పెట్రోల్ లెక్కలేనా..? మరి, ఈ గణాంకాల మాటేంటి..?

0
951

పెట్రోల్.. ఇటీవలికాలంలో ఈ వస్తువు వాహనాల కంటే కూడా రాజకీయాలనే ఎక్కువగా నడిపిస్తోంది. దీనికి నిప్పు అంటిస్తే మండే మంట కంటే.. ధర అనే ఆజ్యం పోస్తే మండే మంటే ఎక్కువగా వుంటోంది. సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు పెట్రోల్ నేడు నిత్యావసర వస్తువు. పెట్రోల్ లేనిది బతుకుబండి ముందుకు సాగని రోజులివి. అలాంటి పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు సామాన్యుడు ఇబ్బంది పడటం సర్వసాధారణం. ధర పెరగడమే కాని.. తగ్గడం అంటూ ఎరుగని వస్తువేదైనా వుందంటే అది పెట్రోల్ మాత్రమే. అప్పుడప్పుడు కొంతమేర తగ్గి ఆశ్చర్యానికి గురిచేసినా.. అది తాత్కాలికమే. నేను పెట్రోల్ పెట్రోల్ అంటున్నా కదా అని పెట్రోల్ మాత్రమే అనుకోకండి.. నా ఉద్దేశంలో డీజిల్ కూడా వుంది. ప్రస్తుతం డీజిల్ పెట్రోల్ తో పోటీపడుతోంది. ఇలా ఇంధన ధరలు పెరగడమనేది చిన్నప్పటి నుంచి చూస్తూనేవున్నాం. ఎవరు అధికారంలో వున్నా ఇంధన ధరలు మాత్రం పెరుగుతూనేవుంటాయి. అది మన్మోహన్ అయినా.. నరేంద్ర మోదీ అయినా. పెట్రోల్ ధరలు పెరగడం.. విపక్షాలు వీధులకెక్కడం మన దేశంలో సర్వసాధారణమైపోయింది. ఇంతకీ పెట్రోల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి..? అసలు పెట్రోల్ ధరలను ప్రభావితం చేసే అంశాలేంటి..? అంటే అనేక కారణాలు చెప్పుకోవచ్చు. క్రూడాయిల్ ధరలు, అంతర్జాతీయ మార్కెట్లు, అగ్రరాజ్యాల పెత్తనపు పోకడలు, పన్నులు.. చమురు ఉత్పత్తి చేసే దేశాలతో వైషమ్యాలు.. ఇలా ఒకటేమిటి, కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు.. చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంత అవుతుంది. మిగతా విషయాలు ఎలావున్నా.. మనం ముఖ్యంగా చర్చించుకోవాల్సింది పన్నులు.

పెట్రోల్, డీజిల్ పై విధించి పన్నుల్లో కేంద్రం వాటా ఎంత..? రాష్ట్రాల వాటా ఎంత..? నిజంగా కేంద్రం పన్నుల వల్లనే పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయా..? ఇందులో రాష్ట్రాల బాధ్యల లేదా..? కేంద్రం విధిస్తున్న టాక్స్ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి..? ఈ అంశాలపై మనం ఈ రోజు చర్చించుకుందాం. కేంద్రంలో ఏ ప్రభుత్వం వున్నా.. ఆడిపోసుకోవడమే పనిగా పెట్టుకున్న తెలుగు మీడియా చెప్పని నిజాల్ని చెప్పుకుందాం.

పెట్రోల్ పై ముఖ్యంగా రెండు రకాల పన్నులుంటాయి. ఒకటి ఎక్సైజ్ డ్యూటీ, ఇది కేంద్ర ప్రభుత్వం విధించే పన్ను. రెండు వ్యాట్.. ఇది రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్ను. ఇవి కాకుండా రవాణా ఖర్చులు, డీలర్ కమిషన్ వగైరా వుంటాయి. ఉదాహరణకు ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 89.29 అనుకుంటే.. అందులో ఆయిల్ కంపెనీలు డీలర్లకు విక్రయించే ధర 32.10 డీలర్ల కమిషన్ 3.68. ఐతే లీటర్ పెట్రోల్ పై కేంద్రం విధించే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ 32.90. కాగా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్‌ 20.61. మొత్తం కలిపితే ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 89.29 రూపాయలకు లభిస్తుందన్నమాట.

