గ్రేటర్ నోయిడాలో పెంపుడు కుక్క ఓనర్ల ప్రాణాలను కాపాడిన ఉదంతం వెలుగు లోకి వచ్చింది. మనుషులతో కుక్కలు ఎంత కలిసిమెలసి ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని వందల, వేల ఏళ్లుగా మనుషులతో కుక్కలు కలిసి జీవిస్తూ ఉన్నాయి. ఎన్నో సార్లు.. ఎన్నో సంఘటనల్లో మనిషికి కుక్కలు సహాయ పడ్డాయి. ఇక కొన్ని ఆపదలను ముందే పసిగట్టే కుక్కలు.. యజమానులు కాపాడిన ఘటనలు కూడా ఎన్నో చోటు చేసుకున్నాయి.
తాజాగా అలాంటి ఘటనే గ్రేటర్ నోయిడాలో చోటు చేసుకుంది. ఇండియన్ బ్రీడ్ అయిన ఓ కుక్క యజమానిని పెద్ద ప్రమాదం నుండి బయటపడేసింది. ఫైర్ యాక్సిడెంట్ నుండి ఓనర్ ను రక్షించింది ఓ కుక్క. ఈ ఘటన ఆదివారం సాయంత్రం ఒమేగా 1 లోని గ్రీన్ వుడ్స్ సొసైటీ లోని డూప్లెక్స్ విల్లాలో చోటు చేసుకుంది. మూడు సంవత్సరాల ‘బ్రేవో’ అనే కుక్కను మార్చి నెలలో 38 ఏళ్ల శేష్ సారంగధర్ దత్తత తీసుకున్నాడు. అతడు ఓ ఐటీ కంపెనీలో పని చేస్తూ ఉన్నాడు. ఆయన భార్య గర్భవతి. ఆమెతో కలిసి విల్లాలో ఉంటున్నాడు.

అతడు బెడ్ రూమ్ లో ఉండగా బ్రేవో అరవడం మొదలు పెట్టడమే కాకుండా.. బెడ్ రూమ్ డోర్ దగ్గరకి వచ్చి నిలబడింది. శేష్ సారంగధర్ బెడ్ రూమ్ తలుపును తెరచి చూడగానే ఇంట్లో దట్టమైన పొగ నిండి ఉండడాన్ని గమనించాడు. కిందకు వచ్చి చూడగా.. వంటింట్లో అగ్ని ప్రమాదం జరిగిందని గుర్తించాడు. అప్పటికే వంటింట్లోని ఉడ్ వర్క్ మొత్తం కాలిపోయి ఉంది. వెంటనే తేరుకుని బకెట్లతో నీటిని కొట్టినట్లు శేష్ మీడియాకు తెలిపాడు. బ్రేవో లేకపోయి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని తెలిపాడు. బ్రేవో అరచి ఉండకుంటే తాము బెడ్ రూమ్ లో నిద్రపోతూ ఉండే వాళ్లమని.. అలా జరిగి ఉండి ఉంటే తమ ప్రాణాలకే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని శేష్ వెల్లడించాడు. పొగ కనిపించడంతో అప్రమత్తమై ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. సారంగధర్ భార్య పాలు కాచేందుకు గ్యాస్ స్టవ్ వెలిగించింది. సిమ్ లో పెట్టి మర్చిపోయింది. దీంతో స్టవ్ మొత్తం మండి కిచెన్ లోని వస్తువులకు మంట అంటుకుంది. కుక్క పసిగట్టకపోయి ఉంటే ఇంట్లో వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లేది. కుక్క లేకపోతే తాము ప్రాణాలు కోల్పోయేవారని శేష్ తెలిపాడు.

సెక్టర్ 119 లో ఉంటున్నప్పుడు వీధి కుక్కలకు తినడానికి ఏవైనా పెడుతూ ఉండే వాన్నని.. ఒమేగా 1 లోకి వచ్చాక ఏదైనా కుక్కను పెంచుకోవాలని అనుకున్నానని.. మార్చి నెలలో బ్రేవోను దత్తత తీసుకున్నానని వెల్లడించాడు.