యూరియా ఫ్రీ అంటివి..! రామగుండం రాకపోతివి..!! దొరా.. మీకోపం మోదీపైనా..? రైతుల పైనా..?

0
692

ఇచ్చిన మాట తప్పితే తల నరుక్కుంటాననే కేసీఆర్,.. 2017లో జరిగిన ఓ మీటింగ్‎లో తెలంగాణ రైతులకు ఒక హామీ ఇచ్చారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి తెలంగాణలో ఉపయోగించే 24 లక్షల టన్నుల ఎరువును వందశాతం ఉచితంగా అందజేస్తానని తెలిపారు. కేసీఆర్ అందుకే పుట్టాడని.. ఈ హామీ నెరవేర్చి దేశమంతా తెలంగాణవైపు చూసేలా చేస్తానని బీరాలు పలికారు. కాలం గిర్రున తిరిగింది. హామీ ఇచ్చి ఐదేళ్లు గడిచిపయాయి. కానీ, బస్తా కాదు కదా.. చెంచాడు యూరియా కూడా రైతులకు ఉచితంగా అందలేదు. పైగా తెలంగాణలో యూరియా కొరత విపరీతంగా పెరిగిపోయింది. పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సివచ్చింది. దీంతో సరైన సమయంలో రైతులకు ఎరువులందక యూరియా కోసం పాట్లు పడే పరిస్థితి నెలకొంది. అటు ఆర్థిక స్తోమత కలిగిన బడా రైతులు కూడా యూరియా కొనలేని రీతిలో ధరలు ఆకాశాన్నంటాయి. కొరత వల్ల సబ్సిడీ మాట అటుంచితే ఉన్నవాటినే ఎక్కువ ధరలు పెట్టి కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఉచిత ఎరువులు అందిస్తానని హామీలిచ్చిన కేసీఆర్ ఈ విషయంలో ఏమీ చేయలేకపోయారు. అయితే యూరియా కొరతను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడంతో కేంద్రమే చర్యలు చేపట్టింది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, 1999లో పలు కారణాలతో మూతపడ్డ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తిరిగి తెరవాలని నిర్ణయించుకుంది. ఈ ఫ్యాక్టరీని పునరుద్దరిస్తే అక్కడ ఉత్పత్తయ్యే ఎరువుల్లో 50 శాతం తెలంగాణ ప్రజలకే సరఫరా అవుతుంది. కాబట్టి, తెలంగాణ రైతులకు ఎరువుల కొరత తీర్చాలని సంకల్పించింది. అనుకున్నదే తడవుగా కార్యరంగంలోకి దిగింది మోదీ ప్రభుత్వం. కేవలం ఐదేళ్లలో రామగుండం ఫ్యాక్టరీని పునరుద్ధరించింది.

భారత దేశం వ్యవసాయాధారిత దేశం. 70 శాతం వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న మన దేశంలో ప్రతియేటా 300 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుంది. అయితే ఇందులో ఇప్పటివరకు 240 లక్షల మెట్రిక్‌‌ టన్నులు మాత్రమే భారత్ లో ఉత్పత్తి అవుతుండగా,.. మిగిలిన 60 లక్షల మెట్రిక్‌‌‌‌‌‌‌‌ టన్నుల ఎరువును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. దీంతో దిగుమతులపై ఆధారపడే ఎరువులకు అధిక ధర ఉండటంతో ఆ భారమంతా కేంద్రంపై పడుతోంది. దీనికోసం ఎరువుల ఉత్పత్తిలో ఆత్మనిర్భరత సాధించడానికి దక్షిణాది రాష్ట్రాల్లో మూతపడ్డ కర్మాగారాలన్నిటినీ తెరిపించాలనే సంకల్పాన్ని ప్రధాని తీసుకున్నారు. ఇందులో భాగంగానే రామగుండం ఫ్యాక్టరీని పునరుద్దరించడానికి 2015లో కేంద్రం ప్రజాభిప్రాయ సేకరణ జరిపి.. 2016 ఆగస్టు 7న మెదక్ జిల్లా గజ్వేల్ నుంచి స్వయంగా ప్రధాని శంకుస్థాపన చేశారు. దీని పునరుద్దరణ పనులు 2021 ఫిబ్రవరి 18 న పూర్తవగా మార్చి నెలలో యూరియా ఉత్పత్తి మొదలైంది. దాదాపు 6 వేల 300 కోట్ల వ్యయం వెచ్చించిన తర్వాత రామగుండం ఫ్యాక్టరీ పూర్తిస్థాయిలో తిరిగి ప్రారంభమైంది. పునరుద్దరణ పనులన్నీ పూర్తవడంతో తాజాగా ప్రధాని మోదీ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించారు. రామగుండం ఫ్యాక్టరీ దక్షిణాది రాష్ట్రాల్లోనే అతిపెద్ద ఎరువుల కర్మాగారం. 12 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన రామగుండం ఫ్యాక్టరీ.. తెలంగాణతో పాటు.. సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, చత్తీస్​గఢ్ రాష్ట్రాలకు యూరియా అవసరాలను తీరుస్తుంది. ఇందులో ఉత్పత్తి అయ్యే ఎరువుల్లో 50 శాతం తెలంగాణకే చెందుతుంది. దీంతో ఇప్పటివరకు రైతులు ఎదుర్కొన్న యూరియా కొరత పూర్తిగా తీరబోతోంది. రాష్ట్రంలో రైతులందరికీ సకాలంలో ఎరువులు అందనున్నాయి.

