ప్రాణం తీసేసిన కట్టుకథ..!

0
863

కట్టు కథ.. ఒకే ఒక కట్టు కథ.. తన జీవితాన్ని విషాదకరంగా ముగించేలా చేసింది. గెలిస్తే చప్పట్లు.. ఓడిపోతే సూటి పోటి మాటలు అందించే సమాజం నడుమ మోసగించి బ్రతకాలని చూస్తే.. ఆ బతుకు చిత్రవధకు గురికాక తప్పదు.. ఈ మొత్తం కధనం విన్నాక ఎవరికైనా అలానే అనిపిస్తుంది.

పది రోజుల క్రితం కిడ్నాప్ డ్రామా ఆడి హైదరాబాద్ లో కలకలం రేపిన బీఫార్మసీ కథ విషాదాంతంగా మారింది. కాలేజీకి వెళ్లి తిరిగొస్తుండగా కిడ్నాప్ అయ్యానంటూ తల్లికి ఫోన్ చేసి పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన యువతి చివరకు దారుణ నిర్ణయం తీసుకుంది. కిడ్నాప్ డ్రామా అంతా ఫేక్ అని పోలీసులు తేల్చడంతో ఇంటా బయటా తీవ్ర విమర్శలువచ్చాయి. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురయినట్టు సమాచారం. ఘటన జరిగిన తర్వాత ఆ యువతి తన అమ్మమ్మ వాళ్లింట్లో ఉంటోంది. ఈ పది రోజులుగా కూడా ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా ఇంట్లోనే ఉండిపోయింది. తీవ్ర మనస్తాపంతో మంగళవారం రాత్రి ఇంట్లో షుగర్ ట్యాబ్లట్లు లేదా నిద్రట్యాబ్యట్లు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. దీన్ని గుర్తించి ఆమెను కుటుంబ సభ్యులు ఘట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం ఆమె మృతి చెందింది. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ఇదంతా జరగడానికి గల కారణాలని ఒక్కసారి తెలుసుకుందాం..

రాంపల్లిలోని ఆర్ఎల్ నగర్‌కు చెందిన ఈ యువతి కండ్లకోయలోని ప్రైవేట్ కాలేజీలో బీఫార్మసీ చదువుకునేది. ఫిబ్రవరి పదో తారీఖున బుధవారం సాయంత్రం కాలేజీ ముగిసినా ఇంటికా రాలేదు. చీకటి పడడంతో తల్లి ఆ యువతికి ఫోన్ చేసింది. చాలా సేపటి వరకు ఆ యువతి తన ఫోన్ ను లిఫ్ట్ చేయలేదు. కొద్ది సేపటి తర్వాత తల్లికి ఫోన్ చేసి, తనను ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేశాడని తెలిపింది. దీంతో భయపడిపోయిన ఆ తల్లి వెంటనే డయల్ 100కి కాల్ చేసి సమాచారం అందించింది. యువతి సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా అన్నోజిగూడ ఓర్ఆర్ఆర్ సర్వీస్ రోడ్డు సమీపంలో పోలీసులు గాలించారు. ఆమెకు పోలీసులు ఫోన్ చేసి మాట్లాడారు కూడా. ఎక్కడ ఉన్నావన్నది వాట్సప్ లో లొకేషన్ పెట్టమని కూడా అడిగారు. చివరకు రోడ్డు పక్కన ఆ యువతి కనిపించడంతో ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. స్పృహలోకి వచ్చిన తర్వాత తనను ఆటో డ్రైవర్లు గ్యాంగ్ రేప్ చేశారని చెప్పింది.

ఆమె వాంగ్మూలం ఆధారంగా పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. అనంతరం ఫిబ్రవరి 11న ఉదయం నలుగురు ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశారు. ఐతే బాధితురాలు చెప్పిన వివరాలకు, క్షేత్రస్థాయి వాహనాలకు పొంతన లేకపోవడంతో.. చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాలకు మరోసారి క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ రోజు సాయంత్రం ఘట్‌కేసర్, యానాంపేట్, అన్నోజిగూడ్ ప్రాంతాల్లో యువతి తనకు బాగా తెలిసిన యువకుడితో సంచరించినట్లు పోలీసుగు గుర్తించారు. అంతేకాదు ఆ సమయంలో ఆటో డ్రైవర్ల సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆ ప్రాంతాల్లో లేవు. పోలీసులకు సీన్ అర్ధమయింది. యువతిని మరోసారి గట్టిగా ప్రశ్నించడంతో.. అసలు నిజం కక్కేసింది. చీకటి పడినా ఇంటికి ఎందుకు రాలేదని తల్లి పదే పదే ఫోన్ చేయడంతో.. తనను ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేసినట్లు కట్టుకథ అల్లింది. ఆమెను ఎవరూ కిడ్నాప్ చేయలేదనీ, ఎవరూ రేప్ చేయలేదని పోలీసులు వెల్లడించారు. ఈ కేసు విచారణలో తమకు ఆటో యూనియన్లు బాగా సహకరించారని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. పోలీసుల తరపున వారికి క్షమాపణలు చెప్పారు.