అయితే, రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్ కన్నా.. కేంద్రం విధించే ఎక్సైజ్ డ్యూటీయే అధికమనే వాదన వుంది. కానీ, ఇక్కడ మనం ఓ నిజం తెలుసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ డ్యూటీలో 42 శాతం మళ్లీ రాష్ట్ర ప్రభుత్వాలకే చెల్లిస్తుంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసే వ్యాట్ లో కేంద్రానికి పైసా వాటా కూడా వుండదు. అంటే లీటర్ పెట్రోల్ పై ఎక్సైజ్ టాక్స్ రూపంలో కేంద్రం తీసుకుంటున్న 32.90 రూపాయల్లో 13 రూపాయల 80 పైసలు తిరిగి రాష్ట్రానికే చెల్లిస్తుంది. అంటే లీటర్ పెట్రోల్ పై కేంద్రం వినియోగదారుడి నుంచి పన్ను రూపంలో వసూలు చేసేది 19 రూపాయల 10 పైసలు. ఇక రాష్ట్ర పన్ను విషయానికి వస్తే.. వ్యాట్ 20 రూపాయల 61 పైసలకు.. కేంద్రం ఇచ్చే ఎక్సైజ్ వాటా కూడా కలిపితే.. 34 రూపాయల 41 పైసలు అవుతుంది. అంటే ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై కేంద్రం పన్నురూపంలో 19 రూపాయల 10 పైసలు వసూలు చేస్తుంటే.. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 34 రూపాయల 41 పైసలు వసూలు చేస్తుంది. ఇక్కడ ఇంకో విషయం కూడా తెలుసుకోవాలి. పెట్రోల్ పై రాష్ట్ర ప్రభుత్వాలు విధించే వ్యాట్ అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా వుండదు. ఢిల్లీలో 30 శాతం వ్యాట్ విధిస్తే.. అదే తెలంగాణలో 35.20 శాతం వ్యాట్ వసూలు చేస్తున్నారు. అంటే తెలంగాణ ప్రభుత్వం.. పెట్రోల్ పై ఢిల్లీ ప్రభుత్వం కంటే ఎక్కువ వన్ను వసూలు చేస్తోందన్నమాట.

అందుకే, పెట్రోల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలే డిమాండ్ చాలాకాలంగా వినిపిస్తోంది. అదే జరిగితే లీటర్ పెట్రోల్ సుమారు 75 రూపాయలు, లీటర్ డీజిల్ 68 రూపాయలకే వస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఇటీవలే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశోధనా బృందం సూచించింది. దీనికి రాజకీయ సంకల్పం అవసరమని తెలిపింది. కానీ, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోవడం లేదు. ఎందుకుంటే, పెట్రోల్ ద్వారా ఎక్కువగా లాభపడేది రాష్ట్ర ప్రభుత్వాలే కదా. అదీ అసలు సంగతి. కానీ, కేంద్రం పెట్రోల్ ధరలు పెంచేస్తోందని మాత్రం రాష్ట్రాలు గగ్గోలు పెడుతూవుంటాయి.

