త్వరలోనే జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీలో బస్సు యాత్ర చేపట్టనున్నారు. వాస్తవానికి పవన్ దసరా నుంచి బస్సు యాత్ర షురూ చేయాలని భావించినా, అది కార్యరూపం దాల్చలేదు. కాగా, పవన్ బస్సుయాత్రకు ఉపయోగించే భారీ వాహనం సిద్ధమైంది.
2024 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీవ్యాప్త పర్యటనకు సిద్ధమయ్యారు. ఇందులో సమాయత్తంగా జనసేనాని పవన్ కల్యాణ్ ప్రత్యేక బస్సును సిద్ధం చేయించుకున్నారు. ఈ బస్సుకు ‘వారాహి’ అని పేరు పెట్టారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా బస్సు ఫొటోను షేర్ చేశారు. ఎన్నికల యుద్ధానికి ‘వారాహి’ బస్సు సిద్ధమంటూ వీడియో, ఫొటోలను పంచుకున్నారు. కాగా ఈ బస్సు.. మిలిటరీ వాహనాన్ని పోలివుండడం ఆసక్తిని కలిగిస్తోంది. రంగు కూడా ఆర్మీ వాహన కలర్‌కు దగ్గరిగా ఉంది. ఈ వాహనానికి పవన్ ఇంకా రిజిస్ట్రేషన్ చేయించకపోవడంతో వాహనంపై ఎలాంటి నంబర్ కనిపించలేదు. దీంతో ఆర్టీఏ ఈ వాహనానికి అనుమతి ఇస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఈ బస్సులో హై సెక్యూరిటీ సిస్టమ్‌తో పాటు జీపీఎస్ ట్రాకింగ్, 360 డిగ్రీల్లో రికార్డ్ చేయగల సీసీటీవీ కెమెరాలు, అత్యాధునిక సౌండ్ సిస్టమ్, రాత్రివేళల్లో సభల కోసం లైటింగ్ సిస్టమ్‌ను పొందుపరిచారు. ఈ వాహనం ట్రయల్ రన్‌ను పవన కల్యాణ్ స్వయంగా పర్యవేక్షించారు.
ఆర్మీ వాహన కలర్ వాహనానికి వారాహి అమ్మవారి పేరుపెట్టారు. అన్ని దిక్కులను కాచే అమ్మవారిగా పురాణాలు చెబుతాయి. దుర్గా దేవి సప్త మాతృకల్లో వారాహి అమ్మవారు ఒకరు. ఆ సప్త మాతృకలు రక్త బీజుడు అనే రాక్షసుడిని సంహరించారు. అందుకే తన ప్రచార వాహనానికి పవన్ కల్యాణ్ వారాహి అని పేరు పెట్టారు.