అలా ఓ అబద్దాన్ని నిజం చేయాలనుకున్న యువతి కథ నేడు విషాదకరంగా మారింది. మీడియాలో వచ్చిన వార్తలు, సోషల్ మీడియా పోస్ట్లు, ట్రోల్స్ .. వీటితో పాటు అంతవరకు ఆమెతో సన్నిహితంగా మెలిగిన బంధువులు… వీటన్నిద్వారా ఆమె ఒకరకమైన విరక్తి భావాన్ని ఎదర్కొంది. నిజానికి జరిగిందేదో జరిగిపోయింది.. చేసిన తప్పు తెలుసుకుని జీవితాన్ని మరో కొత్త కోణంలో ఆవిష్కరించుకుని ఉండియుంటే కథ వేరేలా ఉండేది. కానీ తీవ్ర మనస్తాపం ఆమెను వేధించి ఊపిరి తీసుకునేలా చేసింది.

నిజానికి ఈ పరిస్థితుల నుంచి కొంత మార్పు కోసమంటూ తన అమ్మమ్మ వాళ్లింట్లో ఆ యువతి పది రోజులుగా ఉంటోంది ఆ యువతి. ఈ పది రోజులుగా స్నేహితులతోనూ, బంధువులతోనూ సరిగా మాట్లాడలేదు. ఒంటరిగానే ఉంటోంది. కుటుంబ సభ్యులు కూడా ఆమెను ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు. అయితే ఈ మంగళవారం రాత్రి ఆ యువతి మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. హుటాహుటిన కుటుంబ సభ్యులు మేడ్చల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుత్రిలో చికిత్స పొందుతూనే ఆ యువతి బుధవారం ఉదయం మరణించింది. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కిడ్నాప్ డ్రామా ఆడిన ఆ యువతి జీవితం ఇలా విషాదాంతంగా ముగిసింది.

ఇక్కడ మనం గ్రహించవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి.. అబద్దం ఆడటం నేరం కాకపోవచ్చు… కానీ ఆ అబద్దం వలన అమాయకుల జీవితాలు సర్వనాశనమైపోయేలా జరిగితే నేరం..సరే.. ఎలాగోలా నిజం కక్కినాక.. చేసుకోవలిసింది ఆత్మ విమర్శ.. ఎంచుకోవలసింది కొత్త జీవితం.. అంతేకానీ జీవితాన్ని చిదిమేసుకోవడం మూర్ఖత్వం.. వేల కోట్ల అవినీతి అక్రమాలకు పాల్పడ్డవారు.. పెద్ద పెద్ద పదవుల్లో.. బెయిల్ తెచ్చుకుని మరీ గడుపుతున్నారు.. ఇది మైండ్ లో ఉండి ఉంటే పోలీసులు ముందు నిజం ఒప్పుకున్నాక ఆ యువతి కోలుకునేది.. కానీ మీడియా, జనం ఆ పరిస్థితులు కల్పించి ఉండక పోవచ్చు..

ఇక ఆ అమ్మాయి నేరం ఒప్పుకున్నాక అవసరమైన కౌన్సిలింగ్ పోలీసులు ఇచ్చారా లేదా అన్నది మరో ప్రశ్న.. లేక ఏదో పెద్ద కేస్ ను చేజ్ చేశాం అని చెప్పి బాకాలూదుకోవడంలోనే మునిగిపోయారా అన్నది సూటి ప్రశ్న. ఏది ఏమైనా కథ విషాదాంతం.. అయితే ఈ కథ కేవలం ఈ యువతిదే కాదు.. చుట్టూ ఉన్న సమాజానిది కూడా.. ఆ సమాజంలో ఉండేటి మనుషుల తప్పక తెలుసుకోవలసిన నిజాలు ఇందులో ఉన్నాయి.. అందుకే పై పై విమర్శలు కాకుండా లో లోతున ఆలోచించి ఇటువంటివాటి పట్ల స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. అది మీడియానైనా.. జనమైనా..

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

8 + nineteen =