Telugu States

తీరని శోకం.. పెళ్లైన గంటల వ్యవధిలోనే వరుడు మృతి

పెళ్లైన గంటల వ్యవధిలోనే వరుడిని మృత్యువు వెంటాడింది. శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల మండలం అరిణాం అక్కివలస పెట్రోల్ బంక్ దగ్గర జరిగిన ప్రమాదంలో వరుడు పవన్ కుమార్ (20) అక్కడికక్కడే మృతి చెందాడు.. శ్రీకాకుళం జిల్లా ఎల్ఎన్‏పేట మండలం పెద్దకొల్లి వసన ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన పవన్ కుమార్ తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు.. స్థానిక యువతితో పరిచయం పెరిగింది. ఆరు నెలల కిందట పెద్దలను ఎదురించి ఆమెను తన గ్రామానికి తీసుకువచ్చాడు. గత రెండు నెలలుగా వీరిద్దరి కుటుంబాల మధ్య రాజీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక వారు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. రెండు కుటుంబాలు కలిసి శుక్రవారం (జూన్ 17న) వీరి వివాహాన్ని సింహాచలంలో జరిపించారు. పెళ్లి అనంతరం వధువుతోపాటు మిగతా కుటుంబసభ్యులు బస్సులో సొంత గ్రామానికి బయలుదేరారు. వరుడు పవన్ కుమార్ తన మేనమామ బలగ సోమేశ్వర రావుతో కలిసి బైక్ పై స్వగ్రామానికి వస్తుండగా ఎచ్చెర్ల మండలం అరిణాం అక్కివలస సమీపంలోని పెట్రోల్ బంకు దగ్గర వీరి బండిని వెనక నుంచి వస్తున్న కంటైనర్ ఢీకొట్టింది. దీంతో పవన్ అక్కడికక్కడే మృతి చెందగా, సోమేశ్వర రావుకు తీవ్ర గాయాలయ్యాయి. మరో లారీ డ్రైవర్ 108 అంబులెన్స్ కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. గాయపడిన వ్యక్తిని రిమ్స్ కు తరలించారు. పవన్ కుమార్ ఇక లేడన్న విషయం ఆ రెండు కుటుంబాల్లోని కాకుండా.. వారి గ్రామంలో కూడా తీవ్ర విషాదాన్ని నింపింది.

Related Articles

Back to top button