More

    బెంగాల్‌లోని బీర్‌భూమ్‌ దారుణంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

    పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్‌లో మంగళవారం ఎనిమిది మంది పౌరుల ప్రాణాలను బలిగొన్న హింసాకాండపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్ వద్ద బిప్లోబీ భారత్ గ్యాలరీ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ ఆన్‌లైన్ లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తన ప్రసంగంలో ఆయన బీర్‌భూమ్‌ దహనంపై వ్యాఖ్యానిస్తూ, “పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్‌లో జరిగిన హింసాత్మక సంఘటనపై నేను నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. బెంగాల్ మహాభూమిపై ఇంత ఘోరమైన పాపానికి పాల్పడిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తుందని ఆశిస్తున్నాను. ఇలాంటి సంఘటనలకు పాల్పడిన వారిని, అటువంటి నేరస్థులను ప్రోత్సహించే వారిని ఎప్పటికీ క్షమించవద్దని బెంగాల్ ప్రజలను నేను కూడా కోరుతున్నాను” అని ఆయన అన్నారు. ఇలాంటి హేయమైన నేరానికి పాల్పడిన వారిని మమతా బెనర్జీ సారథ్యంలోని బెంగాల్ ప్రభుత్వం చట్టానికి పట్టి ఇస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బీర్భూమ్ సామూహిక హత్యలకు పాల్పడిన నేరస్థులను, అలాంటి నేర శక్తులను ప్రోత్సహిస్తున్న వారిని ఎప్పటికీ క్షమించరాదని బెంగాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నేరస్థులను సాధ్యమైనంత త్వరలో పట్టుకుని శిక్షించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వానికి అన్నివిధాలా సహకరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు.

    కేంద్రంలోని తమ ప్రభుత్వం నేరస్తులను శిక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. “నేరస్థులకు వీలైనంత త్వరగా శిక్ష పడేలా రాష్ట్రానికి కావలసిన సహాయం అందజేస్తామని కేంద్ర ప్రభుత్వం తరపున నేను హామీ ఇస్తున్నాను” అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో, హాజరైన రాష్ట్ర సీనియర్ మంత్రి పార్థ ఛటర్జీ, ప్రధానమంత్రి వ్యాఖ్యలకు బదులిస్తూ “చట్టాన్ని గౌరవించేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. దోషులను పట్టుకుని శిక్షిస్తాం” అని అన్నారు.

    బీర్‌భూమ్ హింస: కనీసం 8 మంది మృతి

    మార్చి 22 రాత్రి, పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాలోని రాంపూర్‌హాట్ ప్రాంతంలో కోపంలో ఉన్న గుంపు పన్నెండు ఇళ్లకు నిప్పుపెట్టినట్లు నివేదించబడింది. కొన్ని నివేదికల ప్రకారం, బయటపడే అవకాశం లేకుండా దుండగులు బాధితులను వారి ఇళ్లలో బంధించారు. ఎనిమిది మంది మంటల్లో చిక్కుకుని మరణించారు. ఒకే ఇంట్లో అమాయక మహిళలు, చిన్నారులతో సహా ఏడు మృతదేహాలను వెలికితీశారు.

    టిఎంసికి చెందిన స్థానిక పంచాయతీ సభ్యుడు బదు షేక్ హత్యకు గురైన తర్వాత ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ హింసాకాండపై కలకత్తా హైకోర్టు సీబీఐ లేదా ఎన్ఐఏ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలచే సమగ్ర దర్యాప్తు చేయవలసిందిగా కోరుతూ దాఖలైన సుమో-మోటో పిటిషన్‌ను విచారించింది. పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్‌లో జరిగిన దహనం ఘటనలో 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

    Trending Stories

    Related Stories