దుబాయ్‌లో ముఖ్యమంత్రి పినరయి విజయన్ చొక్కా, ప్యాంటు ధరించి ఉన్న వీడియోను షేర్ చేసినందుకు కేరళలోని జి నెరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ఉద్యోగిని కేరళ ప్రభుత్వం సస్పెండ్ చేసిందనే విమర్శలు వస్తున్నాయి. విజయన్ తన సాధారణ వేషధారణ ధోతీ, చొక్కాకి బదులుగా నల్ల ప్యాంట్‌లో ఫుల్ స్లీవ్ తెల్లటి చొక్కా ధరించి దుబాయ్ విమానాశ్రయం నుండి బయటకు వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అటెండర్‌గా పనిచేస్తున్న మణికుట్టన్ అనే ఉద్యోగి ఈ వీడియోను రాష్ట్ర సచివాలయంలోని ప్రభుత్వ అటెండర్ల వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేసినట్లు తెలిసింది. వాట్సాప్‌లో షేర్ చేసిన మెసేజ్‌లో పినరయి విజయన్‌ను కూడా ఆ ఉద్యోగి విమర్శించారు. వాట్సాప్‌లో అతని సందేశంపై కోపంతో.. కేరళ ప్రభుత్వం ముఖ్యమంత్రి ప్రతిష్టను దిగజార్చిందని పేర్కొంటూ మణికుట్టన్ సస్పెన్షన్ ఆర్డర్‌ను జారీ చేసింది.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కొద్దిరోజులు దుబాయ్‌లో గడపనున్నారు. చికిత్స కోసం అమెరికాకు వెళ్లిన విజయన్ అమెరికా నుంచి నేరుగా కేరళకు తిరిగి రావాల్సి ఉంది. కేరళకు వచ్చే ముందు దుబాయ్‌లో కొంత సమయం గడపనున్నారు. ఫిబ్రవరి 4న దుబాయ్‌లో జరుగుతున్న ఎక్స్‌పో సందర్భంగా విజయన్ కేరళ పెవిలియన్‌ను ప్రారంభిస్తారు. UAE కి చెందిన కొంతమంది అగ్ర నాయకులతో సమావేశమవనున్నారు . ఫిబ్రవరి 7 నాటికి విజయన్ కేరళకు తిరిగి వచ్చే అవకాశం ఉంది.