More

  కార్గిల్‎లో మోదీ దీపావళి..! ఆనవాయితి తప్పని ప్రధాని..

  మిన్నంటే తారలు ఇంటింటా వెలిగే రోజు, పల్లెదో పట్టణమేదో తెలియని రోజు, అమావాస్య నాడు వచ్చే పున్నమి రోజు దీపావాళి రోజు. ఆ చీకటి వెలుగుల రంగేళి పండుగ వచ్చిందంటే.. ఎవరైనా ఏం చేస్తారు. తమవారు, తమ బంధువులు, తమ సన్నిహితులతో కలిసి ఆనందోత్సాహాలతో గడపడానికి ఉత్సాహం చూపిస్తారు. నిర్భాగ్యులు, నిరుపేదలు, దివ్యాంగులతో కలిసి పండుగ వేడుకలు నిర్వహించుకోవాలని ఎంతమందికి ఉంటుంది..? ఎముకలు కొరికే చలినైనా, కుంభవృష్టి వానలైనా, మండుటెండలైనా లెక్క చేయక రాత్రనక పగలనక సేవలందించే సైనికుల సమక్షంలో దీపావళి సంబరాలు చేసుకోవాలని ఎందరు భావిస్తారు. ఎవరి భావన ఎలా వున్నా.. ప్రధాని నరేంద్ర మోదీకి ఈ భావన ఎప్పుడో వచ్చింది. ఎప్పటి నుంచో అదే రీతిలో దీపావళి సంబరాలు నిర్వహించుకుంటున్నారు. ఈసారి కూడా కార్గిల్ మంచుకొండల్లో వీరజవాన్లతో కలిసి దీపావళి సెలెబ్రేట్ చేసుకున్నారు ప్రధాని మోదీ.

  అలాగే, దేశప్రజలకు ప్రధాని మోదీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి ప్రకాశంతో ముడిపడి ఉంటుందని, ఈ పవిత్రమైన పండుగ మన జీవితాల్లో సంతోషం ,శ్రేయస్సు కలుగజేయాలని కోరుకుంటున్నానని ప్రధాని తెలిపారు. తమ హితులు, సన్నిహితులు, బంధువులతో కలిసి దేశ ప్రజలందరు దీపావళి పండుగను ఆనందోత్సాహాలతో నిర్వహించుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు.

  ఇక ఈ ఏడాది కార్గిల్ లో దీపావళి జరుపుకున్నారు ప్రధాని మోదీ. కార్గిల్ పోరాటంలో కశ్మీర్ రక్షణకు.. భారత సైనికులు అందించిన సేవలు అజరామరమైనవి. మైనస్ డిగ్రీల మంచువానాల్లో.. హిమగిరి శిఖరాల్లో పోరాటం చేసి.. ముష్కరులను తరిమికొట్టి సరిహద్దును కాపాడిన వీరులు, శూరులు కార్గిల్ పోరాట యోధులు. ఆ పుణ్యభూమిలో, భరతమాత గర్వించే సైన్యం సమక్షంలో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు చేసుకున్నారు. సైనికులతో కలిసి ఆయన దీపావళి వేడుకలు చేసుకోవడం ఇదే ప్రథమం కాదు. మొదటి నుంచి ఆయన సైనికులతో మమేకమయ్యి ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు.

  సైనిక బంధువులతో కలిసి దీపావళి పండుగ జరుపుకున్న మోదీ.. దేశం సాధిస్తున్న పురోగతిని ప్రధాని మోది వివరించారు. దేశం పలు సవాళ్లను ఎదుర్కొని గట్టిగా నిలబడిందన్నారు.సైనికుల త్యాగాలను ఆయన ప్రశంసించారు. దేశరక్షణలో సైన్యం సేవలు మరువలేనివని కొనియాడారు. దేశభక్తి దైవభక్తితో సమానమని తెలిపారు. ఆర్మీ బలగాలను చూస్తుంటే తనకు గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా జవాన్లకు ప్రధాని మోదీ స్వీట్లు పంచారు. జవాన్లతో కలిసి దీపావళి పండుగ జరుపుకోవడం తనకు చాలా సంతోషాన్ని కల్గిస్తోందని ప్రధాని చెప్పారు.

  గతేడాది జమ్మూలోని నౌషేరాలో సైనికులతో కలిసి దీపావళి పండుగ జరుపుకున్నారు మోదీ. 2020లో రాజస్థాన్‌ జైసల్మేర్‌లోని లాంగేవాలాలో సైనిక బలగాలతో దీపావళి వేడుక చేసుకున్నారు. ఆ సందర్భంలో ప్రధాని మోదీ దివ్య సందేశం ఇచ్చారు. భారత సైన్యం ఉన్నంత కాలం దేశంలో దీపావళి ఉత్సవాలు ఉధృతంగా కొనసాగుతాయని, ప్రకాశవంతంగా ఉంటాయన్నారు. దీపావళి పండుగను సైనికులతో గడిపే తమ వార్షిక ఆచారాన్ని ప్రధాని మోదీ దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు.

  2019లో, జమ్మూ, కశ్మీర్‌లోని రాజౌరీ సెక్టార్‌లో, నియంత్రణ రేఖ సమీపంలో సైనికులతో కలిసి ప్రధాని దీపావళి పండుగ చేసుకున్నారు. 2018లో, ఉత్తరాఖండ్‌లోని హర్సిల్‌లో ఇండియన్ ఆర్మీ, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ సిబ్బందితో కలిసి దీపాల పండుగలో పాల్గొన్నారు. 2017లో, జమ్మూ, కశ్మీర్‌లోని బందిపోరా జిల్లా గురెజ్ వ్యాలీలో ఆర్మీ సైనికులు, సరిహద్దు భద్రతా దళం సిబ్బందితో ఫెస్టివల్ ఆఫ్ లైట్స్‌కు ప్రధాని హాజరయ్యారు.

  2016లో, ప్రధాని మోదీ హిమాచల్ ప్రదేశ్‌ అవుట్‌పోస్ట్‌లో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసు సభ్యులతో ఈ వేడుకలో పాల్గొన్నారు. 2015లో పంజాబ్ సరిహద్దులో సైనికులతో కలిసి దీపావళి వేడుక జరుపుకున్నారు. ఇక ఆయన ప్రధాని పదవి చేపట్టిన తొలి ఏడాది.. 2014లో రక్తం గడ్డకట్టే సియాచిన్‌లో సైనికులతో కలిసి వెలుగుల పండుగ జరుపుకున్నారు. దేశసేవే ప్రథమ లక్ష్యంగా.. తల్లిదండ్రులకు, భార్యాపిల్లలకు దూరంగా పండుగ రోజు సైతం దేశ రక్షణ కోసం పనిచేస్తున్న జవాన్లతో కలిసి దీపావళి జరుపుకోవడం ప్రధాని మోదీకే చెల్లింది.

  Trending Stories

  Related Stories