వైసీపీకి డెడ్ లైన్ విధించిన జనసేనాని

0
752

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేనాని పవన్ కల్యాణ్ కూర్మన్నపాలెంలో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఎందరో పోరాటం చేస్తేనే విశాఖ ఉక్కు పరిశ్రమ సాకారమైందని.. నాడు విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదం అందరిలోనూ భావోద్వేగం నింపిందని.. 32 మంది ఆత్మబలిదానాల అనంతరం విశాఖ ఉక్కు వచ్చిందని అన్నారు. దేశ ప్రగతికి ఉక్కు కర్మాగారాలు ఎంతో ముఖ్యమని.. ప్రభుత్వ రంగ సంస్థలు సుభిక్షంగా ఉండాలని కోరుకునేవారిలో తానూ ఒకడ్నని వివరించారు. అయితే, విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తున్నారన్న వార్త వినగానే ఎంతో బాధ కలిగిందని చెప్పారు. వెంటనే జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో కలిసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి పరిస్థితిని వివరించామని పవన్ వెల్లడించారు. ఇతర పరిశ్రమల్లో పెట్టుబడులు ఉపసంహరించి ప్రైవేటీకరించే ఇతర పరిశ్రమల తరహాలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను చూడొద్దని ఆయనకు నివేదించామని తెలిపారు. ఆంధ్రుల భావోద్వేగాలతో ముడిపడిన అంశమని, 18 వేల మంది రైతులు భూములు వదులుకుంటే స్టీల్ ప్లాంట్ వచ్చిందని అమిత్ షాకు వివరించామని అన్నారు. నాకు ఆనాడు అమిత్ షా ఎందుకు అపాయింట్ మెంట్ ఇచ్చారు? ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారని కాదు… మీరు (ప్రజలు) ఉన్నారనే నాకు అపాయింట్ మెంట్ ఇచ్చారు. ప్రజాబలం ఉంది కాబట్టే నాకు విలువ లభిస్తోందని అన్నారు పవన్ కల్యాణ్. నాకు ఎలాంటి స్వార్థం లేదు.. భావితరాలు బాగుండాలన్నదే నా ఆశయం అని చెప్పుకొచ్చారు. ఏ పరిశ్రమకు నష్టాలు రావో చెప్పండి? ఏ వ్యాపారానికి నష్టాలు రావో చెప్పండి? ఏ పరిశ్రమకు అప్పులు లేవో చెప్పండి? ఒకవేళ నష్టాలు రాని పరిశ్రమ ఉందీ అంటే అది ఒక్క వైసీపీ రాజకీయ పరిశ్రమే అని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

నాడు రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు విశాఖ ఉక్కు పరిశ్రమకు క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలని యూపీఏ ప్రభుత్వాన్ని ఒక్క ఎంపీ కూడా ఎందుకు అడగలేదు? ఆంధ్రాలోని పాతికమంది ఎంపీలు దీనిపై మాట్లాడలేదేం? ఎందుకంటే వారికి పదవులు ముఖ్యం, డబ్బులు ముఖ్యం. వారికి ప్రజల కష్టాలు, కన్నీళ్లు ముఖ్యం కాదు అందుకే వారి మనసులోంచి మాటలు రావు అని అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా అందరం ఉక్కు సంకల్పంతో విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు కలిసి రావాలని పవన్ పిలుపునిచ్చారు. ఆంధ్రావాళ్లకు ఎప్పుడూ మన వర్గం, మన కులం అనే దరిద్రం ఉంటుంది.. మనందరం ఒక్కటి అనే సదుద్దేశం ఉండదని అన్నారు. దీనివల్ల భావితరాలు నష్టపోతాయని తెలిపారు.

మీ రాష్ట్రం ఎంపీలు ఏంకావాలో చెప్పకపోతే మేం చేయడానికి ఏముంటుందని జాతీయనేతలు అంటున్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు కూడా మీ ఎంపీలు ఏమీ మాట్లాడరు… రాష్ట్రానికి ఏం కావాలో కూడా వారికి తెలియదు… మాకు నష్టం వస్తోందని కూడా వారు చెప్పరయ్యా… అంటూ ఆ జాతీయస్థాయి నేతలు చెబుతున్నారు. దేశంలో ప్రతి పరిశ్రమకు గనులు ఉన్నాయి. టాటా ఉక్కు పరిశ్రమ ఉంది. టాటా స్టీల్ కు జార్ఖండ్ లోనూ, ఒడిశాలోనూ సొంత గనులు ఉన్నాయి. ఇక స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కు మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటకల్లో సొంత గనులు ఉన్నాయి. ఇక్కడ ఏపీలో 22 మంది వైసీపీ ఎంపీలు ఉన్నారు. మనకు ఆ గనులను ఇవ్వాలని, మా స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటామని కేంద్రాన్ని ఒక్క ఎంపీ అయినా నోరెత్తి ఎందుకు అడగరు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖిలపక్షం ఏర్పాటు చేసి అందరినీ పిలిచి కార్యాచరణ రూపొందించాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.. ఇందుకు వారం రోజులు టైమిస్తున్నానన్నారు పవన్‌ కల్యాణ్‌. కల్లబొల్లి కబుర్లు చెప్తే మాత్రం కచ్చితంగా ఉద్యమిస్తానని స్పష్టం చేశారు. ఉక్కు సంకల్పంతో స్టీల్‌ ప్లాంట్‌ కాపాడుకోవాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు.. స్టీల్‌ ప్లాంట్‌ కోసం అన్ని పార్టీలు కలిసిరావాలన్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

11 − 4 =