National

కైలాస మానస సరోవరానికి కారులో వెళ్ళవచ్చు

కైలాస మానస సరోవర యాత్ర.. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే యాత్ర.. అంతేకాకుండా ఇది ఎంతో సాహసంతో కూడుకున్న యాత్ర. భక్తులు ఒక్కసారైనా ఈ అద్భుతమైన యాత్రను పూర్తి చేయాలని కోరుకుంటారు. మానస సరోవరంలో స్నానం చేయడం, కైలాస పర్వతాన్ని దర్శించడం కోట్లాది హిందువుల ఆకాంక్ష. సముద్ర మట్టానికి సుమారు 15 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ క్షేత్రానికి చేరుకోవడం అంత సులభమైన పని కాదనే విషయం ఎంతో మందికి తెలుసు. టిబెట్ ప్రాంతంలో ఈ అద్భుతమైన క్షేత్రం ఉంది. ప్రతి ఏటా శీతాకాలంలో ఈ ప్రాంతం మంచుతో కప్పబడి ఉంటుంది. ఎండాకాలం, ఋతుపవనాల సమయంలో భక్తులను యాత్ర చేసేందుకు అనుమతి ఇస్తారు.

కైలాస మానస సరోవరం దగ్గరకు కారులో వెళ్లేలా భారత ప్రభుత్వం ఏర్పాట్లను చేస్తూ వెళుతోంది. రక్షణ శాఖ సహాయమంత్రి అజయ్‌ భట్‌ మాట్లాడుతూ కైలాస మానస సరోవరం దగ్గరకు కారులో వెళ్లేలా చర్యలు చేపట్టామని తెలిపారు. అక్కడికి వెళ్లే రహదారిని మరింత విశాలంగా నిర్మించేందుకు రూ. 60 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు. ఘటియాబగర్‌ నుంచి లిపులేఖ్‌ వరకూ ఉన్న సరిహద్దు రోడ్డును మెటల్‌ రోడ్డుగా మార్చనున్నట్లు ఆయన తెలిపారు. పితోర్‌ఘర్ జిల్లాలోని గుంజి గ్రామంలో ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో భట్ మాట్లాడుతూ, లోహ రహదారి రక్షణ సిబ్బంది త్వరగా సరిహద్దు అవుట్‌పోస్టులకు చేరుకోవడంలో సహాయపడటమే కాకుండా పర్యాటకులు ప్రత్యేకమైన ప్రదేశానికి చేరుకోవడానికి కూడా సహాయపడుతుందని అన్నారు. గుంజి అనేది పితోర్‌ఘర్‌లోని ధార్చులా సబ్‌డివిజన్‌లోని వ్యాస్ వ్యాలీలో 10,000 అడుగుల ఎత్తులో కైలాస-మానససరోవర్ మార్గంలో ఉన్న సరిహద్దు గ్రామం.

భారత దేశం నుండి యాత్రికులు మూడు మార్గాల ద్వారా కైలాస మానస సరోవర్ కు చేరుకోవచ్చు. అవి సిక్కిం, ఉత్తరాఖండ్ మరియు నేపాల్. యాత్రికులు భారత దేశం నుండి సులభంగా కైలాష్ మానస సరోవర్ యాత్ర పూర్తి చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఉత్తరాఖండ్ లోని ధార్చులాను లిపులేఖ్ కు అనుసంధానించే కొత్త రహదారి భారత దేశాన్ని టిబెట్ తో కలుపుతుంది. ఈ రహదారి భారత దేశం నుండి టిబెట్ భూభాగంలో ఉన్న కైలాష్ మానస సరోవర్ మధ్య ప్రయాణాన్ని తగ్గిస్తుంది. ప్రతి సంవత్సరం భారత దేశం నుండి పరిమిత సంఖ్యలో యాత్రికులు కైలాష్ మానస సరోవర్ యాత్రకు బ్యాచ్ లుగా వెళుతుంటారు. కొత్త రహదారి ద్వారా ఈ ప్రయాణ సమయం ఆరు రోజులు తగ్గునుంది. సమయమే కాదు ఈ మార్గం ఎంతో సౌకర్యవంతంగానూ ఉంటుంది. అన్ని వయసుల ప్రజలు కైలాష్ మానస సరోవర్ ను సందర్శించడం మరింత సులభతరంగా మారుతుంది. లిపులేఖ్ పాస్ మీదుగా యాత్రికులు చైనాకు వెళ్లిన తరువాత 5 కిలోమీటర్ల చిన్న ట్రెక్ చేయాల్సి ఉంటుంది. ఈ ట్రెక్ తరువాత యాత్రికులు 130 కిలోమీటర్ల రహదారి ప్రయాణం, 43 కిలోమీటర్ల పరిక్రమాన్ని పూర్తి చేయాలి.

మహాశివుని పవిత్ర నివాస స్థలంగా కైలాస పర్వతాన్ని భక్తులు విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం కైలాసగిరి హిమాలయాలు భారత ఖండానికి చెందినవిగా చెబుతారు. తరువాతి కాలంలో టిబెట్ స్వతంత్ర్య దేశంగా అవతరించడంతో కైలాసగిరి టిబెట్ దేశ పరిధిలోకి వెళ్లింది. దీంతో ఈ ప్రాంతం కేవలం హిందువులకే కాక బౌద్ధులు, జైనులకు కూడా పవిత్ర స్థలంగా మారింది.

Related Articles

Back to top button