కరోనా వేరియెంట్లు ఫైజర్ పాపమే..?! శవాల మీద కాసులు ఏరుకోవాలనుకున్న అమెరికా..!!

0
799

కరోనా మహమ్మారిని ఫార్మా కంపెనీలు ‘క్యాష్ కౌ’ గా భావిస్తున్నాయా..? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. అగ్రరాజ్యంలోని ఫార్మా కంపెనీలు ఈ దారుణాలకు పాల్పడుతున్నాయనే వార్తలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. కోవిడ్ కు వ్యాక్సిన్లను తయారు చేసిన కంపెనీల్లో ఒకటైన ఫైజర్ పై ఓ వార్తా సంస్థ స్టింగ్ ఆపరేషన్ ను నిర్వహించింది. ఇందులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికాకు చెందిన మీడియా, విజిల్ బ్లోయర్ కంపెనీ అయిన ప్రాజెక్ట్ వెరిటాస్ ఈ విషయాలను వెలుగులోకి తెచ్చింది. ఫైజర్ లో రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న జోర్డాన్ థ్రిస్టన్ పై ప్రాజెక్ట్ వెరిటాస్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. ఓ రెస్టారెంట్ లో జోర్డాన్ థ్రిస్టన్ ను కలుసుకున్న జర్నలిస్ట్, జోర్డాన్ థ్రిస్టన్ నుంచి కొన్ని కీలక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. కెమెరాలను పసిగట్టలేని జోర్డాన్ అతడితో మాట్లాడుతూ,.. ఫైజర్ కంపెనీ కోవిడ్ వైరస్‎ను మ్యుటేషన్ చేయడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు. ఈ మ్యుటేషన్లను కోతుల ద్వారా ప్రజల్లోకి వ్యాపింపజేసేలా చేస్తున్నామన్నారు. ఈ విధంగా చేస్తే మ్యుటేషన్లు పెరిగిన కొద్దీ తమ వ్యాక్సిన్లకు గిరాకీ పెరుగుతుందని తెలిపారు. ఇది తమ కంపెనీకి క్యాష్ కౌ గా ఉపకరిస్తుందన్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఫైజర్ కంపెనీపై ప్రజాగ్రహం వ్యక్తం అవుతోంది. ప్రజల ఆరోగ్యంపై డ్రగ్స్ మాఫియా ఆటలాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వీడియో కాస్తా వైరల్ అవడంతో ఫైజర్ కంపెనీ కూడా స్పందించింది. తాము వైరస్ ల మ్యుటేషన్ లకు పాల్పడిన విషయం నిజమే అని ఒప్పుకుంది. అయితే పరిశోధనల్లో భాగంగానే ఈ మ్యుటేషన్ లు చేశామని చెప్పింది. తాము మొట్టమొదటి కోవిడ్ వైరస్ అయిన సార్స్ కోవిడ్ 2 ను మ్యుటేషన్ చేశామని తెలిపింది. ఈ వైరస్ లోని ప్రోటీన్ లను మరింత అభివృద్ది చేసి కొత్త వేరియంట్ లను సృష్టించినట్లు వెల్లడించింది. ఈ మ్యుటేషన్లను తాము పరిశోధనల కోసమే చేశామని చెప్పుకొచ్చింది. కొత్త వేరియంట్లు పుట్టుకురావడానికి ముందే మ్యుటేషన్లను సృష్టిస్తే అది వ్యాక్సిన్ తయారీలో మరింతగా ఉపయోగపడుతుందని తెలిపింది. ఈ మ్యుటేషన్లపై తాము పరిశోధన జరిపి వ్యాక్సిన్ల ప్రభావం మరింతగా పెంచేందుకు చేసే ప్రయోగాల్లో భాగంగానే ఈ మ్యుటేషన్లను తయారు చేశామని చెప్పింది. తాము ఈ ప్రక్రియ చట్టబద్దంగానే కొనసాగించామని ఫైజర్ కంపెనీ తెలిపింది. అయితే ఈ మ్యుటేషన్లను కోతుల ద్వారా వ్యాపింపజేయడంపై డైరెక్టర్ జోర్డాడ్ థ్రిస్టన్ చేసిన వ్యాఖ్యలపై ఫైజర్ కంపెనీ ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. దీంతో పాటు ఈ మ్యుటేషన్లను క్యాష్ కౌ గా భావిస్తున్న విషయంపైనా స్పందించలేదు. దీంతో ఫైజర్ కంపెనీపై ఇప్పటికీ అనుమానాలు కొనసాగుతున్నాయి.

