తమిళనాడు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ట్వీట్ ప్రస్తావన..!

పవన్ కళ్యాణ్.. అటు సినిమాలు చేసుకుంటూనే రాజకీయాలలో కూడా యాక్టివ్ గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ జనసేనను ప్రజలకు మరింత చేరువ చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రస్తుతం జనసేన ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు సాగుతూ ఉంది. రాజకీయాలలో పవన్ కళ్యాణ్ ది ప్రత్యేకమైన పంథా అని ఇప్పటికే పలువురు నాయకులు చెప్పారు. తాజాగా జనసేనాని ట్వీట్ ను తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తావించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది.
పవన్ తెలుగులో చేసిన ప్రకటనను తమిళనాడు అసెంబ్లీలో అధికార పక్ష సభ్యులు తమిళంలోకి అనువదించుకుని ప్రత్యేకంగా ప్రస్తావించారు. పవన్ వ్యాఖ్యలను తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ శాసనసభ్యులందరికీ చదివి వినిపించారు. ఆ వ్యాఖ్యల అర్థాన్ని తమిళంలో వివరించారు. చిరంజీవిని తెలుగు నాట సూపర్ స్టార్ అని, పవన్ ను పవర్ స్టార్ అని పిలుస్తారని కూడా మంత్రి సుబ్రమణియన్ అసెంబ్లీకి తెలిపారు.
పవన్ కళ్యాణ్ ఇటీవల స్టాలిన్ తీరును ప్రశంసిస్తూ “ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి రావటానికి రాజకీయం చెయ్యాలి కానీ.. ప్రభుత్వంలోకి వచ్చాక రాజకీయం చెయ్యకూడదు. దీన్ని మీరు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు. మీ పరిపాలన, మీ ప్రభుత్వ పని తీరు మీ ఒక్క రాష్ట్రానికే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాలకు, అన్ని రాజకీయ పార్టీలకు మార్గదర్శకం… స్ఫూర్తిదాయకం. మీకు మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియచేస్తున్నాను. మీకు నా శుభాకాంక్షలు.” అని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే . ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తమిళనాడు సీఎం స్టాలిన్ ను నేరుగా కలిసి అభినందించడం జరిగింది.