విశాఖలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో విశాఖ పోలీసులు పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన కీలక నేతలకు సీఆర్పీసీ 41ఏ ప్రకారం నోటీసులు జారీ చేశారు. ఆదివారం సాయంత్రం 4 గంటల్లోగా విశాఖను వీడాలని సదరు నోటీసుల్లో పవన్ తో పాటు జనసేన నేతలకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నోటీసులను తీసుకునే విషయంలో జనసేన నేతలు, విశాఖ పోలీసులకు మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లిన పోలీసులు ఆయనతో చర్చలు జరిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే నోటీసులు జారీ చేస్తున్నామని ఆయనకు నచ్చజెప్పారు. ఈ నోటీసులపై పవన్ కళ్యాణ్ స్పందన తెలియాల్సి ఉంది.
ఆదివారం ఉదయం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన అధినేత మాట్లాడుతూ.. జనసేనపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పోలీసు కానిస్టేబుల్ కుటుంబం నుంచి వచ్చిన తనకు పోలీసు శాఖపై అమితమైన గౌరవం ఉందని.. ఈ కారణంగానే పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా పెద్దగా పట్టించుకోలేదన్నారు. మాపై జులుం ప్రదర్శిస్తున్న పోలీసులు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఎందుకు పరిష్కరించలేకపోయారని పవన్ ప్రశ్నించారు. పోలీసు శాఖకు గౌరవం ఇవ్వని వ్యక్తి కింద ఇప్పుడు పోలీసులు పనిచేస్తున్నారన్నారు. రాష్ట్రానికి రాజధాని ఒక్కటి మాత్రమే ఉండాలనేది జనసేన అభిమతమని పవన్ అన్నారు. అది అమరావతి అయినా, కర్నూలు అయినా, విశాఖ అయినా తమకు ఇబ్బంది లేదన్నారు. ఏ నగరాన్ని రాజధానిగా ప్రకటించినా తమకేమీ ఇబ్బంది లేదని చెప్పామని పవన్ అన్నారు. రాజధానిని ఒక్కసారే నిర్ణయిస్తారని, రాజు మారినప్పుడల్లా రాజధానిని మారుస్తామంటే ఎలా కుదురుతుందని ఆయన ప్రశ్నించారు.