కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి మెగా ప్రాజెక్టును ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో పీఎం మిత్ర టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. అందులో ఒకటి తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఈ మెగా టెక్స్ టైల్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నారు. టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటుతో లక్షలాది మంది రైతులకు, చేనేత కార్మికులకు ఉపాధి, వేలాది మంది యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి. పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్కులు టెక్స్ టైల్స్ రంగానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పిస్తాయని, కోట్లాది పెట్టుబడులను ఆకర్షిస్తాయని, లక్షలాది ఉద్యోగాలను సృష్టిస్తాయని ప్రధాని మోదీ తెలిపారు. ఈ పార్క్ ప్రధానమంత్రి మోదీ తెలంగాణకు అందించిన కానుక అని కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజల తరపున ప్రధాని మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. దక్షిణ తమిళనాడులో టెక్స్‌టైల్ రంగానికి ఊతమిస్తోందని, రాష్ట్రంలో PM మిత్ర టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది గణనీయమైన ఉపాధిని సృష్టిస్తుందని, ఆర్థిక వ్యవస్థ మరింత మెరుగయ్యేలా చేస్తుందని స్టాలిన్ అన్నారు. తమిళనాడులోని విరుదునగర్ జిల్లాను ఎంపిక చేసినందుకు స్టాలిన్ కృతజ్ఞతలు తెలిపారు.