More

    పెట్రోల్ ధరలపై టీఆర్ఎస్ ఆరోపణలు.. కేంద్రమంత్రి స్ట్రాంగ్ వార్నింగ్

    నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో ఇంధన ధరలు అతి తక్కువగా పెరిగాయని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరి అన్నారు. సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా రాష్ట్రాలతో కేంద్రం సంబంధాలు సాగిస్తోందని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో చమురు ధరలు 30 శాతం మాత్రమే పెరిగాయని, 80 శాతం కాదని తెలిపారు.

    దశాబ్దాలుగా బేసిక్‌ శాలరీలు పెరిగాయని ఆయన తెలిపారు. వివిధ వర్గాల ప్రజలకు ప్రభుత్వం ఉచిత పథకాలను అందిస్తోందని వెల్లడించారు. కరోనా సంక్షోభం నుంచి మనం ఇంకా కోలుకోలేదని… దేశంలో 80 కోట్ల మందికి ఇప్పటికీ ఆహారం అందిస్తున్నామని చెప్పారు.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతూనే ఉందని.. ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్య కారణంగా చమురు ధరలు బ్యారెల్‌కు 19.56 నుంచి 130 డాలర్లకు పెరిగాయన్నారు. కేంద్రం పెట్రోల్-డీజిల్‌పై రూ.32 ఎక్సైజ్ సుంకం వసూలు చేస్తోందని… దీపావళికి ముందు ఎక్సైజ్ సుంకం తగ్గించామని వెల్లడించారు. దీంతో చమురు ధరలు తగ్గాయన్నారు.

    ఇంధన ధరల తగ్గింపు విషయంలో కేంద్రం తన బాధ్యతను స్వీకరించిందని కేంద్రమంత్రి చెప్పారు. రాష్ట్రాలు కూడా తమ బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు 0.2 శాతానికి మించిలేవని… నిబంధనలు ఒప్పుకుంటే ఎక్కువ శాతం ముడి చమురు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. దేశ ప్రయోజనాలు కాపాడే విషయంలో రాజీ పడబోమని హర్‌దీప్‌ సింగ్‌ పూరి స్పష్టం చేశారు.

    బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్ర, రాజస్థాన్‌లు అత్యధికంగా పన్నులు వసూలు చేస్తున్నాయని ఆయ‌న మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తున్నటీఆర్ఎస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం పెట్రోల్‌పై 35.20 శాతం, డీజిల్‌పై 27 శాతం అత్యధికంగా వ్యాట్‌ను వ‌సూలు చేస్తోంద‌ని ఆయ‌న చెప్పారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం 2014 నుండి 2021 వరకు రూ. 56,020 కోట్లను వ్యాట్‌గా వసూలు చేసిందని అన్నారు. 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రం పూర్త‌య్యే నాటికి మరో రూ. 13,315 కోట్లు సమకూరుతుందని అంచనా వేస్తున్నామని అన్నారు. ఇవ‌న్నీ కలిపితే దాదాపు రూ. 70,000 కోట్లకు పైగా అవుతుంద‌ని చెప్పారు. అయితే ఈ డబ్బు ఎక్కడికి పోయింద‌ని హ‌ర్దీప్ సింగ్ పూరీ ప్ర‌శ్నించారు.

    Trending Stories

    Related Stories