ఇదిలావుంటే, రైతుల కష్టాలను తీర్చే రామగుండం ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధాని మోదీకి కేసీఆర్ ప్రభుత్వం అడుగడుగునా అడ్డుతగలే ప్రయత్నం చేసింది. ప్రోటోకాల్ ప్రకారం రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవంలో పాల్గొనాల్సిన ముఖ్యమంత్రి.. తనకు ఆహ్వానమే అందలేదని బుకాయించే ప్రయత్నం చేశారు. టీఆర్ఎస్ ఎంపీ లింగయ్య యాదవ్ తో ప్రెస్ మీట్ పెట్టించి మరీ అబద్ధాన్ని మీడియాకు వివరించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం చిన్న చూపు చూస్తోందని అందుకే ఆహ్వానం కూడా ఇవ్వలేదని విమర్శించారు. అయితే ఈ అబద్ద ప్రచారాన్ని బీజేపీ అంతే దీటుగా తిప్పికొట్టింది. మోదీ పర్యటనపై కేసీఆర్ కు ఈ నెల రెండవ తారీఖునే ఆహ్వానం పంపామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దీనిపై స్వయంగా కేంద్ర మంత్రే లేఖను రాశారని వెల్లడించారు. ఆ లేఖను మీడియాకు చూపించారు. కేసీఆర్ కు రామగుండం ఫ్యాక్టరీ తెరవడం ఇష్టం లేదని అందుకే కుంటిసాకులు చెబుతున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. అయితే కేసీఆర్ రామగుండం ఎరువుల ప్రారంభోత్సవానికి హాజరవకుంటే వచ్చే నష్టమేమీ లేదు. కానీ, ప్రధాని పర్యటనను కమ్యూనిస్టుల సహాయంతో అడ్డుకోవడానికి ప్రయత్నించడమే వివాదానికి తావిచ్చింది. ఇక్కడే ప్రతిపక్షాలు కూడా కేసీఆర్‎పై విరుచుకుపడుతున్నాయి. ప్రధాని పర్యటనను అడ్డుకొని తెలంగాణ ప్రజలకు తీరని మోసం చేస్తున్నారని బీజేపీ విమర్శించింది. ఇన్నాళ్ళూ ప్రధాని తనకు అపాయింట్ కూడా ఇవ్వట్లేదని తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ కించపరిచారని విమర్శిస్తూ వచ్చిన కేసీఆర్,.. ఇప్పుడు స్వయంగా మోదీనే రాష్ట్రానికి వచ్చినా కలవడంలేదంటూ బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పర్యటనలో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను ప్రధానికి విన్నవించుకునే అవకాశం ఏర్పడినా కూడా దాన్ని సద్వినియోగం చేసుకోలేదని కమలనాథులు విమర్శిస్తున్నారు.

ఇదిలావుంటే, వ్యక్తిగత ఈగోలకు పోయి.. కేంద్ర ప్రభుత్వంతో గిల్లికజ్జాలు పెట్టుకుని.. ఇలా రాష్ట్ర సమస్యలను గాలికి వదిలేయడం సమంజసమేనా..? అని తెలంగాణ ప్రజానీకం ప్రశ్నిస్తోంది. ఫెడరల్ వ్యవస్థలో కేంద్రం – రాష్ట్రాల మధ్య సత్సంబంధాలుంటేనే అభివృద్ది జరుగుతుంది. ప్రభుత్వ ప్రయోజనాలను, రాజకీయ అంశాల నుంచి వేరు చేసి చూడాలి. కానీ కేసీఆర్ ఇవన్నీ మరిచి తన రాజకీయ గురువు చంద్రబాబు బాటనే అనుసరిస్తున్నట్లు అర్థమవుతోంది. చంద్రబాబు కూడా మొదట్లో కేంద్రంతో సఖ్యతగా మెలిగి తర్వాత కేంద్రంపై చిన్నసైజు పోరాటామే చేశారు. ప్రధాని మోదీకి నల్ల జెండాలతో నిరసనలు, అమిత్ షా కాన్వాయ్ పై రాళ్ళు విసరడాలు వరకు చేయించాడు. కానీ తర్వాతి కాలంలో చంద్రబాబు రాజకీయం ఏమైందో అందరికీ తెలిసిన విషయమే. ఇక తాజాగా కేసీఆర్ కూడా ఇదే పద్దతిని అనుసరిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. కనీసం రైతులకు వరప్రదాయిని అయిన.. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో కేసీఆర్ పాల్గొని ఉంటేనే బావుండేదని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో తన పర్యటనలో ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలను ఆకట్టుకున్నారు. హైదరాబాద్ లో దిగగానే.. రామగుండం ఫ్యాక్టరీని ప్రారంభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలంగాణ ప్రజల మనసును దోచేశారు. ఏదేమైనా, రెండు దశాబ్దాలుగా మూతపడిన ఎరువుల ఫ్యాక్టరీని కేవలం ఐదేళ్లలో పునరుద్ధరించి.. తెలంగాణకే కాకుండా.. దక్షిణాది రైతులకు మేలు చేశారన్న పేరు సంపాదించుకున్నారు. మరోవైపు ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి హాజరు కాకపోవడంతో కేసీఆర్ ఉచిత ఎరువుల హామీలన్నీ ఒట్టిమాటే అని రుజువయింది. తద్వారా సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోడని మరోసారి తేటతెల్లమైంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

fifteen − ten =