సరే ఆ విషయాన్ని పక్కనపెడదాం.. పెట్రోల్ పై రాష్ఠ్రాల కన్నా తక్కువ పన్ను వసూలు చేస్తున్నప్పటికీ.. కేంద్రం వసూలు చేస్తున్న పన్ను వాటా కూడా తక్కువేం కాదు. మరి ఆ టాక్స్ సొమ్మంతా ఎక్కడికి వెళ్తోంది..? విపక్షాల వాయిస్ లో మాట్లాడుకుంటే దేశ ప్రజల సొమ్మును ఎవరు కొట్టేస్తున్నారు..? కాంగ్రెస్ హయాంలో వున్నట్టు టూజీ, త్రీజీ, ఫోర్ జీ స్కాములు లేవు. బొగ్గు బకారుసురుల లేరు. నీరా రాడియా టేప్స్ లేవు, నేషనల్ హెరాల్డ్ కుంభకోణాల్లేవు. అల్లుళ్లు భూ దందాలు లేవు. బోఫోర్స్ బాగోతాలు లేవు. కామన్వెల్త్ గేముల్లోనూ.. కాసుల కోసం కక్కుర్తిపడే ఆమాత్యులు లేరు. సైనికుల నివాసాలను కూడా వదలని అవినీతి ఆదర్శవంతులేరు. మరి, ప్రజలు చెమటోడ్చి పన్నుల రూపంలో దేశానికి అందిస్తున్న.. ఆ అమూల్యమైన సంపద ఎక్కడికి వెళ్తోంది..? అంటే, ఆ సంపదంతా సరైన మార్గంలోనే వెళ్తోంది. పన్ను రూపంలో మనం కట్టే ప్రతి పైసాను పకడ్బందీగా, పారదర్శకంగా, ప్రణాళికాబద్ధంగా ఖర్చుచేస్తోంది మోదీ ప్రభుత్వం. ఇక్కడ మోదీ ప్రభుత్వం అని కచ్చితంగా ఎందుకు చెబుతున్నానంటే.. గత ప్రభుత్వాలకు, ప్రస్తుత ప్రభుత్వానికి తేడా స్పష్టం కనిపిస్తోంది గనుక. గణాంకాలరూంలోనే కాదు, ఫలితాల రూపంలో ఆ విషయం సుస్పష్టంగా గోచరిస్తోంది కాబట్టి. ఆ అభివృద్ధి లెక్కల్ని కూడా చూద్దాం.

ముందుగా కరోనా విషయానికి వద్దాం. జనాభా విషయంలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశమైన భారత్.. కరోనా మహమ్మారి పంజాకు కాకావిలకమైపోతుందని అంతా అనుమానించారు. శవాల గుట్లలు లేస్తాయన్నారు. కానీ, ఏం జరిగింది శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోయేలా, ఆర్థికవేత్తలు సైతం అచ్చెరువొందేలా భారత్ కరోనా మహమ్మారిని భారత్ దీటుగా ఎదుర్కొంది. గతంలో మాస్కులు, పీపీఈ కిట్ల గురించి ఎప్పుడూ వినని భారత్.. ఇప్పుడు ప్రపంచ దేశాలకే వ్యాక్సిన్లు అందించే స్థాయిలో వుంది. దీనికంతంటికీ కారణం ఖర్చుకు వెరవకుండా.. మోదీ ప్రభుత్వం తీసుకున్న ప్రణాళికా బద్ధమైన నిర్ణయాలే. మరి ఈ డబ్బంతా ఎక్కడిది మోదీ, అమిత్ షా జేబుల్లోంచి రాలేదు. మన డబ్బే. కేవలం పైసల్లో పెరిగిన పెట్రోల్ పన్ను రూపంలో వున్న డబ్బే .

గతంలో చైనా ఉరిమితేనే మన పాలకులు ఉలికిపాటుకు గురయ్యేవారు. కానీ, ఆ జిత్తులమారికి ఇప్పుడు మోదీ చుక్కలు చూపిస్తున్నారు. ప్రతి విషయంలోనూ చైనాకు చెక్ పెడుతున్నారు. రక్షణ రంగంలో మునుపెన్నడూ లేనివిధంగా భారత్ బలోపేతం కావడమే ఇందుకు కారణం. రక్షణ రంగంలో దిగుమతులే తప్ప.. ఎగుమతుల పేరు వినని మన దేశంలో.. రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నాం. మరి, డబ్బుల్లేకుండానే డిఫెన్స్ ఇంత బలోపేతమైందా..? అవి కూడా మన డబ్బులే. మనం పన్నుల రూపంలో కట్టిన డబ్బులే. రక్షణ రంగం ఓకే.. మరి సామాన్యుడికి ఏం చేస్తున్నారని అడుగుతారేమో.. దానికీ పక్కా లేక్కలున్నాయి. 2014 లో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలతో దేశం ముందడుగు వేస్తోంది. ఆ గణాంకాలు ఓసారి చూద్దాం.

