ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ కు విచ్చేశారు. ఆయన తెలంగాణ బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. బేగంపేటలో అందుకు సంబంధించి స్వాగత సభ ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పట్టుదలకు, పౌరుషానికి మారుపేరు తెలంగాణ ప్రజలు అని అభివర్ణించారు. ఒక ఆశయం కోసం వేలమంది ప్రాణత్యాగం చేశారని.. ఏ ఒక్క కుటుంబం కోసమో తెలంగాణ పోరాటం జరగలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయిందని.. ఆ కుటుంబం అధికారంలో ఉండి దోచుకోవాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తెలంగాణ అమరుల ఆశయాలు నెరవేరడంలేదని, యువత ఆకాంక్షలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అన్నారు. కుటుంబ దోపిడీకి తెలంగాణ బలవుతోందని అన్నారు ప్రధాని. ప్రభుత్వ పథకాల విషయంలోనూ రాజకీయాలు చేస్తున్నారని, కేంద్ర పథకాల పేర్లు మార్చి తెలంగాణలో అమలు చేస్తున్నారని ఆరోపించారు. పథకాల్లో రాజకీయాలు చేస్తే ప్రజలు నష్టపోతారని తెలిపారు. తెలంగాణలో మార్పు రాబోతోందని.. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు ఆ దిశగా స్పష్టమైన సంకేతాలిస్తున్నాయని అన్నారు. తెలంగాణలో కొత్త చరిత్ర సృష్టిస్తామని, జెండా ఎగరేస్తామని.. తెలంగాణను ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలనేది తమ ఆకాంక్ష అని చెప్పుకొచ్చారు. తమ పోరాటం తెలంగాణ అభివృద్ధి కోసమేనని మోదీ చెప్పుకొచ్చారు.
తెలంగాణలో బీజేపీ శ్రేణులపై దాడుల విషయం తన దృష్టికి వచ్చిందని.. వచ్చే ఎన్నికల్లో నెగ్గేది, తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు చేసేది బీజేపీయేనని అన్నారు. తెలంగాణ ప్రజల సామర్థ్యం తమకు తెలుసని, తెలంగాణను టెక్నాలజీ హబ్ గా అభివృద్ధి చేస్తామని తెలిపారు. సర్దార్ పటేల్ దేశ ఐక్యత కోసం కృషి చేశారని, ఆయన ఆశయాలను బీజేపీ కార్యకర్తలు మరింత ముందుకు తీసుకెళ్లాలని ఉద్బోధించారు. కుటుంబ పార్టీలు దేశానికి చేటు అని.. తెలంగాణను విచ్ఛిన్నం చేసేవారు నాడే కాదు, నేడు కూడా ఉన్నారని వెల్లడించారు. కుటుంబ పార్టీలు అధికారంలో ఉంటే అవినీతి పెరుగుతుందని అన్నారు. టీఆర్ఎస్ ఓ పార్టీకి గులాంగా మారి పనిచేస్తోందని విమర్శించారు. మూఢ నమ్మకాలు తెలంగాణ అభివృద్ధికి అడ్డంకిగా మారాయని.. మూఢ విశ్వాసాలను నమ్మిన సీఎంలు ఎక్కువకాలం ఉండరని చెప్పారు.