More

    కోన‌సీమ అల్లర్లపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రెస్ మీట్

    ఘ‌ర్ష‌ణ‌లు జ‌ర‌గాల‌న్న ఉద్దేశ్యంతోనే కోన సీమ జిల్లా పేరు మార్పుపై అభ్యంత‌రాల‌కు ప్ర‌భుత్వం గ‌డువు ఇచ్చిన‌ట్లుగా క‌నిపిస్తోంద‌ని.. కోన‌సీమ జిల్లాలో చోటుచేసుకున్న అల్ల‌ర్ల‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించారు. అన్ని జిల్లాలకు ఒక విధానం.. ఈ ఒక్క జిల్లాకు ఇంకోలా నామకరణం జరిగిందని పవన్ కల్యాణ్ అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు స‌మ‌యంలోనే కోన‌సీమ జిల్లాకు అంబేద్క‌ర్ పేరు పెడితే స‌రిపోయేదని.. అస‌లు కోన‌సీమ జిల్లాకు అంబేద్క‌ర్ పేరు పెట్టే విష‌యంలో వైసీపీ ప్ర‌భుత్వం ఎందుకు జాప్యం చేసిందో అర్థం కావ‌డం లేద‌ని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత కడప జిల్లాకు పేరు పెట్టడం ద్వారా ఈ సంస్కృతి తీసుకుని వచ్చారన్నారు. జిల్లాల‌కు వ్య‌క్తుల పేర్లు పెట్టిన‌ప్పుడు ఇదివ‌ర‌కు ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న జారీ చేసేద‌ని.. కోన‌సీమ జిల్లా పేరు మార్పు సంద‌ర్భంగా వైసీపీ ప్ర‌భుత్వం అందుకు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించింద‌ని విమర్శించారు. ఈ పేర్ల మీద గతంలో కూడా వివాదాలు వచ్చాయని అన్నారు.

    జిల్లా పేరు మార్పుపై అభ్యంత‌రాల‌కు 30 రోజుల గ‌డువు విధించిన ప్ర‌భుత్వం…క‌లెక్ట‌రేట్‌కు వ‌చ్చి అభ్యంత‌రాలు తెల‌పాల‌ని కోరింద‌ని ప‌వ‌న్ చెప్పారు. అలా వ‌చ్చేవారు స‌మూహంగా రాకూడ‌ద‌ని, వ్య‌క్తులుగా మాత్రమే రావాలని ప్ర‌క‌ట‌న చేయడం ప్ర‌భుత్వం కోనసీమ జిల్లా ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్ట‌డ‌మేన‌ని అన్నారు. ఈ ప్ర‌క‌ట‌న ముమ్మాటికి వ్య‌క్తుల‌ను టార్గెట్ చేయ‌డ‌మేన‌ని అన్నారు. కృష్ణా జిల్లా విషయంలో కూడా విభజనకు సంబంధించి వ్యతిరేకత ఉందని అన్నారు. పేర్లు పెట్టే విషయంలో ప్రభుత్వం సున్నితంగా వ్యవహరించాలని అన్నారు. గొడవలు పెట్టాలని వైసీపీ ప్రభుత్వం కోరుకుంటోందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం తాలూకు దురుద్దేశం కనిపిస్తోందని అన్నారు పవన్. ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చ‌డంలో సీఎం జ‌గ‌న్ నేర్ప‌రి అని.. వైసీపీ ఎమ్మెల్సీ అనంత‌బాబు కేసులో ఇరుక్కుంటే… ప్ర‌జ‌ల దృష్టిని దానిపై నుంచి మ‌ర‌ల్చేందుకే కోన‌సీమ జిల్లా అల్ల‌ర్ల‌కు ప్లాన్ చేశార‌ని ప‌వ‌న్ ఆరోపించారు. మంత్రి విశ్వరూప్ ఇంటిపై దాడి జ‌రుగుతుంటే ప్రేక్ష‌క‌పాత్ర పోషించిన పోలీసులు…దాడి జ‌రుగుతున్నా అడ్డుకునేందుకు య‌త్నించ‌లేద‌న్నారు.

    Trending Stories

    Related Stories