ఎల్పీజీ కనెక్షన్ల విషయమే తీసుకుందాం. 2014 వరకు దేశంలో ఎల్పీజీ కవరేజీ 55 శాతం.. 2020 నాటికి అది 98.80 శాతానికి చేరుకుంది. 2014లో 14 కోట్ల ఇళ్లకు గ్యాస్ కనెక్షన్లు వుంటే.. 2020 నాటికి అది 28.45 కోట్లకు చేరింది. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దగ్గరపడుతున్నా.. కరెంటుకు సైతం నోచుకోని ఎన్నో గ్రామాలు ఎల్ఈడీ వెలుగులను చూస్తున్నాయి. ఆరేళ్లలో మోదీ ప్రభుత్వం 36.69 కోట్ల ఎల్ఈడీ బల్పులను సరఫరా చేసింది. తద్వారా 47.65 బిలియన్ కిలోవాట్ల విద్యుత్ ఆదా అయింది. దీనివల్ల ఏటా 38.59 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ తగ్గుతోంది. అంతేకాదు, దేశవ్యాప్తంగా 1.14 కోట్ల ఎల్ఈడీ స్ట్రీట్ లైట్లను అమర్చడం వల్ల 7.67 బిలియన్ కిలోవాట్ల విద్యుత్ ఆదా కావడమే కాకుండా.. ఏటా 5.29 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ తగ్గింది. 2014 నాటికి దేశంలో వున్న ఎయిమ్స్ కళాశాలల సంఖ్య 7, ప్రస్తుతం 22. ఐఐటీలు 16 నుంచి 23కు పెరిగాయి. నాడు 9 ట్రిపుల్ ఐటీలు వుంటే.. నేడు 25 ట్రిపుల్ ఐటీలు నడుస్తున్నాయి. 2014లో 13 ఐఐఎంలు వుంటే.. 2020 నాటికి వాటి సంఖ్య 20 చేరుకుంది.

మోదీ హయాంలో రవాణా రంగం కూడా పరుగులు పెడుతోంది. 2014 వరకు కేవలం 5 నగరాల్లో మెట్రో రైలు సౌకర్యం వుంటే.. 2020 నాటికి 18 నగరాలకు విస్తరించింది. 248 కి.మీ. మెట్రో మార్గం.. 700 కి.మీలకు చేరుకుంది. ప్రస్తుతం భారత్ ప్రపంచ స్టార్టప్ ల హబ్ గా మారిపోయింది. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో 2015 నాటికి మన స్థానం 81 అయితే.. ప్రస్తుతం 48వ స్థానంలో వున్నాం. వ్యవసాయరంగంలో భారత్ దూసుకుపోతోంది. ప్రస్తుతం చేపల ఉత్పత్తిలో మనం ప్రపంచంలోనే రెండో స్థానంలో వున్నాం. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో గత ఆరేళ్లలో భారత్ ఏకంగా 50 శాతం వృద్ధిని సాధించింది. 2014 నాటికి దేశంలో రోజూ 12 కి.మీ. జాతీయ రహదారు నిర్మిస్తుంటే.. 2020 నాటికి ప్రతి రోజూ 40 కి.మీ. రహదారుల నిర్మాణం జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రైల్వేల అభివృద్ధి జరిగింది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి 610 కి.మీ.ల రైలు మార్గం విద్యుదీకరణ జరిగింది. కానీ, 2020 నాటికి రికార్డు స్థాయిలో 5,276 కి.మీ. మేర విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. ఒక్కటేమిటి మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియా, స్టాండప్ ఇండియా, జన్ ధన్ యోజన, ఆయుష్మాన్ భారత్, స్మార్ట్ సిటీస్ మిషన్, స్వచ్ఛ్ భారత్.. ఇలా చెప్పుకుంటూ పోతే.. వందకుపైగా సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది మోదీ ప్రభుత్వం. మరి, ఈ పథకాలన్నింటికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి..?

