International

పీహెచ్డీలు, పీజీలు చేసిన వారి కన్నా డిగ్రీలు లేని ముల్లాలే గొప్ప: ఆఫ్ఘన్ విద్యాశాఖ మంత్రి

కాబూల్ ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న మూడు వారాల తర్వాత అక్కడ తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడనుంది. తాలిబాన్లు తమ మంత్రి వర్గాన్ని ప్రకటించారు. తాలిబాన్ సుప్రీం లీడర్ ముల్లా హసన్ అఖుంద్ ఆఫ్ఘన్ దేశాధినేతగా వ్యవహరించబోతున్నాడు. ఉపాధ్యక్షుడు-1గా ముల్లా బరాదర్, ఉపాధ్యక్షుడు-2గా మలావీ హనాఫీ నియమితులయ్యారని తాలిబాన్ నేతలు తెలిపారు. ఇక తాత్కాలిక రక్షణ మంత్రిగా ముల్లా యాకూబ్, తాత్కాలిక హోంమంత్రిగా సిరాజుద్దీన్ హక్కానీ, తాత్కాలిక విదేశాంగ శాఖ మంత్రిగా అమీర్ ముత్తాఖీ, తాత్కాలిక ఆర్థికమంత్రిగా ముల్లా హిదాయతుల్లా బద్రీ, తాత్కాలిక విద్యాశాఖ మంత్రిగా షేక్ మాల్వీ నూరుల్లా బాధ్యతలు స్వీకరించారు. తాజా మంత్రివర్గంతో త్వరలోనే తాలిబాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసి, అధికారికంగా కార్యకలాపాలు సాగించనున్నారు. తాలిబాన్ మంత్రుల్లో సిరాజుద్దీన్ హక్కానీతో పాటు పలువురు అమెరికా ఉగ్రవాద హిట్ లిస్టులో ఉన్నారు.

తాలిబాన్ కొత్త విద్యాశాఖ మంత్రి షేక్ మాల్వీ నూరుల్లా మునీర్ చేసిన వ్యాఖ్యలకు ప్రపంచం మొత్తం నిర్ఘాంతపోయింది. అసలు చదువుకే విలువ లేదన్నట్టు చెప్పుకొచ్చారు. ఈ పీహెచ్డీలు, పీజీలు ఇప్పుడు అన్నీ దండగ అని తేల్చి చెప్పారు. మా ముల్లాలు, ఇప్పుడు పదవిలో ఉన్నాం. పీహెచ్డీలు, పీజీలు చేసిన వారి కన్నా మంచి స్థానాల్లో ఉన్నాం. వారందరి కన్నా మేమే గొప్ప అని అన్నారు. ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారింది. ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలో ఉన్నత విద్య డిగ్రీలు లేనప్పటికీ ముల్లాలు (ఇస్లామిక్ మతాధికారులు) అందరికంటే గొప్పవారని తెలిపారు. పిహెచ్‌డి, ఎంఏ లేదా హైస్కూల్ డిగ్రీ కూడా లేని ముల్లాలు అందరికంటే గొప్ప వారు అని ఆయన నొక్కి చెప్పారు. దీన్ని బట్టే ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నత విద్య ఎటువైపు వెళుతుందోననే ఆందోళన ప్రజల్లో ఎక్కువైంది. ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వారి నుంచి ఇలాంటి మాటలు కాకపోతే ఇంకా ఏం ఆశిస్తామంటూ మండిపడుతున్నారు.

కో-ఎడ్యుకేషన్ పై నిషేధం, లింగం ఆధారంగా తరగతుల విభజన

తాలిబాన్ పాలనలో ఆఫ్ఘనిస్తాన్‌లో కో-ఎడ్యుకేషన్ ఉండదని తేల్చి చెప్పారు. హెరాత్‌ నగరంలో కో-ఎడ్యుకేషన్ ను నిషేధించినట్లు తాలిబాన్లు తెలిపారు. ‘సమాజంలోని అన్ని చెడులకు మూలం’ అని కో-ఎడ్యుకేషన్ ను తాలిబాన్లు అభివర్ణించారు. వాస్తవానికి తాలిబాన్లు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత జారీ చేసిన మొదటి ‘ఫత్వా’ ఇది. మహిళా లెక్చరర్లు కేవలం మహిళా విద్యార్థులకు మాత్రమే బోధించడానికి అనుమతించబడతారని మగ విద్యార్థులకు కాదని తాలిబాన్లు తెలిపారు. ప్రొఫెసర్లు, ప్రైవేట్ సంస్థల యజమానులు మరియు తాలిబాన్ నాయకుల మధ్య సమావేశం జరిగిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోబడింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 × five =

Back to top button