ఈ విషయంపై అమెరికా ప్రభుత్వం కూడా స్పందించింది. అమెరికన్ సెనెటర్ రుబియో ఫైజర్ కంపెనీకి కొన్ని ప్రశ్నలతో ఓ లేఖను పంపారు. ఆరు ప్రశ్నలతో ఉన్న ఈ లేఖలో మ్యుటేషన్లు వ్యాపించకుండా తీసుకున్న జాగ్రత్తలు ఏమిటో వివరించాలని తెలిపారు. మ్యుటేషన్ పై ఫైజర్ కంపెనీ ఇప్పుడు ఏయే పరిశోధనలు చేస్తుందో వెల్లడించాలన్నారు. దీంతో పాటు ఫైజర్ కంపెనీ తయారు చేసిన మ్యుటేషన్లు వ్యాపించకుండా ఏ విధమైన జాగ్రత్తలు పాటించిందో చెప్పాలన్నారు.

ఫైజర్ కంపెనీ ఇప్పుడే కాదు గతంలో కూడా వ్యాక్సిన్ల విషయంలో చాలా వివాదాల్లో చిక్కుకుంది. ఈ కంపెనీ తన వ్యాక్సిన్లను అమ్ముకోవడానికి ఇతర దేశాలను తీవ్రంగా ఒత్తిడి చేస్తూ వచ్చింది. భారత్ ను అయితే తన వ్యాక్సిన్లను కచ్చితంగా ఉపయోగించాల్సిందే అని ఒత్తిడి తెచ్చింది. అప్పటికే భారత్ లో రెండు స్వదేశీ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. కానీ భారత్ లోని ఉదారవాదులు, కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఈ వ్యాక్సిన్ల కొనుగోలు చేయమని ఒత్తిడి తెచ్చింది. రోహినీ సింగ్ లాంటి జర్నలిస్టులు నుంచి కాంగ్రెస్ నాయకుల వరకు భారత్ ఫైజర్ వ్యాక్సిన్లను కొనుగోలు చేయాలని ఒత్తిడి తెచ్చారు. భారత వ్యాక్సిన్లు సురక్షితం కాదనీ,.. అవి కేవలం నీళ్ళతో సమానమనీ విష ప్రచారాన్ని మొదలుపెట్టారు. పరిశోధనలన్నీ పూర్తి చేసుకుని అనుమతి తీసుకున్న తర్వాత కూడా భారత వ్యాక్సిన్లపై అనుమానాలు వ్యక్తం చేశారు మన నాయకులు.

అదేసమయంలో ఫైజర్ వ్యాక్సిన్ ను భారత్ లోకి తీసుకురావాలనీ,.. అది పూర్తిగా సురక్షితం అనీ ఉదారవాదులు ప్రచారం చేశారు. అయితే ఫైజర్ కంపెనీ భారత్ లో కనీస పరిశోధనలు కూడా చేయలేదు. ప్రాథమిక పరిశోధనలు చేయడానికి ఆ కంపెనీ నిరాకరించింది. తమ వ్యాక్సిన్లను కచ్చితంగా అనుమతించాలని అమెరికా ద్వారా ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించింది. ఈ లాబీనే భారత్ లోని ఉదారవాదులకు డబ్బులను వెదజల్లి భారత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించిందనే ఆరోపణలున్నాయి. అయితే నాడు ప్రభుత్వం ఎటువంటి ఒత్తిళ్లకూ లొంగకుండా పని చేయడం వల్ల ఫైజర్ లాంటి విదేశీ వ్యాక్సిన్లను భారత ప్రభుత్వం కొనుగోలు చేయలేదు.

