More

    పవన్ పై పేర్ని నాని విమర్శలు

    బాపట్ల జిల్లా పర్చూరులో నిర్వహించిన భారీ సభలో జనసేనాని పవన్ కల్యాణ్ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ నేతలు ఏం మాట్లాడినా దసరా వరకు భరిస్తామని, ఆ తర్వాత వారి అంతు చూస్తామని హెచ్చరించారు. భారీ పొత్తుల అంశాన్ని ప్రస్తావించారు. ఇది పొత్తుల గురించి మాట్లాడే సమయం కాదని.. తమకు ప్రజలతోనే పొత్తు అని… ఇంకెవరితోనూ లేదని స్పష్టం చేశారు. తాను ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనాలు కోరుకోవడంలేదని, ప్రజలు ప్రభుత్వాలను నిలదీసేలా తయారుచేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ముఖ్యమంత్రి పదవి దక్కకపోతే రాజకీయాల నుంచి నిష్క్రమించేందుకు పార్టీ ఏర్పాటు చేయలేదని వ్యాఖ్యానించారు.రాష్ట్రంలో చాలాసార్లు ఇతరులకు అవకాశం ఇచ్చారని, ఈసారి జనసేనకు అవకాశం ఇవ్వండి అని విజ్ఞప్తి చేశారు. మన ఎంపీలు ఢిల్లీలో కూర్చుని వ్యాపారాలు చేసుకుంటుంటారని, అలాంటి వాళ్లు కాకుండా, బాధ్యత గల కొత్తతరం వ్యక్తులను ఎన్నుకుంటేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

    ఇక పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత పేర్ని నాని మండిపడ్డారు. పవన్ గెలిపించిన టీడీపీ ప్రభుత్వం కౌలు రైతులను మోసం చేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. అప్పుడు కౌలు రైతుల గురించి పవన్ ఎందుకు ప్రశ్నించలేదని.. అధికారపక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వైసీపీని ప్రశ్నించడం ఒక్కటే పవన్ కు తెలుసని విమర్శించారు. పవన్ భాగస్వామిగా ఉన్న కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులకు ఏం ప్రయోజనం చేస్తోందని పేర్ని నాని ప్రశ్నించారు. ఒకప్పుడు పాచిపోయిన లడ్డూ అంటూ విమర్శించిన బీజేపీతో మీరు ఎందుకు చేతులు కలిపారని ప్రశ్నించారు. పవన్ కు చిత్తశుద్ధి ఉంటే కౌలు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వంతో చట్టం చేయించాలని అన్నారు. చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ అని… దత్తపుత్రుడు కాకపోతే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఒంటరిగా పోటీ చేసే దమ్ము పవన్ కు ఉందా? అని ప్రశ్నించారు.

    Trending Stories

    Related Stories