More

  విశ్వాన్ని ఏలుతున్న భారత సంతతి బిడ్డలు..! బ్రిటన్ ప్రధానిగా అడుగుదూరంలో రిషి సునాక్..!!

  భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం.. అయితే చాలా మంది భారతీయులు ఇతర దేశాలకు వలస వెళ్లారు. వెళ్లిన ప్రతి చోట తమ సత్తాతో అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నత స్థానాలను అధిరోహిస్తున్నారు. ఆర్థికంగానే కాదు.. అధికార పరంగానూ భారత సంతతికి చెందిన వ్యక్తులు ప్రపంచ దేశాలను ఏలుతున్నారు.

  ఇప్పటి వరకు ఎన్నారైలు అంటే బాగా సంపాదించుకుంటారనే నానుడి కాస్త ఎన్నారైలు అంటే ఇతర దేశాలను పాలించడానికి ఏ మాత్రం తీసిపోరనే భావన ఏర్పడింది. కేవలం డబ్బు సంపాదనే కాదు.. తాము వెళ్లిన ప్రాంతాల్లో రాజకీయపరంగానూ దూసుకుపోతున్నారు. భారత సంతతికి చెందిన అనేక మంది చాలా దేశాల్లో కీలక పదవుల్లో కొనసాగుతున్నారు. వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది కమలా హ్యారిస్‌. ఈమె అమెరికా ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ పూర్వీకులు తమిళనాడులోని తిరువారూర్‌ జిల్లా తులసేంద్రిపురానికి చెందిన వారు. కమలా హ్యారిస్‌ తల్లి శ్యామలా గోపాలన్‌ తమిళనాడుకు చెందిన వ్యక్తి.

  అటు దక్షిణ అమెరికాలోని సురినామ్ దేశాధ్యక్షుడిగా చంద్రిక ప్రసాద్ సంతోఖి కొనసాగుతున్నారు. 1959లో జన్మించిన ఆయన కుటుంబం కూడా భారత్ మూలాలున్నదే. ఇక పోర్చుగల్‌ ప్రధానమంత్రిగా ఉన్న ఆంటోనియా కోస్టా మన గోవా మూలాలున్న వ్యక్తి. ఆంటోనియో కోస్టా తండ్రి ఆర్నాల్డో డా కోస్టా మన గోవా కుంటుంబానికి చెందిన వ్యక్తి. ఇక గయానా అధ్యక్షుడు మహమ్మద్‌ ఇర్ఫాన్‌ కూడా భారతీయ సంతతి వ్యక్తే.. ఇండో-గయానా ముస్లిం కుటుంబంలో జన్మించిన మహమ్మద్‌ ఇర్ఫాన్‌.. రెండేళ్ల క్రితం గయానా అధ్యక్షుడు అయ్యారు.

  మరో కీలక వ్యక్తి ప్రవింద్‌ జుగ్నాథ్‌.. ఈయన మారిషస్‌ ప్రధానమంత్రి.. ప్రవింద్‌ జుగ్నాథ్‌ మారిషస్‌ ప్రధానిగా 2017లో బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రవింద్‌ జుగ్నాథ్‌ కూడా భారత మూలాలున్న హిందూ కుటుంబానికి చెందిన వారే. మారిషస్‌ అధ్యక్షుడు పృథ్వీరాజ్‌సింగ్‌ రూపున్‌ కూడా భారత ఆర్య సమాజ్‌ హిందూ కుటుంబానికి చెందిన వ్యక్తే. ఆ దేశంలో పలుమార్లు ఎంపీ అయిన ఆయన.. 2019లో మారిషస్‌ అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. కేవలం ఈ 5 దేశాలే కాకుండా బ్రినిడాడ్ అండ్ టొబాగో, పొర్చుగల్, మలేషియా, ఫిజీ, ఐర్లాండ్ వంటి దేశాల్లో భారత సంతతికి చెందిన వ్యక్తులు కీలక పదవుల్లో కొనసాగుతున్నారు. తాజాగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని రేసులో అందరికంటే ముందున్నారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి అల్లుడు ఈయన.

  తాజాగా జరిగిన కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల బ్యాలెట్‌ పోల్‌లో వరుసగా నాలుగు రౌండ్లలోనూ రిషి సునాక్ ముందంజలో నిలిచారు. దీంతో రేసులో ముగ్గురు అభ్యర్థులు మాత్రమే మిగిలి ఉన్నారు. నాలుగో రౌండ్లో 118 ఓట్లతో రిషి సునాక్ అగ్రస్థానంలో నిలవగా.. బిజినెస్ మినిస్టర్ పెన్నీ మోర్డాంట్‌కు 92, విదేశాంగ శాఖ మంత్రి లిజ్ ట్రస్‌కు 86 ఓట్లు వచ్చాయి. తదుపరి రౌండ్‌లో సునక్, పెన్నీ మోర్డాంట్, లిజ్ ట్రస్‌ల మధ్య పోటీ జరుగనుంది. ఆ తర్వాత ఇద్దరు అభ్యర్థులు మాత్రమే మిగలనున్నారు. దీని తర్వాత టోరీ పార్టీ సభ్యత్వం ఉన్న వారు ఓటు వేయనున్నారు. సుమారు 1,60,000 మంది అర్హులైన కన్సర్వేటివ్‌ పార్టీ సభ్యులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ప్రధానమంత్రిని ఎన్నుకోనున్నారు. సెప్టెంబర్‌ 5న ప్రధానిని ప్రకటించనున్నారు. అయితే రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని అయితే.. అది ఎన్నారైల చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం అవుతుంది. రిషి సునాక్‌ బ్రిటన్ ప్రధానమంత్రిగా ఎన్నికైతే.. భారత మూలాలున్న వ్యక్తులు అధికారం చేపట్టిన ఆరో దేశం బ్రిటన్‌ అవుతుంది.

  Trending Stories

  Related Stories