More

  డ్రాగన్ కంట్రీ కండకావరం..! సరిహద్దుల్లో మరో రహస్య గ్రామం

  సరిహద్దుల్లో చైనా అగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. పొరుగు దేశాలపై డ్రాగన్ కంట్రీ త‌న‌ దుందుడుకు చ‌ర్య‌ల‌ను కొన‌సాగిస్తూనే ఉంది. చుట్టుప‌క్క‌ల ఉండే దేశాల భూభాగాల‌ను కొద్దికొద్దిగా ఆక్రమిస్తూ, అవి త‌మ భూభాగాలుగా చెప్పుకుంటోంది. ఇరుగుపొరుగు దేశాల సరిహద్దుల్లో అక్రమ నిర్మాణాలతో బరితెగిస్తోంది.

  తాజాగా భూటాన్ వైపునున్న డోక్లామ్ పీఠభూమికి తూర్పు వైపున 9 కిలోమీటర్ల దూరంలో అమూచు నదీ లోయలో ఒక కొత్త గ్రామాన్ని నిర్మించింది. ఇలాంటి కృత్రిమ గ్రామాలను పంగ్డా అని చైనా పిలుస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన శాటిలైట్ ఇమేజెస్ తో ఈ దురాక్రమణ విషయం బట్టబయలైంది. స్పేస్ టెక్నాలజీ, ఇంటెలిజెన్స్ కంపెనీ మక్సార్ ఈ శాటిలైట్ ఇమేజెస్ ను విడుదల చేసింది. భూటాన్ సరిహద్దుల్లోని భూమిని ఆక్రమించి చైనా నిర్మించిన గ్రామంలోని ప్రతి ఇంటి ఎదుట కార్లు పార్క్ చేసి ఉన్నాయని ఆ ఫోటోలను బట్టి స్పష్టమవుతోంది.

  భూటాన్ వైపునున్న డోక్లామ్ పీఠభూమి ప్రాంతంలో చైనా అక్రమంగా గ్రామాన్ని నిర్మించడం ఇది రెండోసారి. ఐదేళ్ల క్రితమే 2017లో అక్కడ ఓ గ్రామాన్ని చైనా నిర్మించింది. అయితే అప్పట్లో భూటాన్ లోని డోక్లామ్ ఏరియాలో చైనా అక్రమంగా రోడ్డు నిర్మాణానికి తెగబడటంపై భారత్ స్పందించింది. భూటాన్ కు మద్దతుగా రంగంలోకి దిగింది. దీంతో ఆ ఏడాది దాదాపు 73 రోజుల పాటు భారత్, చైనా సైన్యాల మధ్య ప్రతిష్టంభన కొనసాగింది. దురాక్రమణవాదంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నా పట్టించుకోకుండా..భూటాన్ లోని డోక్లామ్ పీఠభూమికి దక్షిణ ప్రాంతంలో మూడో గ్రామాన్ని నిర్మించేందుకూ డ్రాగన్ కసరత్తు చేస్తోందని అప్పుడు మీడియా కథనాల్లో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో.. చైనా తన ‘సలామీ స్లైసింగ్‌’ విధానాన్ని భూటాన్‌పై ప్రయోగిస్తోందనేది నిపుణులు అంచనా వేశారు.

  ఈ నిర్మాణాల ద్వారా డోక్లామ్ పీఠభూమిలోని వ్యూహాత్మక భాగాలపై పట్టు సంపాదించేందుకు చైనా బలగాలు ప్రయత్నిస్తున్నాయి. భారత్ కు చెందిన సున్నితమైన సిలిగురి కారిడార్, సిక్కింకు చైనా బలగాలు చేరుకోవడానికి ఈ కొత్త గ్రామాల మీదుగా వెళ్లే మార్గం దోహదపడుతుందని తెలుస్తోంది. ఈశాన్య రాష్ట్రాలను భారత్ లోని మిగతా భూభాగంతో అనుసంధానించేది సిలిగురి కారిడారే. ఇక భూటాన్ దాదాపు 400 కిలోమీటర్ల సరిహద్దును చైనాతో షేర్ చేసుకుంటోంది. సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునేందుకు 2021 అక్టోబరులో భూటాన్, చైనా త్రీ స్టెప్ రోడ్ మ్యాప్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇప్పటివరకు ఆ రెండు దేశాల మధ్య 24 రౌండ్ల చర్చలు జరిగాయి. అయినా ఒక శాశ్వత పరిష్కారాన్ని కనుగొనలేకపోయాయి.

  అయితే డ్రాగన్ కంట్రీ నేపాల్‌లోనూ ఇటువంటి దురాక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డుతోంది. నేపాల్‌లోని రాష్ట్రీయ ఏక్తా అభియాన్‌ పౌర సంస్థ తాజాగా త‌మ ప్ర‌భుత్వానికి ఓ విజ్ఞాప‌న ప‌త్రాన్ని స‌మ‌ర్పించింది. నేపాల్ భూభాగాల విషయంలో చైనా చ‌ర్య‌లను అంత‌ర్జాతీయంగా ఎండ‌గ‌ట్టాలని భూ నిర్వ‌హ‌ణ మంత్రి శ‌శి శ్రేష్ఠ‌ను రాష్ట్రీయ ఏక్తా అభియాన్ అధ్య‌క్షుడు బిన‌య్ యాద‌వ్ కోరారు. అంతేగాక‌, గోర్ఖాలోని చుమనువ్రీ రూర‌ల్ మునిసిపాలిటీ-1 ప‌రిధిలో రుయిలా స‌రిహ‌ద్దు వ‌ద్ద చైనా అక్ర‌మంగా చొర‌బ‌డి కంచె వేసింద‌ని తెలిపారు. అంత‌ర్జాతీయ చ‌ట్టాలు, నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా నేపాల్ స‌రిహ‌ద్దుల్లోని ప‌లు ప్రాంతాల్లో చైనా ఆక్ర‌మ‌ణ కొన‌సాగుతోంద‌ని చెప్పారు. ఈ తీరు నేపాల్‌-చైనా మ‌ధ్య ఉన్న స్నేహ బంధాన్ని అవ‌మానించ‌డ‌మే కాకుండా, నేపాల్ సార్వ‌భౌమ‌త్వానికి స‌వాలు విస‌ర‌డ‌మేన‌న్నారు. ప్ర‌స్తుత ప్ర‌భుత్వం అనేక చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికీ చైనా దురాక్ర‌మ‌ణలు కొన‌సాగుతున్నాయ‌ని చెప్పారు. చైనా తీరుపై నేపాల్ ప్ర‌భుత్వం క‌ఠిన వైఖ‌రిని అవ‌లంబించాల‌ని కోరారు. ఇలా చైనా దేశం పొరుగు దేశాల భూభాగాలను ఆక్రమించుకోవడంతో ఆయా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

  spot_img

  Trending Stories

  Related Stories