‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ట్విట్టర్ వినియోగదారుల పోస్ట్‌ల ప్రకారం, సినిమాలో ఇస్లామిక్ టెర్రరిస్ట్ పాత్రలో నటించిన ‘చిన్మయ్ మాండ్లేకర్’ మీద డెహ్రాడూన్‌లో ఒక సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఆ సమయంలో భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నాడు. అయితే చిన్మయ్ డైలాగ్స్ ను అక్కడి ప్రజలు వ్యతిరేకించారు. అక్కడి జనం షూటింగ్‌ను నిలిపివేశారు. ఇది యాంటి-ఇండియా సినిమా కాదని ప్రజలకు హామీ ఇచ్చిన తర్వాతే షూటింగ్‌ని పునరుద్ధరించారట..! భారత్ కు వ్యతిరేకంగా తీస్తున్న సినిమా ఇదని భావించిన ప్రజలు షూటింగ్ ను అడ్డుకున్నారు.
దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి తన ట్విట్టర్ హ్యాండిల్ ఈ సంఘటనకు సంబంధించిన చిత్రాన్ని పంచుకోవడం ద్వారా ఈ వార్త నిజమని ధృవీకరించారుఈ చిత్రంలో, “ఫరూక్ అహ్మద్ బిట్టా భారత వ్యతిరేక నినాదాలు చేస్తున్న కశ్మీర్ ఫైల్స్ ప్రారంభ సన్నివేశం షూటింగ్ డెహ్రాడూన్‌లో జరిగింది. బిట్టా పాత్రను చిన్మయ్ మాండ్లేకర్ చేసారు. అతని దగ్గర నిలబడిన టెర్రరిస్టుల పాత్రలను డెహ్రాడూన్ స్థానిక ప్రజలు చేశారు. స్థానికులు షూటింగ్ సన్నివేశంలో ఆనందంగా పాల్గొన్నారు, కాని వారు స్క్రిప్ట్‌లో భారతీయ వ్యతిరేక నినాదాలు విన్నప్పుడు వెంటనే చిత్ర నిర్మాతలను షూటింగ్‌ను ఆపమని ఒత్తిడి తీసుకుని వచ్చారు. ఈ సినిమా భారతీయులకు వ్యతిరేకం కాదని చిత్ర నిర్మాతలు స్థానిక ప్రజలకు వివరించాల్సి వచ్చింది. చిన్మయ్ మాండ్లేకర్ తన మునుపటి మరాఠీ సినిమాలను స్థానిక ప్రజలకు చూపించాడు. అందులో తాను ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రను పోషించానని ఫోటోలు, వీడియోలను చూపించడంతో ప్రజలు శాంతించారు. చిన్మయ్ మాండ్లేకర్ షూటింగ్ సన్నివేశం ముగిసిన తర్వాత ‘భారత్ మాతా కీ జై’ అని నినాదాలు చేయాలనే షరతు విధించి షూటింగ్ చేసుకోమని స్థానికులు తెలిపారు.
చిన్మయ్ సుప్రసిద్ధ మరాఠీ నటుడు, స్క్రీన్ రైటర్, దర్శకుడు. అతను NSD గ్రాడ్యుయేట్, అనేక చలనచిత్రాలు, నాటకాలలో నటించాడు. అతను ఫర్జాంద్, ఫత్తే శిక్ష్, పవన్ఖింద్ చిత్రాలలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రను పోషించినందుకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ మూడు చిత్రాలూ ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ఆధారంగా దర్శకుడు దిగ్‌పాల్ రూపొందించారు.
వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ ఉత్తరప్రదేశ్, గోవా, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, కర్ణాటక, అస్సాం, బీహార్, ఉత్తరాఖండ్ వంటి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను రహితంగా ప్రకటించాయి. ఈ చిత్రం 1990లలో ఇస్లామిక్ టెర్రరిస్టులచే కశ్మీరీ హిందువులపై జరిగిన మారణహోమం, వారి వలసల ఆధారంగా తీశారు. ఈ చిత్రం 11 మార్చి 2022 న విడుదలైంది . అది బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది.
