పెడనలో చేనేత కుటుంబం ఆత్మహత్య

0
997

కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెడ‌న‌లో దంప‌తుల‌తో పాటు కుమారుడు కలిసి ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. దాంతో పెడ‌న‌లో విషాధ‌ఛాయ‌లు అల‌ముకున్నాయి. మృతులు కాశం పద్మనాభం, భార్య నాగ లీలావతి, కొడుకు రాజా నాగేంద్రంగా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధ‌లు తాళ‌లేక వారు ఆత్మ‌హ‌త్య‌కి పాల్ప‌డ్డార‌ని భావిస్తూ ఉన్నారు.

అందిన సమాచారం ప్రకారం అధిక వడ్డీల ఒత్తిడి తట్టుకోలేకనే చేనేత కుటుంబంలోని ఈ ముగ్గురు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తోంది. పెడన 17 వ వార్డులో కాశం పద్మనాభం, భార్య నాగ లీలావతి, కొడుకు రాజా నాగేంద్రంలు చేనేత పని చేస్తుంటారు. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి అధిక వడ్డీకి చేనేత కుటుంబాన్ని ఒప్పించాడు. నోట్లు, అగ్రిమెంట్‌ నోటరీ చేయించాడు. వడ్డీ చెల్లించాలంటూ ఒత్తిడి పెంచి కుటుంబాన్ని బెదిరించాడు. మనస్తాపం చెందిన పద్మనాభం కుటుంబం ఆత్మహత్యకు సిద్ధపడింది. ముగ్గురు ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పెడన ఎస్‌ఐ టి.మురళి ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కుటుంబానికి చెందిన బంధువులను ఆరా తీస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బందరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనునట్లు సిఐ వీరయ్య గౌడ్‌ స్పష్టం చేశారు.

టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పెడన ఆత్మహత్య ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. పెడన చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు టీడీపీ హయాంలో చేనేతలకు ప్రోత్సాహకాలు, రాయితీలు, రుణాలు, వడ్డీ రాయితీలు ఇచ్చామని.. సొంత మగ్గం లేకున్నా రిబేటు సహా ఏడాదికి రూ.లక్ష సహాయం అందించామన్నారు. నూలు, రంగులు ఇతర వస్తువులపై సబ్సిడీలు అందేవని అన్నారు. నేడు పథకాలు లేవు, సబ్సిడీలు లేవు, మార్కెటింగ్ లేదని, చివరికి స్కూల్ యూనిఫాం కూడా పవర్ లూంకు కట్టబెట్టారని అన్నారు. అతి ప్రచారం, అసమర్ధ పాలనతోనే చేనేత కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయని తెలిపారు.