ముంబై సెంట్రల్ స్టేషన్ నుంచి ఉదయం 6.10 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు గాంధీనగర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో గాంధీనగర్ నుంచి మధ్యాహ్నం 2.05 గంటలకు బయలుదేరి ముంబై సెంట్రల్‌కు రాత్రి 8.35 గంటలకు చేరుకుంటుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 16 కోచ్‌లతో స్వదేశీంగా రూపొందించబడిన సెమీ-హై స్పీడ్ రైలు. ఈ రైలు కేవలం 140 సెకన్లలో 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.