కొందరు వ్యక్తుల వాహనాలపై ఉన్న ఛలాన్లు చూసి మనమందరం షాక్ అవుతూ ఉంటాం..! అయితే కొందరు ప్రభుత్వ అధికారుల వాహనాలపై కూడా భారీగా ఫైన్స్ ఉండడం చూసి ప్రజలు షాక్ అవుతూ ఉన్నారు. అది కూడా ఒక జిల్లా కలెక్టర్ వాహనం మీద వేలల్లో ఛలానాలు ఉన్నాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ఆయన వాహనం మీద ఏకంగా 28 చలానాలు ఉన్నాయి.
కామారెడ్డి జిల్లా కలెక్టర్ వాహనం (టీఎస్16 ఈఈ3366) మీద భారీ మొత్తం ఈ-ఛలానాలు ఉన్నాయి. 2016 నుంచి 2021 ఆగస్టు 20 వరకు 28 ఛలానాలు వేశారు. మొత్తం రూ. 27,580 జరిమానా పడింది. ఇందులో 24 ఫైన్స్ లో కేవలం ఓవర్ స్పీడ్ గా వాహనం నడపడం వల్లేనని చెబుతున్నారు. అంతకు ముందు జనగామ జిల్లా కలెక్టర్ మీద కూడా ఇలాంటి కేసే ఉంది. జనగామ కలెక్టర్ ప్రభుత్వ వాహనానికి రెండేళ్లలో (2021, ఆగస్టు 30వ తేదీ వరకు) ఏకంగా 23 సార్లు జరిమానాలు పడ్డాయి. వీటిలో 22సార్లు ఓవర్ స్పీడ్ కాగా, ఒకసారి ట్రాఫిక్ సిగ్నల్ పడిన సమయంలో జీబ్రా క్రాసింగ్ దాటారు. ఈ ఛలానాల మొత్తం రూ.22,100 కాగా, యూజర్ ఛార్జీలు రూ.805 కలపుకుని మొత్తం 22,905 రూపాయలు ఉంది. ఈ ఛలానాల్లో సగానికి పైగా హైదరాబాద్ రింగ్ రోడ్డు మీద ఓవర్ స్పీడ్ తో వెళ్లినందుకు విధించారు. వాహనం మీద ఒక్క ఛలానా పెండింగ్ లో ఉన్నా వాహనాన్ని సీజ్ చేస్తామంటూ ప్రకటించిన పోలీసులు ఇలా పదుల సంఖ్యలో పెండింగ్ ఛలానాలు ఉన్న అధికారుల వాహనాలపై ఎటువంటి చర్యలు తీసుకోరా..? అనే ప్రశ్నలు వేస్తూ ఉన్నారు.
ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడంతో ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది. ఎంతో మంది ప్రాణాలకు రిస్క్ ఉన్నట్లే.. అందుకనే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించే వారిపై ట్రాఫిక్ పోలీసులు ఈ-ఛలానాలతో హడలెత్తిస్తున్నారు.
