కేరళ సీపీఎం పార్లమెంటరీ పార్టీ నేతగా, ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ నియమితులయ్యారు. పినరయి విజయన్ తదుపరి ప్రభుత్వంలో మంత్రుల పేర్లను కూడా ప్రకటించింది. సీపీఎం రాష్ట్ర కమిటీ ప్రకటించిన వివరాల ప్రకారం పినరయి విజయన్ తదుపరి మంత్రివర్గంలో ఎంవీ గోవిందన్, కే రాధాకృష్ణన్, కేఎన్ బాలగోపాల్, పీ రాజీవ్, వీఎన్ వాసవన్, సజి చెరియన్, వీ శివన్ కుట్టి, మహమ్మద్ రియాజ్, డాక్టర్ ఆర్ బిందు, వీణా జార్జి, వీ అబ్దుల్ రహమాన్ మంత్రి పదవులను చేపట్టబోతున్నారు. నవ తరానికి పెద్ద పీట వేశామని కేరళ సీపీఎం చెబుతోంది.
పినరయి విజయన్ వారసత్వ రాజకీయాలకు పెద్ద పీఠ వేశారంటూ తీవ్ర విమర్శలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే పినరయి విజయన్ తన అల్లుడికి కేబినెట్ లో మినిస్టర్ గా పదవిని ఇచ్చారు. దీనిపై కేరళలో తీవ్ర విమర్శలు వస్తూ ఉన్నాయి. ఎంతో మంది సమర్థులను పక్కన పెట్టి అల్లుడికి ఎలా పదవిని కట్టబెడతారంటూ పలువురు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎల్.డీ.ఎఫ్. కూటమి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందు కేబినెట్ లో పని చేసిన పలువురిని పక్కన పెడుతూ నిర్ణయం తీసుకుంది. చివరికి భారతప్రధాని నరేంద్ర మోదీ, ప్రపంచ ఆరోగ్య సంస్థతోనూ ప్రశంసలు అందుకున్న శైలజా టీచర్ ను కూడా కేబినెట్ నుండి పక్కన పెట్టేశారు.
కొత్తవాళ్లకు అవకాశం ఇస్తున్నామని చెప్పిన సీపీఎం పార్టీ అందులో పినరయి విజయన్ అల్లుడు మొహమ్మద్ రియాజ్ ను మినిస్టర్ గా అపాయింట్ చేశారు. కోళికోడ్ జిల్లాలోని బేపోరే నుండి పోటీ చేసి గెలిచిన మొహమ్మద్ రియాజ్ కు మామ పినరయి విజయన్ కేబినెట్ మంత్రిగా పదవిని కట్టబెట్టాడు. మొహమ్మద్ రియాజ్ డెమొక్రాటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డివైఎఫ్ఐ) చీఫ్ గా కూడా ఉన్నాడు. ఎంతో వివాదాస్పదమైన గత చరిత్ర మొహమ్మద్ రియాజ్ ది..! గతంలో పలు కేసులు కూడా ఇతడిపై ఉన్నాయి. స్టూడెంట్ నేతగా ఉన్న సమయంలో కేరళలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనల్లో పాలు పంచుకున్నాడనే అభియోగాలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో కూడా రియాజ్ ను పోలీసులు జుడీషియల్ కస్టడీకి తీసుకున్నారు. కోళికోడ్ లోని ఎయిర్ ఇండియా ఆఫీసు ముందు నిరసన ప్రదర్శనలు చేశారు. మొత్తం నలుగురి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత బెయిల్ మీద మొహమ్మద్ రియాజ్ విడుదలయ్యాడు.
మొహమ్మద్ రియాజ్ పినరయి విజయన్ కుమార్తె వీణను గతేడాది పెళ్లి చేసుకున్నాడు. మొహమ్మద్ రియాజ్ గతంలో బీఫ్ ఫెస్టివల్ ను నిర్వహించి కూడా కేరళలో ఫేమస్ అయ్యాడు. 2019లో కోళికోడ్ లోక్ సభ స్థానం కోసం పోటీ చేసి ఓడిపోయాడు.