అమెరికా డ్రగ్స్ లాబీలో భాగమైన ఫైజర్ కంపెనీకి ధన దాహార్తి తాజా డైరెక్టర్ వ్యాఖ్యలతో బయటపడింది. దీనిపై అమెరికా ప్రభుత్వం స్పందించినా,.. నిష్పాక్షిక విచారణ ఎంతవరకు కొనసాగుతుందనే దానిపై అనుమానాలే ఉన్నాయి. గతంలోనే భారత్ తో పాటు చిన్న దేశాలన్నిటిపై తన వ్యాక్సిన్లను ఎక్కువ మొత్తంలో అమ్మడానికి ప్రయత్నించింది. భారత్ లోని కంపెనీలు వెయ్యి రూపాయల లోపే వ్యాక్సిన్లను అందిస్తే,.. ఫైజర్ కంపెనీ మాత్రం 30 డాలర్లకు,.. అంటే భారత కరెన్సీలో దాదాపు 2500 లకు అమ్మడానికి ప్రయత్నించింది. ఇక ఆఫ్రికా లాంటి దేశాలకు కూడా అగ్రరాజ్యం తో ఒత్తిడి తెప్పించి ఆయా దేశాల్లోని సంపదను దోచుకునేందుకు ప్రయత్నించింది. అయితే అప్పట్లో వీరి దోపిడీని భారత్ కొంతమేరకు అడ్డుకోగలిగింది. వ్యాక్సిన్ మైత్రి పేరిట పేద దేశాలకు ఉచింతంగానూ, తక్కువ ధరకే భారత్ వ్యాక్సిన్లను అందించింది. అగ్రరాజ్య డ్రగ్స్ మాఫియా దోపిడీని అడ్డుకునేందుకు భారత వ్యాక్సిన్లను అడ్డుపెట్టింది. దీంతో అప్పట్లో ఈ కంపెనీల దోపిడీకి కొంతమేరకు అడ్డుకట్ట పడింది.

ఇక తాజాగా వెలువడిన వీడియోపై ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO విచారణ జరపాలని ప్రపంచ ఆరోగ్య నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. ప్రపంచంలో ప్రజల ప్రాణాలను కాపాడటంలో ఫార్మా సంస్థలు కీలకం. కానీ, ఇటువంటి సంస్థలే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే,.. అది భారీ వినాశనానికి దారితీస్తుంది. ఇది ఒక రకమైన జీవాయుధలాగానే పరిగణించాల్సిన అవసరముందని చెబుతున్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడే సంస్థలపై చర్యలకు ఉపక్రమించకపోతే అది విపత్కర పరిస్థితులకు దారితీస్తుందని భావిస్తున్నారు. అయితే దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏవిధంగా స్పందిస్తుందనేది కూడా అనుమానమే.. WHO అగ్రరాజ్యాలకు వంత పాడుతుందనే విమర్శలు ఉన్నాయి. కోవిడ్ సమయంలో ఇవి బాహాటంగానే కనిపించాయని కొందరు వెల్లడించారు. కోవిడ్ పుట్టుక గురించి పరిశోధనలు చేసే క్రమంలో చైనా ఎన్నో అడ్డంకులను సృష్టించింది. పరిశోధన చేసేందుకు వచ్చిన శాస్త్రవేత్తలకు వూహాన్ లో అనుమతి కూడా నిరాకరించింది. అయినా WHO ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో పాటు అగ్రరాజ్యాల వ్యాక్సిన్లకు త్వరితగతిన అనుమతులిచ్చిన WHO భారత వ్యాక్సిన్లకు అనుమతులు ఇవ్వడంలో మాత్రం చాలాకాలంగా జాప్యం చేస్తూ వచ్చింది. దీనివల్ల భారత్ ఎంతో నష్టపోయింది. ఈ విధంగా అగ్రరాజ్యాల పట్ల పక్షపాతంతో వ్యవహరించే WHO ఫైజర్ కంపెనీపై చర్యలకు తీసుకుంటుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

4 × four =