దేశాభివృద్ధికి ఖర్చు చేసే ప్రతి పైసా మనదే. ప్రభుత్వాధినేలెవరూ తమ జేబుల్లోంచి ఖర్చు పెట్టరు. అయితే, ఆ డబ్బును పారదర్శకంగా, సరైన మార్గంలో ఉపయోగించడమే ప్రభుత్వాల పని. ఆ పనిని ప్రధాని మోదీ పక్కాగా చేస్తున్నారు. ఆరేడేళ్ల క్రితం వరకు కుంభకోణాలతో, ఆర్థిక లేమితో కునారిల్లిన భారత్.. ప్రపంచ గుర్తించేస్థాయిలో అభివృద్ధి గణాంకాలు చేస్తుందంటే.. అదే స్థాయిలో ఖర్చు కూడా పెరుగుతుంది. అది పెట్రోల్ ధరల రూపంలో కావొచ్చు, మరేదైనా కావొచ్చు. అసలు సగటు వాహనదారుడు ప్రతిరోజూ వాడే పెట్రోల్ ఎంత..? దానిపై మనకు రోజువారీ ఖర్చెంత..? అని ఓసారి బేరీజు వేసుకుంటే.. రూపాయో రెండు రూపాయలో వుంటుంది. అంతకన్నా ఎక్కువుండే ఛాన్సే లేదు. దేశం కోసం ఈమాత్రం భారం మనం భరించలేమా..? పిజ్జాలు, బర్గర్లు, సినిమాల కోసం.. చేతికి ఎముకలేకుండా ఖర్చు చేసే మనం.. కాస్తంతా పెట్రోల్ ధర పెరిగితే ప్రభుత్వాన్ని విమర్శించడం సమంజసమా..?

ఒక్కటి మాత్రం నిజం.. ఎన్ని చర్యలు తీసుకున్నా.. చివరికి పెట్రోల్ ధరల్ని జీఎస్టీలోకి తీసుకొచ్చినా.. అది తాత్కాలిక ఉపశమనే తప్ప.. పూర్తి పరిష్కారం కాదు. ఇది నేను చెబుతున్నమాట కాదు, ఎందరో ఆర్థికవేత్తలు శోధించి చెబుతున్న మాట. పెట్రో పన్నుల భారానానికి కారణం.. రాష్ట్ర ప్రభుత్వాలా..? కేంద్ర ప్రభుత్వమా..? అని నిందిస్తూ కూర్చునే సమయం కాదిది. భవిష్యత్తులో పెట్రోల్ ధరలు మరింత పెరుగుతాయే తప్ప తగ్గవు. కటువుగా వున్నా ఇది అక్షర సత్యం. ఎందుకంటే ప్రపంచంలో ఇంధన వనరులు తగ్గిపోతోన్నాయి. చమురు ధలు మున్ముందు మరింతగా పెరిగిపోవడం ఖాయం. అందుకే, ఇంధన ఉత్పత్తిలో అగ్రగామి దేశాలన్నీ ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నాయి. సౌదీ అరేబియా లాంటి దేశాలు.. ఇప్పటికే టూరిజమ్ అభివృద్ధిపై దృష్టిసారించాయి. పెట్రోల్ ధరల నుంచి విముక్తి పొందాలంటే.. మన మనముందున్న ఒకే ఒక్క మార్గం సంప్రదాయేతర ఇంధన వనరులు. ఇప్పటికైనా సంప్రదాయేతర ఇంధన వనరులపై దృష్టిసారించాలి. పెట్రోల్ ఆధారిత వాహనాలు కాకుండా.. సోలార్, ఎలక్ట్రిక్ వాహనాల వైపుగా మన పయనం సాగాలి. అందుకే, మోదీ సర్కార్ సైతం సంప్రదాయేతర ఇంధన వనరులపై దృష్టిసారిస్తోంది. భవ్యభారత నిర్మాణం కోసం విశేషంగా కృషిచేస్తోంది. ఈ సమయంల సగటు పౌరుడిగా నిజానిజాలు బేరీజు వేసుకుని మోదీ ప్రభుత్వానికి సహకరించాల్సిన బాధ్యత మనందరిపైనా వుంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

2 × 1 =